Navratri Fasting: నవరాత్రి పండగ హిందూ సంస్కృతిలో చాలా ముఖ్యమైన పండగ. దీనిని తొమ్మిది రాత్రులు. పది పగళ్లు జరుపుకుంటారు. అయితే ఈ సమయంలో చాలా మంది దుర్గాదేవిని పూజిస్తూ ఉపవాసం పాటిస్తారు.ఈ ఉపవాస సమయంలో చాలా మంది కొన్ని రకాల పొరపాట్లు చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. నవరాత్రి ఉపవాసంలో సాధారణంగా చేసే పొరపాట్లను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
.సరైన ప్రణాళిక లేకపోవడం:
చాలామంది ఉపవాసం మొదలుపెట్టే ముందు సరైన ప్రణాళిక చేసుకోరు. ముఖ్యంగా.. ఉపవాసం మొదలుపెట్టడానికి ముందు రోజు రాత్రి త్వరగా నిద్రపోవాలి. దీని వల్ల శరీరం ఉపవాసానికి సిద్ధమవుతుంది. ఉపవాసానికి ఒకరోజు ముందు తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం చాలా మంచిది.
నీరు తక్కువగా తాగడం: ఉపవాసం చేసేటప్పుడు చాలామంది నీరు తాగడంపై శ్రద్ధ పెట్టరు. దీనివల్ల డీహైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అందుకే.. రోజంతా సరిపడా నీరు, కొబ్బరి బొండం, నిమ్మకాయ రసం, పండ్ల రసాలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
అల్పహారం ఎక్కువగా తీసుకోవడం:
ఉపవాసంలో పండ్లను, ఫలహారాలను తీసుకోవడం మంచిదే. కానీ.. చిరుతిళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు, నవరాత్రి ఉపవాసం సమయంలో ఆలుగడ్డలు, సగ్గుబియ్యం వంటి వాటితో తయారుచేసిన స్నాక్స్ ఎక్కువగా తింటారు. ఇలాంటి వాటికి బదులుగా.. బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది.
పోషకాలు తక్కువగా తీసుకోవడం:
శక్తి లేకపోవడం, బలహీనంగా అనిపించడం వంటివి ఉపవాసంలో సాధారణం. ఇది పోషకాల లోపం వల్ల జరుగుతుంది. ఉపవాసం చేసేటప్పుడు, పాలు, పెరుగు, పన్నీర్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలను, పండ్లు, కూరగాయలు వంటి వాటిని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది.
ఆకలి వేసినప్పుడు ఎక్కువగా తినడం:
కొంతమంది ఉపవాసం తరువాత.. బాగా ఆకలి వేసి ఒకేసారి ఎక్కువగా తింటారు. ఇలా చేయడం వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి. ఆకలి వేసినప్పుడు, కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం మంచిది. ఉపవాసం విరమించిన తరువాత.. పండ్లు, పెరుగు వంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
Also Read: పీనట్ బటర్ తింటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
నిద్ర లేకపోవడం:
ఉపవాసంలో శరీరం విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో తగినంత నిద్ర లేకపోతే అలసట, బలహీనత వంటివి వస్తాయి. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. దీనివల్ల శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉంటాయి.
నవరాత్రి ఉపవాసంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా.. మీరు శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ ఉపవాసం కేవలం మత పరమైన ఆచారం మాత్రమే కాదు.. ఇది శరీరాన్ని, మనస్సును శుద్ధి చేయడానికి కూడా సహాయ పడుతుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా.. నవరాత్రి పండుగను మీరు పూర్తిస్థాయిలో ఆస్వాదించవచ్చు.