రాజస్థాన్‌లోని ఒక జిల్లా శ్రీ గంగానగర్. ఆ జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన జరిగింది. పెస్టిసైడ్స్ తో కూడిన క్యాబేజీ ఆకును తిని ఒక 14 ఏళ్ల బాలిక మరణించింది. ఆమె క్యాబేజీ ఆకును తెంపి నేరుగా ఆకును తినేసింది. దీంతో బాలికకు వికారంగా అనిపించింది. ఇంటికి వచ్చినా కూడా తీవ్ర అనారోగ్యం పాలవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. మధ్యలో వారం పాటు ఎంతో చికిత్స చేసినా కూడా ఆమె ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. క్యాబేజీ పై ఉన్న పెస్టిసైడ్స్ ఆమె ప్రాణాన్ని బలిగొన్నట్టు తెలుస్తోంది.
క్యాబేజీలకు అధికంగా పురుగు పడుతుందని క్రిమిసంహారక మందులు అధికంగా చల్లుతూ ఉంటారు. ఎన్నో రకాల రసాయనాలను చల్లుతూ ఉంటారు. పురుగుల మందులు వేయని క్యాబేజీలు మార్కెట్లో దొరకడం కష్టమే. అలా పరిశుభ్రంగా లేని పురుగుల మందులతో కూడిన ఒక ఆకును తినడం వల్లే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. క్యాబేజీతో పాటు మరికొన్ని కాయగూరల్లో పెస్టిసైడ్స్ అధికంగా ఉండే అవకాశం ఉంది.
పాలకూర
త్వరగా కలుషితానికి గురయ్యే ఆకుకూరల్లో ఇది ఒకటి. వీటిలో ఆర్గానోఫాస్పేట్లు ఉంటాయి. వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. అలాగే పాలకూరపై పురుగుమందుల అవశేషాలు కూడా అధికంగా ఉంటాయి. అవి తెలియకుండా మన శరీరంలోకి వెళ్తే నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కాలే
కాలే అనేది మరొక ప్రసిద్ధమైన ఆకుకూర. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాకపోతే దీనిలో అధిక పురుగు మందుల అవశేషాలు ఉంటాయి. క్యాబేజీపై ఉపయోగించే క్రిమిసంహారకాలు వీటిలో కూడా వాడతారు. కాబట్టి ఇవి తింటే జీర్ణ సమస్యలు, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు వస్తాయి. కాబట్టి కాలేను నీటిలో నానబెట్టి పరిశుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి.
టమోటోలు
టమోటోలు అన్ని ఇళ్లల్లో అధికంగా వాడతారు. కానీ వీటిని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా శుభ్రపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టమోటోలను క్రిమిసంహారక మందులతో క్లీన్ చేస్తారు. ఆ అవశేషాలు టమోటోలపై అలా ఉండిపోతాయి. వాటిని నేరుగా తింటే క్యాన్సర్ కారకంగా కూడా మారుతుంది. కాబట్టి టమోటాలు ఉన్న వాడేటప్పుడు జాగ్రత్త.
కొల్లార్డ్ గ్రీన్స్
ఇది కూడా ఒక రకమైన ఆకుకూర. సూపర్ మార్కెట్లలో అధికంగా లభిస్తాయి. వీటిలో కూడా అధిక స్థాయిలో పురుగుమందుల అవశేషాలు ఉంటాయి. పాలకూర పై చల్లే పురుగుమందు వీటిపై కూడా చల్లుతారు. కొల్లార్డ్ గ్రీన్స్ పై పురుగుమందుల అవశేషాలు అధికంగా ఉండే అవకాశం ఎక్కువ.
Also Read: ముందు రోజు రాత్రి స్వీట్లు అధికంగా తిన్నారా? స్వీట్ హ్యాంగోవర్ నుంచి ఇలా తప్పించుకోండి
సెలెరి
సెలెరి అనేది కూడా ఒక రకమైన ఆకుకూరే. ఇది చూడటానికి కొత్తిమీరలా ఉంటుంది. దీనిలో అధిక స్థాయిలో పురుగుమందుల అవశేషాలు ఉంటాయి. వీటిలో పెస్ట్ కంట్రోల్ చేయడానికి అధికంగా క్రిమిసంహారక మందులను చల్లుతూ ఉంటారు. అవి అనుకోకుండా మన శరీరంలో చేరితే హార్మోన్లు అసమతుల్యత ఏర్పడుతుంది.
ఇక్కడ చెప్పిన కూరగాయలే కాదు, స్ట్రాబెర్రీలు ద్రాక్ష వంటి వాటిలో కూడా అధికంగానే పురుగుమందులను వినియోగిస్తారు. వీటిని కూడా పరిశుభ్రంగా కడుక్కున్న తర్వాతే తినాల్సిన అవసరం ఉంది.