కాలం మారిపోయింది. ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య వచ్చి మీద పడుతుందో తెలియదు. ఆయుర్వేదం కూడా చాలా తక్కువ ఖర్చుతో సింపుల్ పద్ధతిలో ఆరోగ్యాన్ని అందించేందుకు సహాయపడుతుంది. ఇది పురాతన వైద్య విధానం. ఇది శరీరం మొత్తం ఆరోగ్యాన్ని, సమతుల్యతను కాపాడడానికి కొన్ని రకాల ఆహారాలను తినమని సూచిస్తుంది. అలా కొన్ని ఔషధ గుణాలున్న ఆకులను ఖాళీ పొట్టతో తింటే జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, డిటాక్స్ఫికేషన్ వంటివి జరుగుతాయి. ఇలాంటివి జరగడం వల్ల దీర్ఘకాల వ్యాధులు రాకుండా ముందుగానే అడ్డుకోవచ్చు. ఎలాంటి ఆకులను పరగడుపున నమలాలో తెలుసుకోండి.
తులసి ఆకులు
తులసి మొక్క ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ తులసి ఆకులను అడాప్టోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి తింటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఖాళీ పొట్టతో ప్రతిరోజూ నాలుగు నుంచి ఐదు తులసి ఆకులను నమలడం వల్ల శ్వాసకోశ వ్యవస్థకు మంచి జరుగుతుంది. జీర్ణక్రియ ప్రక్రియలకు సహాయపడుతుంది. తులసిలో యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తుంది. తులసి ఆకులు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.
వేపాకులు
వేప ఆకులు అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. కాళీ పొట్టతో కొన్ని వేపాకులను నమలడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. చర్మ సమస్యల బారిన కూడా పడకుండా ఉంటారు. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు ఇందులో ఉంటాయి. కాబట్టి వేపాకులను నమలడం వల్ల నోటి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆసియా పసిఫిక్ జర్నల్ ఆఫ్ ట్రాపికల్ బయో మెడిసిన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్లను నిర్వహించడంలో వేప సమర్థంగా పనిచేస్తుంది.
కరివేపాకులు
కరివేపాకులు ప్రతిరోజూ ఒక గుప్పెడు తీసుకొని పరగడుపున ఖాళీ పొట్టతో నమలాలి. ఇవి జీర్ణ క్రియకు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. అవి ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంచుతాయి. శరీరం ఫ్రీ రాడికల్ డామేజ్ జరగకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్షిస్తాయి. కరివేపాకుల్లో లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరిచే గుణాలు ఉన్నాయి. అలాగే యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు కచ్చితంగా కరివేపాకులను తినాలి.
తమలపాకులు
తమలపాకులు భోజనం చేశాక ఎంతోమంది పాన్ రూపంలో వేసుకుంటారు. నిజానికి తమలపాకులను ప్రతిరోజూ ఉదయం ఖాళీ పొట్టతో తింటే ఎంతో మంచిది. నోరు పరిశుభ్రంగా మారుతుంది. నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మసిటికల్స్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ వారి పరిశోధనల ప్రకారం తమలపాకులను తినడం వల్ల యాంటీ మైక్రోవేవ్ డైజెస్టివ్ లక్షణాలు శరీరంలో చేరుతాయి. ఈ ఆకులు గ్యాస్టిక్ రసాలను ప్రేరేపిస్తాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
పుదీనా ఆకులు
పుదీనా ఆకులు మంచి వాసనను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థకు చల్లదనాన్ని అందిస్తాయి. పుదీనా ఆకులను ఖాళీ పొట్టతో తీసుకోవడం వల్ల అజీర్ణం వంటి సమస్యలు రావు. పేగుల ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ఆకలిని మెరుగుపరుస్తాయి. పొట్ట తిమ్మిరి వంటివి రాకుండా అడ్డుకుంటాయి. జీర్ణాశయంతర రుగ్మతలు రాకుండా ఇన్ఫ్లమేషన్ రాకుండా పుదీనాను ఉపయోగించవచ్చు.
Also Read: నా భర్తకు అలా నిద్రపోవడం అంటే ఇష్టం, నాకేమో అది ఏమాత్రం నచ్చడం లేదు
పైన పేర్కొన్న అన్ని ఆకులు ఆయుర్వేదం ప్రకారం సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. (వైద్యుల సలహాలు, సూచనల తర్వాతే పాటించగలరు. సొంత వైద్య ఎప్పటికీ మంచిది కాదు)