Colon Cancer Symptoms: ఈ రోజుల్లో ఉద్యోగం సాధించడం ఎంత ముఖ్యమూ.. రోజంతా ఆఫీస్ డెస్క్ ముందే కూర్చుని పని చేయడం అంత సాధారణమైపోయింది. అయితే ఒకప్పుడు కేవలం వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే పేగు క్యాన్సర్ లేదా కొలొరెక్టల్ క్యాన్సర్, ఇప్పుడు యంగ్ ప్రొఫెషనల్స్‌లో కూడా పెరుగుతుండటం నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఆఫీస్‌లో కూర్చుని పని చేయడం నేరుగా క్యాన్సర్‌కు కారణం కాకపోయినా.. దానివల్ల మనం అలవాటు చేసుకునే జీవనశైలే పెద్ద ముప్పుగా మారుతోంది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎనిమిది నుంచి పది గంటల పాటు కదలకుండా ఒకే చోట కూర్చోవడం వల్ల శరీరంలో జీర్ణక్రియ మందగిస్తుంది. దీనికితోడు ఆఫీస్ పని ఒత్తిడిలో సరైన సమయానికి తినకపోవడం, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో మంట, ఊబకాయం పెరుగుతాయి. పీచు పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోకపోవడం, తగినంత నీళ్లు తాగకపోవడం, సిగరెట్ లేదా ఆల్కహాల్ అలవాట్లు పేగుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
Also Read: పళ్ల ఆరోగ్యం బాగుంటే ఆయుష్షు పెరుగుతుందా? 1.90 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో ఏం తేలిదంటే!
ఈ రకం క్యాన్సర్ ప్రారంభంలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు చూపించకుండానే పెరుగుతుంది. అయితే మలంలో రక్తం పడటం, తరచూ విరేచనాలు లేదా మలబద్ధకం రావడం, మోషన్ వెళ్లినా కడుపు పూర్తిగా ఖాళీ కాలేదనే భావన ఉండటం, పదే పదే కడుపునొప్పి రావడం వంటివి గమనించాలి. అలాగే కారణం లేకుండా బరువు తగ్గడం, నీరసంగా అనిపించడం జరిగితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది.
వైద్యులు సాధారణంగా లక్షణాలను బట్టి కొలొనోస్కోపీ పరీక్షను సిఫార్సు చేస్తారు. ఇందులో ఒక చిన్న కెమెరా సాయంతో పేగు లోపలి భాగాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ ఏదైనా అసాధారణ పెరుగుదల లేదా పాలిప్స్ కనిపిస్తే.. వాటిని బయాప్సీ చేసి క్యాన్సర్ ఉందో లేదో నిర్ధారిస్తారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే రోబోటిక్ లేదా ల్యాప్రోస్కోపిక్ సర్జరీల ద్వారా చాలా తక్కువ కోతలతో, త్వరగా కోలుకునేలా చికిత్స అందించవచ్చు. క్యాన్సర్ తీవ్రతను బట్టి కీమోథెరపీ లేదా రేడియేషన్ ఇస్తారు.
ఈ సమస్య నుంచి బయటపడటానికి మన దైనందిన అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఆఫీస్ పని మధ్యలో ప్రతీ గంటకూ కాసేపు లేచి నడవడం, మంచినీళ్లు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి. రోజూ సరైన నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం. మైదా, జంక్ ఫుడ్స్ తగ్గించి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు.
Also Read: ఆఫీస్ వేర్‌లో క్లాసీగా కనిపించాలంటే.. ఈ 5 వార్డ్‌రోబ్ ఎసెన్షియల్స్ మీ దగ్గర ఉండాల్సిందే!