Energy Yoga Under Sun| రోజంతా ఆరోగ్యంగా ఉండాలంటే. ఉదయాన్నే వ్యాయామం, యోగా వంటివి చేయాలి. ఆరోగ్యకరమైన రొటీన్ ఉంటే మీ రోజు ఉత్సాహంగా, ఉత్పాదకంగా సాగుతుంది. ఉదయం చేసే అనేక ఆరోగ్యకర కార్యకలాపాలలో, సూర్యకాంతిలో యోగా సాధన చేయడం మీ శరీరం, మనసు, ఆత్మకు శక్తిని అందిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి, శక్తిని పెంచే ఈ 6 సులభ యోగాసనాలను ప్రతిరోజూ సూర్యకాంతిలో యోగా సాధన చేయండి.
తాడాసనం (మౌంటైన్ పోజ్)
తాడాసనం అనేది శరీరాన్ని చైతన్యవంతం చేసే సులభమైన యోగాసనం. ఈ భంగిమ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, స్థిరత్వాన్ని, మానసిక స్పష్టతను పెంచుతుంది. ఉదయం సూర్యకాంతిలో ఈ ఆసనం సాధన చేయడం వల్ల శరీరంలోని కండరాలు ఉత్తేజితమై, రోజంతా శక్తివంతంగా ఉంటాయి. ఇది ఉదయపు అలసటను తొలగించడంలో సహాయపడుతుంది.
సూర్య నమస్కారం (సన్ సల్యూటేషన్)
సూర్య నమస్కారం ఉదయ యోగా సాధనకు పరిపూర్ణమైన ఆసనం. శరీరంలో వేడిని పుట్టించి, మనసు ప్రశాంతంగా ఉండేందుకు సాయపడుతుంది. ఉదయం ఈ ఆసనం సాధన చేయడం వల్ల అలసట, నీరసం తొలగి, శరీర అవయవాలు శుద్ధి అవుతాయని యోగా నిపుణులు చెబుతారు. ఈ ఆసనం మీ రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది.
వీరభద్రాసనం II (వారియర్ II పోజ్)
వీరభద్రాసనం II శరీరం, మనో బలం, శక్తిని పెంచే అద్భుత ఆసనం. ఇది సమతుల్యతను, స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. సూర్యకాంతిలో ఈ ఆసనం సాధన చేయడం వల్ల తుంటి, ఛాతీ సహజంగా తెరుచుకుని, శరీరం ఉత్తేజితమై, రిలాక్స్‌గా ఉంటుంది. ఉదయం అలసటను దూరం చేయడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది.
ఉస్త్రాసనం (కామెల్ పోజ్)
ఉస్త్రాసనం ఉదయం శరీరాన్ని చైతన్యవంతం చేయడానికి అద్భుతమైన ఆసనం. ఇది ఛాతీ, భుజాలను విస్తరింపజేస్తూ, అడ్రినల్ గ్రంథులను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల శరీరం, మనసు సహజంగా శక్తివంతమై, సానుకూలంగా మారుతాయి.
అధోముఖ శ్వానాసనం (డౌన్‌వర్డ్ ఫేసింగ్ డాగ్)
ఈ ఆసనం శరీరమంతా సాగదీసే అద్భుత వ్యాయామం. ఇది మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరిచి, శరీరం, మనసును శక్తివంతంగా, సానుకూలంగా మారుస్తుంది. సూర్యకాంతిలో ఈ ఆసనం సాధన చేయడం వల్ల వెన్నెముక సాగుతూ, అలసిన కండరాలకు తక్షణ శక్తి లభిస్తుంది.
అర్ధ మత్స్యేంద్రాసనం (హాఫ్ లార్డ్ ఆఫ్ ఫిషెస్ పోజ్)
ఈ ఆసనం చాలా ప్రశాంతమైనది. ప్రభావవంతమైన ఈ ఆసనంతో మీ యోగా సాధనను ముగించండి. ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తూ, శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. సూర్యకాంతిలో ఈ ఆసనం సాధన చేయడం వల్ల అంతర్గత అవయవాలు రీఛార్జ్ అవుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది.
Also Read: గుండె పోటు వస్తే వెంటనే సిపిఆర్ చేయాలి.. ఎలా చేయాలో తెలుసా?
ఈ 6 సులభ యోగాసనాలను ప్రతిరోజూ ఉదయం సూర్యకాంతిలో సాధన చేయడం వల్ల శరీరం, మనసు శక్తివంతమై, రోజంతా ఉత్సాహంగా ఉంటాయి. ఈ ఆసనాలు అలసటను తొలగించి, ఆరోగ్యకరమైన రోజును ప్రారంభించడానికి సహాయపడతాయి.