Hair Transplant: జీవనశైలి, ఆహారపు అలవాట్లలో లోపాల కారణంగా.. యువతలో కూడా జుట్టు సంబంధిత సమస్యలు, బట్టతల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. జుట్టు రాలడం, బట్టతల మీ అందాన్ని పాడు చేయడమే కాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా బలహీనపరుస్తాయి. దీనిని నివారించడానికి.. చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పై ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కొన్ని వార్తలు ఆందోళనలను కలిగిస్తున్నాయి. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అంటే ఏమిటో తెలుసుకోండి ?
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఆరోగ్యకరమైన జుట్టు కుదుళ్లను తలలోని బట్టతల భాగానికి మార్పిడి చేయడం ద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సమయంలో.. తల వెనుక భాగం, గడ్డం, కాళ్ళతో పాటు మీ శరీరంలో వివిధ భాగాల్లో ఉండే.. ఆరోగ్యకరమైన జుట్టును బట్టతల ఉన్న చోట మారుస్తారు. ఈ ప్రక్రియ సాధారణంగా మందులు, ఇతర చికిత్సలు పని చేయనప్పుడు లేదా బట్టతల ప్రాంతంలోని వెంట్రుకల కుదుళ్లు పూర్తిగా మూసుకుపోయినప్పుడు, సహజంగా జుట్టు తిరిగి పెరిగే అవకాశం తక్కువగా ఉన్నప్పుడు నిర్వహిస్తారు.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ మొదటగా 1939 సంవత్సరంలో జపాన్‌లో ప్రారంభించబడింది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతోంది.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సురక్షితమేనా ?
ఇటీవలి కాలంలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత మరణాల కేసులు పెరుగుతున్న తీరు, జుట్టు మార్పిడి నిజంగా సురక్షితమేనా అనే ప్రశ్నను ప్రజల మనస్సులలో లేవనెత్తుతోంది.
అర్హత కలిగిన, అనుభవజ్ఞుడైన, ప్లాస్టిక్ సర్జన్ చేత హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకుంటే నష్టం ఏమీ ఉండదు. ఏదైనా శస్త్రచికిత్సా విధానం మాదిరిగానే.. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
Also Read: మస్కరా వాడుతున్నారా ? కంటి సమస్యలు గ్యారంటీ !
ఆటో ఇమ్యూన్ వ్యాధులు, డయాబెటిస్, రక్తపోటు ఎక్కువగా ఉండటం, రక్తం గడ్డకట్టడంలో సమస్య ఉన్నవారు, అలెర్జీ సమస్యలు ఉన్నవారు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవద్దని డాక్టర్లు సలహా ఇస్తారు. ఈ పరిస్థితులను తెలుసుకోకుండా లేదా విస్మరించకుండా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే.. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.