High Blood Presure: అధిక రక్తపోటు (High Blood Pressure) లేదా హైపర్‌టెన్షన్ అనేది ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. దీనిని “సైలెంట్ కిల్లర్” అని కూడా అంటారు. ఎందుకంటే చాలా మందికి ఎటువంటి లక్షణాలు కనిపించవు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే.. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మందులతో పాటు, కొన్ని హోం రెమెడీస్, లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఏదైనా హోం రెమెడీస్ పాటించే ముందు డాక్టర్‌లను సంప్రదించడం ముఖ్యం.
ఆరోగ్యకరమైన ఆహారం:
పొటాషియం సమృద్ధిగా ఉండే ఆహారాలు: అరటిపండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, నారింజ, టమాటోలు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. తద్వారా రక్తపోటు తగ్గుతుంది.
ఉప్పు తగ్గించడం:
ఆహారంలో ఉప్పు తగ్గించడం రక్తపోటును నియంత్రించడానికి అత్యంత ముఖ్యమైన మార్గాలలో ఒకటి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాక్ చేసిన స్నాక్స్, ఊరగాయలకు దూరంగా ఉండాలి.
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు:
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను అధికంగా తీసుకోవడం వలన ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
కొవ్వును తగ్గించడం:
సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. బదులుగా, ఆలివ్ ఆయిల్, అవకాడో వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను ఎంచుకోవాలి.
జీవనశైలి మార్పులు:
ఆహారంతో పాటు.. కొన్ని జీవనశైలి మార్పులు కూడా రక్తపోటును నియంత్రించడంలో అద్భుతాలు చేస్తాయి.
క్రమం తప్పకుండా వ్యాయామం:
ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వేగంగా వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి చేయడం రక్తపోటును గణనీయంగా తగ్గించుకోవచ్చు.
బరువు తగ్గడం:
అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారు బరువు తగ్గడం వలన రక్తపోటు అదుపులోకి వస్తుంది.
ఒత్తిడి తగ్గించుకోవడం:
ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది. యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు లేదా మీకు నచ్చిన హాబీలను అనుసరించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
ధూమపానం, మద్యపానం మానేయడం:
ధూమపానం, అధిక మద్యపానం రక్తపోటును పెంచుతాయి. వీటిని పూర్తిగా మానేయడం ఆరోగ్యానికి చాలా మంచిది.
నిద్ర:
ప్రతి రోజు 7-8 గంటల పాటు నిద్రపోవడం శరీరానికి విశ్రాంతినిస్తుంది. అంతే కాకుండా ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
Also Read: ముప్పైలలో గుండె సమస్య ఉంటే మీకు కనిపించే ఐదు నిశ్శబ్ద లక్షణాలు ఇవే
కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు:
వెల్లుల్లి: వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తనాళాలను సడలించి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం మంచిది.
మెంతులు:
మెంతులు రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఫైబర్ , పొటాషియం వంటి పోషకాలను కలిగి ఉంటాయి. రాత్రిపూట మెంతులను నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగడం లేదా మెంతులను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
అల్లం:
అల్లం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం టీ చేసుకుని తీసుకోవచ్చు . లేదా ఆహారంలో అల్లం వాడవచ్చు.
కొబ్బరి నీరు:
కొబ్బరి నీరు పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.