Brain Eating Amoeba: ప్రస్తుతం కేరళలో అనేక మందిని కలవరపెడుతున్న ఒక భయంకరమైన వ్యాధి గురించి తాజా వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మెదడును తినే అమీబాగా పిలవబడే నాగ్లేరియా ఫౌలెరీ (Naegleria fowleri) కారణంగా కేవలం ఎనిమిది రోజుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాణాంతకమైన వ్యాధి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మందిని భయపెడుతోంది. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు.. జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మెదడు తినే అమీబా అంటే ఏమిటి ?
నాగ్లేరియా ఫౌలెరీ అనేది ఒక సూక్ష్మ ఏకకణ జీవి. ఇది సాధారణంగా వెచ్చని మంచినీటి సరస్సులు, నదులు, చెరువులు, సరిగా శుద్ధి చేయని ఈత కొలనులలో నివసిస్తుంది. ఈ అమీబా శరీరంలోకి ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది. ముక్కు నుంచి మెదడుకు ప్రయాణించి, అక్కడ తీవ్రమైన ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ అనే వ్యాధిని కలిగిస్తుంది.
వ్యాధి ఎలా వ్యాపిస్తుంది ?
ఈ అమీబా కేవలం ముక్కు ద్వారా మాత్రమే శరీరంలోకి ప్రవేశించగలదు. ఇది కలుషితమైన నీటిలో స్నానం చేయడం, ఈత కొట్టడం లేదా నీటిలో తల ముంచడం వంటివి చేయడం ద్వారా వ్యాపిస్తుంది. ఈ అమీబా ఉన్న నీటిని తాగడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. ఇది ఒకరి నుంచి మరొకరికి ఇది సంక్రమించదు.
లక్షణాలు ఏమిటి ?
మెదడులోకి అమీబా ప్రవేశించిన తర్వాత 1 నుంచి 12 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. ప్రారంభ లక్షణాలు సాధారణ మెనింజైటిస్ లేదా ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయి. వాటిలో కొన్ని..
తీవ్రమైన తలనొప్పి
జ్వరం
వికారం, వాంతులు
మెడ పట్టేయడం (మెడ కదలకపోవడం)
వ్యాధి లక్షణాలు:
గందరగోళం
సమతుల్యత కోల్పోవడం
మూర్ఛ
భ్రాంతులు
కోమా
చికిత్స, నివారణ:
నాగ్లేరియా ఫౌలెరీ చాలా అరుదుగా సంక్రమిస్తుంది. కానీ ఇది సంక్రమిస్తే 97% పైగా ప్రాణాంతకంగా మారుతుంది. దురదృష్టవశాత్తు, దీనికి సమర్థవంతమైన చికిత్స అందుబాటులో లేదు. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే మందులు ఇస్తారు. కానీ చాలా సందర్భాలలో అవి పనిచేయవు.
Also Read: జిమ్‌కు వెళ్లలేదు, డైటింగ్ చెయ్యలేదు.. ఏకంగా 40 కిలోలు తగ్గాడు.. అదెలా?
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
వెచ్చని, నిలకడగా ఉన్న మంచినీటిలో ఈత కొట్టడం లేదా తల ముంచడం మానుకోండి.
నీటిలో ముక్కు మూసుకునే క్లిప్‌లను ఉపయోగించడం మంచిది.
స్విమ్మింగ్ చేసే ప్రదేశంలో సరైన క్లోరినేషన్ ఉండేలా చూసుకోండి.
ఇంట్లో ఉపయోగించే నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి.