Ice Pack Facial| ముఖం శుభ్రంగా, అందంగా ఉండేలా చర్మ సంరక్షణ కోసం అందరూ రకరకాల లోషన్లు, ఇంటి చిట్కాలను అనుసరిస్తుంటారు. ఇవి మన ముఖాన్ని ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా ఉంచుతాయి. చాలా మంది ముఖానికి మంచు (ఐస్) కూడా రాస్తారు. ఐస్ ముఖానికి రాయడం వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుందని మీకు తెలుసా? ఇది చర్మాన్ని చల్లబరచడమే కాకుండా, వేడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ముఖానికి ఐస్ రాస్తే అనేక చర్మ సమస్యలు తగ్గుతాయి. ఈ రోజుల్లో అనేక సౌందర్య నిపుణులు చర్మ సంరక్షణలో భాగంగా ఐస్ థెరపీ చేసుకోవాలని సిఫారసు చేస్తున్నారు. ముఖానికి ఐస్ రాయడం వల్ల దాని ఆరోగ్యం ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ముఖానికి ఐస్ పట్టించే సమయంలో ఈ జాగ్రత్తలు పాటించాలి..
నేరుగా చర్మంపై ఎప్పుడూ ఐస్ రాయకూడదు. ఎల్లప్పుడూ ఐస్‌ను కాటన్ గుడ్డలో లేదా కాటన్‌లోనే చుట్టి, ఆ తర్వాత ముఖంపై రాయాలి. ముఖానికి 1-2 నిమిషాల కంటే ఎక్కువసేపు ఐస్ రాయకూడదు. వారంలో 4-5 సార్లు మాత్రమే ఐస్ రాయడం మంచిది.
ముఖానికి ఐస్ రాయడం వల్ల ప్రయోజనాలు
వడదెబ్బ నుండి ఉపశమనం: వేసవిలో ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చర్మం కాలిపోతుంది. అలాంటి సమయంలో ముఖానికి ఐస్ రాయడం వల్ల వడదెబ్బ నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది.
ముఖం వాపు తగ్గడం: ఐస్ చల్లగా ఉంటుంది కాబట్టి దాని ఉష్ణోగ్రత రక్తనాళాలను సంకోచింపజేస్తుంది. దీనివల్ల ఉదయం సమయంలో ముఖంలో వచ్చే వాపు తగ్గుతుంది. అదనపు ద్రవం తొలగిపోయి, ముఖం సాధారణ స్థితికి వస్తుంది.
మొటిమలకు చెక్ : ముఖంపై మొటిమలు ఉంటే చికాకు కలుగుతుంది. మీ ముఖంపై మొటిమలు లేదా గడ్డలు ఉంటే, మంచు రాయడం వల్ల ఉపశమనం లభించడంతో పాటు నొప్పి కూడా తగ్గుతుంది.
మేకప్ ఎక్కువసేపు ఉండడం: మేకప్ వేసుకునే ముందు ముఖానికి మంచు రాయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. దీనివల్ల మేకప్ ఎక్కువసేపు ఉంటుంది. అంతేకాకుండా, ఇది మేకప్ ప్రైమర్‌గా కూడా పనిచేస్తుంది.
చర్మం ప్రకాశవంతంగా మారడం: ముఖానికి ఐస్ రాయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది ముఖాన్ని సహజంగా ప్రకాశవంతంగా, కాంతివంతంగా ఉంచుతుంది.
Also Read: నడుం సైజు పెరిగితే గుండె ఆరోగ్యానికి ప్రమాదం? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఐస్ రాయడం చర్మ సంరక్షణలో సులభమైన, సమర్థవంతమైన పద్ధతి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే.. ఐస్‌ను సరైన రీతిలో, జాగ్రత్తగా ఉపయోగించడం ముఖ్యం. ఎక్కువసేపు ఐస్ రాయడం వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే వారంలో 4-5 సార్లు, అది కూడా 1-2 నిమిషాల పాటు మాత్రమే రాయాలి. ఈ సాధారణ చిట్కాతో మీ చర్మం సహజంగానే కాంతివంతంగా తయారవుతుంది.