ప్రపంచవ్యాప్తంగా పరీక్షల్లో పేపర్ లీక్‌లు, మాస్ కాపీయింగ్, సిండికేట్ మోసాలు పెరుగుతున్నాయి. ఈ ఘటనలు మెరిట్ ఆధారంగా జరిగే పరీక్షలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. అందుకే అనేక దేశాలు పరీక్షల్లో అక్రమాలు అరికట్టేందుకు కఠిన చట్టాలను అమలు చేస్తున్నాయి. భారత్‌లో కూడా నీట్ యూజీ 2026 పేపర్ లీక్ ఘటన తర్వాత ఈ అంశంపై చర్చ మరింత పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మరింత కఠినమైన చట్టాలను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
చైనాలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష అయిన గావ్కావో కు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. పరీక్షల్లో మోసం చేయడం, ఇతరులతో రాయించడం, ప్రశ్నాపత్రాలు లేదా సమాధానాలు లీక్ చేయడం నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి నేరాలకు గరిష్ఠంగా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అదనంగా జరిమానాలు కూడా విధిస్తారు. మోసానికి పాల్పడిన విద్యార్థుల ఫలితాలను వెంటనే రద్దు చేస్తారు. భవిష్యత్ పరీక్షల నుంచి కూడా వారిని కొన్ని సంవత్సరాల పాటు నిషేధించవచ్చు.
దక్షిణ కొరియా పరీక్షల్లో మోసాన్ని ఏమాత్రం సహించదు. పేపర్ లీక్ చేసి విక్రయించే సిండికేట్ మోసగాళ్లకి 5 వరకు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించవచ్చు. అధికారులు కృత్రిమ మేధస్సు పరికరాలు, బ్లూటూత్ డివైస్‌లు, ప్రాక్సీ అభ్యర్థులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు. మోసం బయటపడితే యూనివర్సిటీ ప్రవేశాన్ని రద్దు చేయడంతో పాటు ఇప్పటికే పొందిన డిగ్రీలను కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది.
అమెరికాలో పరీక్షల్లో మోసంపై ఒకే జాతీయ చట్టం లేదు. ప్రతి రాష్ట్రం తన చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటుంది. కాలేజ్ బోర్డ్, ఏసీటీ వంటి పరీక్షల నిర్వహణ సంస్థలు మోసం చేసిన వారి ఫలితాలను రద్దు చేస్తాయి. భవిష్యత్ పరీక్షలకు శాశ్వత నిషేధం కూడా విధించవచ్చు. పరీక్షల్లో సిండికేట్ మోసాలకు గుర్తింపు దొంగతనం, కుట్ర, మోసం వంటి కేసులు నమోదు చేస్తారు. తీవ్రమైన నేరాలకు గరిష్ఠంగా 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
ఫ్రాన్స్‌లో వేరొకరి పేరుతో పరీక్ష రాయడం వంటి నేరాలకు గరిష్ఠంగా పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 లక్షల యూరోల వరకు జరిమానా విధించవచ్చు. అకడమిక్ డిగ్రీలను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో సాధారణ విద్యార్థుల కాపీయింగ్‌ను విద్యాసంస్థలే పరిష్కరిస్తాయి. అయితే డబ్బు తీసుకుని మోసానికి సహకరించే సంస్థలు, నకిలీ పత్రాలు ఉపయోగించడం, వేరొకరి పేరుతో పరీక్ష రాయడం వంటి నేరాలకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.
Also Read: ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు కట్ చేస్తే ఈ రోజు కోటీశ్వరుడు.. రోజుకు రూ.6.3 లక్షల ఆదాయం
జపాన్‌లో ప్రశ్నాపత్రాల లీక్, పరీక్షల గోప్యతా సమాచారాన్ని దొంగిలించడం వంటి నేరాలకు కఠిన చర్యలు తీసుకుంటారు. సింగపూర్‌లో బ్లూటూత్ పరికరాలు, రహస్య కెమెరాలు వంటి సాంకేతిక పద్ధతులతో మోసం చేసే వారిపై 4 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. నిజమైన అభ్యర్థుల స్థానంలో పరీక్షలు రాసే ప్రాక్సీ అభ్యర్థులను భవిష్యత్ పరీక్షల నుంచి శాశ్వతంగా నిషేధించవచ్చు.
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం-2024లో కేంద్ర ప్రభుత్వం మార్పులు ప్రతిపాదించింది. తాజాగా యాంటి పేపర్ చట్టం 2026 లోక్ సభ, రాజ్య సభలో బిల్లు ఆమోదించబడింది. కొత్త చట్టం ప్రకారం.. పేపర్ లీక్‌లు, సంఘటిత పరీక్షల మోసాలకు కనీస జైలు శిక్షను 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచాలని యోచిస్తోంది. వ్యక్తులపై గరిష్ఠ జరిమానాను రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచే ప్రతిపాదన ఉంది. పరీక్షల నిర్వహణ సంస్థలకు రూ.5 కోట్ల వరకు జరిమానాతో పాటు ఎనిమిదేళ్ల నిషేధం విధించవచ్చు. మోసంలో పాల్గొన్న ఉన్నతాధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
పేపర్ లీక్ చేసే గ్యాంగ్‌ల కోసం.. పేపర్ లీక్ రాకెట్లను నిర్వహించే సంస్థలు లేదా ముఠాలపై రూ.1 కోటి స్థానంలో రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. గరిష్ఠ జైలు శిక్షను 7 సంవత్సరాలకు పెంచనున్నారు.
పరీక్షల నిర్వహణ సిబ్బందికి, పరీక్షల్లో అక్రమాలకు సహకరించిన డైరెక్టర్లు, యాజమాన్య ప్రతినిధులు లేదా ఇతర బాధ్యులపై గరిష్ఠంగా 5 సంవత్సరాల జైలు శిక్ష విధించే ప్రతిపాదన ఉంది.
Also Read : టాలెంట్ అంటే ఇదీ.. తనకు అడ్మిషన్ ఇవ్వలేదని ఐఐటి మద్రాస్ వెబ్‌సైట్ హ్యాక్ చేసిన విద్యార్థి
ప్రతిపాదిత మార్పుల ప్రకారం పరీక్షల మోసాల దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు రోజువారీ విచారణ నిర్వహించి, ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన మూడు నెలల్లో కేసులను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సంఘటిత మోసాలను దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేయడంతో పాటు, అప్పీళ్ల కోసం ప్రత్యేక హైకోర్టు బెంచ్‌లను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ప్రపంచంలోని అనేక దేశాలు పరీక్షల్లో మోసాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నాయి. జైలు శిక్షలు, భారీ జరిమానాలు, విద్యాపరమైన నిషేధాలతో అక్రమాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నాయి. భారత్‌లో ప్రతిపాదించిన కొత్త చట్ట సవరణలు అమల్లోకి వస్తే పేపర్ లీక్‌లను తగ్గించడంతో పాటు పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు