Non Stick Cookware: ప్రస్తుతం ప్రతి వంటగదిలో నాన్ స్టిక్ పాత్రలు ఒక భాగంగా మారిపోయాయి. నాన్ స్టిక్ పాత్రల్లో ఆహార పదార్థాలు తయారు చేయడం సులభం. అంతే కాకుండా వీటిని శుభ్రం చేయడం కూడా తక్కువ సమయంలోనే పూర్తవుతుంది.
అందుకే చాలా మంది వీటిని వాడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ నాన్ స్టిక్ వంట పాత్రలు వాడుతున్న చాలా మందికి ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలియదు. అవును నాన్ స్టిక్ పాత్రల్లో తయారు చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రసాయనాల ప్రమాదం:
నాన్-స్టిక్ వంట సామాగ్రిని తయారు చేయడానికి పాలి టెట్రాఫ్లోరోఎథిలిన్ (PTFE) అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఇది ఆహారం అంటుకోకుండా నిరోధించే సింథటిక్ పదార్థం. అయితే, ఈ పాత్రను వేడి చేసినప్పుడు అవి విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. ఇలాంటి సమయంలోనే విషపూరిత పొగలను కూడా విడుదల చేస్తుంది. ఈ పొగలను పీల్చడం వల్ల తలనొప్పి, తలతిరుగుడు, ఫ్లూ లాంటి లక్షణాలు వస్తాయి. ఎక్కువసేపు నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
పెర్ఫ్లోరోక్టానోయిక్ యాసిడ్ (PFOA) :
నాన్-స్టిక్ వంట సామాగ్రిని తయారు చేసే ప్రక్రియలో PFOA అనే రసాయనాన్ని కూడా ఉపయోగిస్తారు. ఈ రసాయనం ఆరోగ్యానికి హానికరమని చెబుతారు. PFOA కి గురికావడం వల్ల క్యాన్సర్, థైరాయిడ్ , కాలేయం దెబ్బతినడం, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు చాలా కంపెనీలు PFOA లేని ఉత్పత్తులను తయారు చేస్తున్నప్పటికీ, గతంలో తయారు చేసిన పాత్రల్లో దీనిని ఉపయోగించారు. కొందరు నాన్ స్టిక్ పాత్రలను ఏళ్ల పాటు ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి.
వేడి చేయడం వల్ల నష్టాలు:
నాన్-స్టిక్ వంట పాత్రలను చాలా ఎక్కువ సమయం వేడి చేసినప్పుడు, దానిపై ఉండే పూత విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పాత్రల్లోనే మనం ఆహారం తయారు చేసినప్పుడు రసాయనాలకు సంబంధించిన చిన్న కణాలు ఆహారంలో చేరతాయి. ఈ కణాలు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత విషపూరితంగా మారతాయి. దీనివల్ల జీర్ణవ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి .
ఎక్కువగా వాడితే నష్టం:
నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరంలో రసాయనాలు పేరుకుపోతాయి. ఈ రసాయనాలు శరీరంలో నెమ్మదిగా దీర్ఘకాలంలో తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. ముఖ్యంగా ఇది హార్మోన్ల అసమతుల్యత, సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తుంది.
పర్యావరణంపై ప్రభావం:
నాన్-స్టిక్ వంట సామాగ్రిని తయారు చేసి నాశనం చేసే ప్రక్రియ కూడా పర్యావరణానికి హాని కలిగిస్తుంది. ఈ పాత్రలలో ఉపయోగించే రసాయనాలు ప్రకృతిలో త్వరగా కరగవు . ఫలితంగా పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి . దీనివల్ల మనుషులకే కాదు, జంతువులు, మొక్కలు కూడా నష్టమే.
Also Read: ఈ ఆయిల్స్ వాడితే.. జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా !
చిట్కాలు:
నాన్-స్టిక్ పాత్రలను వంట చేయడానికి ఎక్కువగా వాడకూడదు.
బ్రాండెడ్ నాన్ స్టిక్ పాత్రలను మాత్రమే వాడాలి.
వీటిలో ఆహారాన్ని మీడియం మంట మీద మాత్రమే ఉడికించాలి.
నాన్ స్టిక్ పాత్రలపై పూత పోయిన గుర్తులు ఉంటే అలాంటి వాటిని అస్సలు ఉపయోగించకూడదు.
ఎందుకంటే అవి రసాయనాలను విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉంటాయి.
నాన్-స్టిక్ పాత్రలను కడగడానికి సబ్బు , మృదువైన స్పాంజి ఉపయోగించండి.
PFOA లేని, పర్యావరణ అనుకూల పాత్రలను మాత్రమే వంటకాల తయారీకి వాడండి