కీమా అనగానే మటన్ కీమా మాత్రమే గుర్తొస్తుంది. నిజానికి చికెన్ కీమాతో కూడా టేస్టీ వంటలు వండుకోవచ్చు. అందులో ఒకటి కీమా పరాటా. చికెన్ కీమాతో పరాటా చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. చికెన్ కీమా పరాటాతో పాటు పక్కన చికెన్ గ్రేవీ ఉంటే ఆ కాంబినేషన్ అదిరిపోతుంది. ఒక్కసారి ఇక్కడ మేము చెప్పిన పద్ధతుల్లో చికెన్ ఖీమా పరాటా చేసి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.
చికెన్ కీమా పరాటా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ కీమా – పావు కిలో
అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు స్పూన్లు
ధనియాల పొడి – రెండు స్పూన్లు
కారం – ఒక స్పూను
గరం మసాలా – అర స్పూను
పసుపు – అర స్పూను
నిమ్మరసం – ఒక స్పూను
నెయ్యి – సరిపడినంత
కొత్తిమీర తరుగు – గుప్పెడు
నీరు – తగినంత
జీలకర్ర పొడి – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
గోధుమపిండి – తగినంత
చికెన్ కీమా పరాటా రెసిపీ
1. ఒక గిన్నెలో గోధుమపిండి, ఒకటిన్నర స్పూను, నూనె, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపండి.
2. ఇప్పుడు నీటిని పోస్తూ పిండి మృదువుగా వచ్చేలా బాగా కలుపుకోండి. పైన టవల్ కప్పి పది నిమిషాలు పక్కన పెట్టేయండి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.
4. ఆ నూనెలో ఉల్లిపాయల తరుగు వేసి బాగా వేయించండి. అది రంగు మారేవరకు వేయించాలి.
5. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించండి.
6. ఆ తర్వాత చికెన్ కీమాను వేసి బాగా వేయించండి. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కలపండి.
7. ఇప్పుడు కారం పొడి, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపండి.
8. ఇది బాగా ఉడకాలంటే ముప్పావు కప్పు నీరు పోసి కలిపి మూత పెట్టండి. పావుగంటసేపు ఉడికించండి.
9. ఇది దగ్గరగా కూర లాగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి.
10. పైన నిమ్మరసం, కొత్తిమీర తరుగు చల్లండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయండి.
11. ఈలోపు గోధుమపిండి నుంచి కొంత ముద్దను తీసి పూరీ లాగా ఒత్తండి.
12. మధ్యలో రెండు స్పూన్ల చికెన్ కీమా వేయండి. ఆ పూరీని మళ్లీ మడత పెట్టేసి పరాటాలాగా ఒత్తుకోండి.
13. పెనం మీద నెయ్యి లేదా నూనె వేసి ఈ పరాటాను రెండు వైపులా వేయించుకోండి.
14. ఇది లేత గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించండి.
15. ఆ తర్వాత ఒక ప్లేట్లో ఈ పరాటాను వేసి పైన బటర్ లేదా నెయ్యి పూయండి. దీన్ని చికెన్ ఇగురుతో తింటే అద్భుతంగా ఉంటుంది.
ఎప్పుడూ ఒకేలా కాకుండా పరాటాను ఇలా భిన్నంగా చేసి తింటే మీకు కూడా కొత్తగా అనిపిస్తుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. పైగా ఇది ఎంతో బలం కూడా. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఇలా చికెన్ కీమా పరాటా… గ్రేవీతో పాటు వడ్డిస్తే వారికి నచ్చడం ఖాయం. దీన్ని చేయడం కూడా చాలా సులువు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సాధారణ చపాతీ చేసినప్పుడు ఈ చికెన్ కీమాను రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది. మధ్యలో స్టఫ్ చేసి పరాటాను ఒత్తుకోవాలి. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా అద్భుతంగా ఉంటుంది.