Walking for Weight Loss: రోజూ నడవడం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం తెలిసిందే. ఏ వయసు వారైనా సులభంగా చేయగలిగే అత్యంత సహజమైన వ్యాయామం నడక. కీళ్లపై ఎక్కువ ప్రభావం పడకుండా.. సులభంగా సాగిపోయే ఈ ప్రక్రియ శరీర బరువును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే సాధారణంగా బరువు తగ్గడానికి చాలా మంది రోజూ పది వేల అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే కేవలం నడక ద్వారా ఒక కిలో బరువు తగ్గాలంటే అసలు ఎన్ని అడుగులు నడవాలి? దీని వెనుక ఉన్న గణిత లెక్కలేంటి? ఈ కథనంలో చూద్దాం.
శరీరంలో ఒక కిలోగ్రామ్ బరువు తగ్గాలంటే సుమారు 7,700 కాలరీలు (Caloric Deficit) ఖర్చు అవ్వాలనేది ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఒకవేళ కేవలం ఒక్క వారంలోనే కిలో బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజూ దాదాపు 1,100 కాలరీలను ఆహారం ద్వారా తగ్గించడం లేదా వ్యాయామం ద్వారా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే కేవలం నడక ద్వారా మాత్రమే ఈ స్థాయిలో కాలరీలను వారంలో కరిగించడం చాలా కష్టం.
సాధారణ వ్యక్తి సగటున ప్రతి 1,000 అడుగులకు దాదాపు 40 నుంచి 50 కాలరీలను ఖర్చు చేస్తారు. ఈ లెక్కన కేవలం నడకతోనే వారంలో ఒక కిలో బరువు తగ్గాలంటే రోజుకు సుమారు 22,000 నుంచి 27,500 అడుగులు నడవాల్సి ఉంటుంది. అంటే వారం మొత్తంలో దాదాపు 1,54,000 నుంచి 1,92,500 అడుగులు వేయాలన్నమాట.
ఒక రోజులో ఏకంగా 22 వేల నుంచి 27 వేల అడుగులు నడవడం అంటే మామూలు విషయం కాదు. ఇది కీళ్లపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించి, కండరాల నొప్పులకు దారితీస్తుంది. దీనివల్ల ఈ రొటీన్ను క్రమం తప్పకుండా పాటించడం అసాధ్యం అవుతుంది. కాబట్టి నడకతోపాటు ఆహారంలో మార్పులు కూడా ముఖ్యమేనని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో సుమారు 500 కాలరీలను తగ్గించుకోవడం ద్వారా.. నడక లక్ష్యాన్ని రోజుకు 12,000 నుంచి 15,000 అడుగులకు తగ్గించుకోవచ్చని పేర్కొంటున్నారు. ఫుడ్ డైట్ లేకుండా నడకతోనే వారంలో కిలో బరువు తగ్గాలని చూస్తే ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఫుడ్ డైట్ కుదరని పక్షంలో రోజూ 10,000 నుంచి 12,000 అడుగులు నడుస్తూ.. 10 నుంచి 15 రోజుల్లో ఒక కిలో బరువు తగ్గేలా ప్రణాళిక వేసుకోవాలని హితవు పలుకుతున్నారు.
Also Read: ‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!
నడక ద్వారా మంచి ఫలితాలు పొందడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వేగంగా నడవడం (Brisk Walking) ద్వారా నిమిషానికి ఎక్కువ కాలరీలు ఖర్చు చేయవచ్చని సూచిస్తున్నారు. సాధ్యమైతే కొద్దిగా వాలుగా ఉన్న ప్రదేశాల్లో నడవడం (Incline Walking) వల్ల సాధారణ నడక కంటే ఎక్కువ కాలరీలు కరుగుతాయని సూచిస్తున్నారు. ఒకేసారి గంట పాటు నడపడానికి బదులుగా, మూడు సార్లు విడగొట్టి ఒక్కోసారి 20 నిమిషాల చొప్పున నడిస్తే మంచిదని వివరిస్తున్నారు.
Also Read: యూపీఐలో సరికొత్త ఫీచర్.. మీ ఖాతాతో కుటుంబ సభ్యులూ పేమెంట్స్ చేయెుచ్చు.. ఇదెలాగో తెలుసా?