Climbing Stair Breatheless| మెట్లు ఎక్కిన తర్వాత ఊపిరి ఆడటం లేదా? ఇది కేవలం వయసు మీద పడినట్లు సంకేతం లేదా అలసట వల్లనని అనుకుంటే జాగ్రత్త! కొద్దిపాటి శారీరక శ్రమకే ఊపిరాడకపోవడం సాధారణం కాదు. ఇలా జరగడం అయిదు ముఖ్యమైన ఆరోగ్య సమస్యల సంకేతం కావచ్చు. ఇవి ఏమిటో చూద్దాం.
రక్తహీనత (అనీమియా)
రక్తంలో ఎర్ర రక్తకణాలు లేదా హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే రక్తహీనత వస్తుంది. హిమోగ్లోబిన్ అనేది ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకెళ్తుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే, శరీర కణాలకు తగినంత ఆక్సిజన్ అందదు. ముఖ్యంగా మెట్లు ఎక్కినప్పుడు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. చర్మం పసుపు రంగులోకి మారడం, బలహీనత, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే, ఇది రక్తహీనత సంకేతం కావచ్చు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
గుండె సంబంధిత సమస్యలు
మెట్లు ఎక్కినప్పుడు ఊపిరి ఆడకపోతే.. అది గుండె జబ్బుల సంకేతం కావచ్చు. గుండె సరిగా రక్తాన్ని పంప్ చేయలేకపోతే, ఊపిరితిత్తుల్లో ద్రవం చేరి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. మెట్లు ఎక్కేటప్పుడు తల తిరగడం, కాళ్లు వాచడం, లేదా ఛాతీలో నొప్పి వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇవి కరోనరీ ఆర్టరీ వ్యాధి, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ లేదా ఇతర గుండె సమస్యల సూచనలు కావచ్చు.
ఊపిరితిత్తుల సమస్యలు
ఊపిరితిత్తులు శరీరానికి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. ఊపిరితిత్తుల్లో ఏదైనా సమస్య ఉంటే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఆస్తమా, బ్రాంకైటిస్, ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డీ), లేదా క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) వంటి వ్యాధులు ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తాయి. దగ్గు, గురక, లేదా ఛాతీలో అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే జాగ్రత్తగా ఉండాలి.
ఒత్తిడి, ఆందోళన
కొన్నిసార్లు ఒత్తిడి లేదా ఆందోళన కూడా ఊపిరాడకపోవడానికి కారణం కావచ్చు. అధిక ఒత్తిడి వల్ల శరీరంలో అడ్రినలిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, దీనివల్ల శ్వాస వేగంగా మారి, ఊపిరి సరిగా ఆడనట్లు అనిపిస్తుంది. ఒత్తిడిని నియంత్రించడానికి ధ్యానం, యోగా వంటివి ప్రయత్నించవచ్చు, కానీ ఈ సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
Also Read: మజ్జిగ అందరికీ ఆరోగ్యకరం కాదు.. అలాంటివారికి ఆరోగ్య సమస్యలు
ఊబకాయం (అధిక బరువు)
అధిక బరువు ఉన్నవారిలో శరీరం ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. అదనపు కొవ్వు ఊపిరితిత్తులు, డయాఫ్రామ్‌పై ఒత్తిడి తెస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది. ఊబకాయం వల్ల గుండె కూడా ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఫలితంగా కొద్దిపాటి శారీరక శ్రమకే ఊపిరాడకపోవచ్చు. బరువు తగ్గించడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చు.
మెట్లు ఎక్కిన తర్వాత ఊపిరాడకపోవడం చిన్న విషయంగా అనిపించినా, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యల సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి!