Curd Health Benefits: పెరుగు మన తెలుగు వారి ఆహారంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఎండాకాలం అయినా, వర్షాకాలం అయినా భోజనం చివర్లో పెరుగు లేకపోతే చాలామందికి ఆ అన్నం పూర్తి అయినట్టుగా అనిపించదు. పెరుగు శరీరానికి చల్లదనం ఇస్తుంది, జీర్ణక్రియ సజావుగా జరిగేలా చేస్తుంది, ఎసిడిటీ తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే ప్రొబయోటిక్స్ అనే మంచి బ్యాక్టీరియా శరీరానికి శక్తి, రోగనిరోధక శక్తి ఇస్తాయి. అయితే పెరుగు అన్నింటితో కలిపి తింటే మంచిదని అనుకుంటే అది మన పొరపాటే. కొన్ని ఆహారాలతో కలిపి తింటే అది శరీరానికి మేలు చేయకుండా సమస్యలను దారి తీస్తుంది. అలాంటి ఆహార పదార్థాల గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం.
చేపల కూరతో పెరుగు అస్సలు వద్దు..!
మన తెలుగు వారు ఎక్కువగా ఇష్టపడే వంటకాలలో చేపల కూర ఒకటి. చేపలు శరీరంలో వేడి పెంచే గుణం కలిగివుంటాయి. మరోవైపు పెరుగు చల్లదనాన్ని ఇస్తుంది. ఈ రెండు వేరు వేరు లక్షణాలు కలసి శరీరంలోకి వెళ్తే జీర్ణక్రియ సరిగా జరగదు. దీని ఫలితంగా అజీర్ణం, కడుపు ఉబ్బరం, అలసట లాంటి ఇబ్బందులు కలుగుతాయి. అందుకే చేపల వంటకాలు తిన్న రోజున పెరుగు తినకుండా ఉంటే ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.
పెరుగు + అరటి తింటే కఫ సమస్యలు..
కొంతమంది పెరుగులో అరటి పండును వేసుకుని తినడాన్ని ఇష్టపడతారు. అది తినడానికి రుచిగా అనిపించినా, ఆరోగ్యపరంగా ఇది సమస్యకు దారి తీస్తుంది. అరటి శరీరంలో కఫాన్ని పెంచే స్వభావం కలిగి ఉంటుంది. పెరుగు కూడా చల్లదనాన్ని కలిగించే ఆహారం. ఇవి రెండూ కలిపి తిన్నప్పుడు శరీరంలో కఫ సంబంధిత సమస్యలు, జలుబు, దగ్గు, గొంతు సమస్యలకు దారితీస్తుంది.
పాలు, పెరుగు తినడం మంచిదికాదు..!
పాలు, పెరుగు రెండూ పాల ఉత్పత్తులే అయినప్పటికీ వీటిని కలిపి తినడం తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. ఇవి రెండూ జీర్ణక్రియలో వేరువేరుగా పనిచేస్తాయి. పాలు, పెరుగు కలిపి తింటే వికారం, గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు, శరీరంలో హానికరమైన విషపదార్థాలు పేరుకుపోవడానికి కూడా ఇది కారణమవుతుంది.
Also Read: Flipkart Offer: ఎంత షాపింగ్ చేసినా సేవింగ్స్ గ్యారెంటీ.. ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్
పెరుగుతో మామిడి పండు కూడా వద్దు..!
చాలామంది మామిడికాయ తిన్న తర్వాత పెరుగు తినడాన్ని ఇష్టపడతారు. అయితే దీని వల్ల చర్మ సమస్యలు రావచ్చు. మామిడిలో ఉండే వేడి, పెరుగులో ఉండే చల్లదనం కలిసినప్పుడు శరీరానికి అది సరిపోదు. దీని ప్రభావం చర్మంపై రాషెస్ (Rashes), మచ్చలు, అలెర్జీలు రావచ్చు.
పెరుగు – ఉల్లి రెండూ కలిపి తిన్నా ప్రమాదమే!
ఉల్లిపాయ శరీరానికి వేడిని ఇస్తుంది. పెరుగు మాత్రం చల్లదనం ఇస్తుంది. ఈ రెండింటిని కలిపి తింటే జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. దీనివల్ల కడుపులో గ్యాస్ సమస్యలు రావచ్చు. దీర్ఘకాలంగా అలవాటు చేస్తే కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి.
పెరుగుతో పులుపు పదార్థాలు వద్దు
పెరుగులో సహజంగానే పులుపు ఉంటుంది. దానితో పాటు నిమ్మరసం, చింతపండు, టమాటో లాంటి పుల్లని పదార్థాలు కలిపి తింటే ఎసిడిటీ మరింతగా పెరుగుతుంది. కడుపులో మంట, ఉబ్బరం, వాంతులు రావచ్చు.
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఏ ఆహారం అయినా సరైన విధంగా తింటేనే శరీరానికి మేలు చేస్తుంది. పెరుగు తింటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది, శక్తి పెరుగుతుంది, శరీరం చల్లగా ఉంటుంది. అయితే పై చెప్పిన పదార్థాలతో కలిపి తింటే మాత్రం సమస్యలు తప్పవు. కాబట్టి పెరుగును ఎప్పుడూ వేరుగా, భోజనం తర్వాత మాత్రమే తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.