Kidney Problems: కిడ్నీ సమస్యలు శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తాయి. వాటిలో కళ్ళు కూడా ఒకటి. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు, రక్తనాళాలు, కణజాలం, నరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీనివల్ల కళ్ళలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని ముఖ్యమైన కంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అవి కిడ్నీ జబ్బులను సూచిస్తాయి.
1. కళ్ళ చుట్టూ వాపు:
ఉదయం నిద్ర లేవగానే కళ్ళ చుట్టూ వాపు కనిపించడం ఒక సాధారణ సమస్య. ఇది ఎక్కువగా అలసట లేదా నిద్ర లేమి కారణంగా వస్తుంది. కానీ.. ఇది తరచుగా, తీవ్రంగా ఉంటే కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు. కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు.. శరీరంలో అదనపు ద్రవాలు, వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. ఈ ద్రవాలు కళ్ళ చుట్టూ ఉన్న సున్నితమైన కణజాలంలో చేరి.. వాపుకు కారణమవుతాయి. దీన్నే పెరియోర్బిటల్ ఎడెమా అని అంటారు. ఇది ప్రోటీనురియాకు కూడా ఒక సూచన.
2. కళ్ళు ఎర్రబడటం, దురద:
చాలాసార్లు కళ్ళు ఎర్రబడటం.. అలర్జీలు లేదా కంటి ఒత్తిడి వల్ల వస్తాయి. కానీ, కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు, శరీరంలో టాక్సిన్లు, యూరియా పేరుకుపోతాయి. ఇది రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా కళ్ళలోని రక్తనాళాలను. ఈ యూరియా కళ్ళ ఉపరితలంపై పేరుకుపోయి, కంటి దురద, ఎర్రదనానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్‌ని సంప్రదించడం అవసరం.
3. చూపు మసకబారడం:
చాలామంది కంటి సంబంధిత సమస్యలు ఎదురయితే.. వయసు పెరగడం వల్ల మాత్రమే అని అనుకుంటారు. కానీ, కిడ్నీలు దెబ్బతింటే రక్తపోటు (హైపర్‌టెన్షన్) పెరుగుతుంది. హైబీపీ కళ్ళలోని రెటీనాలోని చిన్న రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతుంది. దీనివల్ల రెటీనా దెబ్బతిని, చూపు మసకబారడం, కొన్నిసార్లు కంటి చూపు కోల్పోవడం కూడా జరగుతుంది. దీన్ని హైపర్‌టెన్సివ్ రెటినోపతి అంటారు.
4. డ్రై ఐస్ :
కిడ్నీ జబ్బులు ఆటోఇమ్యూన్ డిసీజెస్‌తో సంబంధం కలిగి ఉంటాయి. కొన్ని సార్లు ఇవి కంటిలోని తేమను తగ్గిస్తాయి. శరీరంలో ద్రవాలు, లవణాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు కంటికి కావాల్సిన తేమ ఉత్పత్తి కాదు. దీనివల్ల కళ్ళు పొడిగా మారి, మంట, నొప్పిగా అనిపిస్తాయి.
5. కళ్ళ ముందు నల్లని చుక్కలు:
కళ్ళ ముందు నల్లని చుక్కలు లేదా దారాల వంటి ఆకారాలు కదలడం సాధారణమే. కానీ.. ఇవి హైబీపీ లేదా కిడ్నీ సమస్యల వల్ల రెటీనా దెబ్బతింటే వస్తాయి.తరచుగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.