UPI Circle Feature: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి ‘యూపీఐ సర్కిల్’ (UPI Circle)గా పేరు పెట్టింది. ఈ ఫీచర్ ద్వారా యూపీఐ ఖాతాకు లింకప్ చేయబడ్డ బ్యాంక్ అకౌంట్ లోని డబ్బును ప్రైమరీ ఖాతాదారుడు తన కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన వ్యక్తులు చెల్లింపులు చేసేలా అనుమతి ఇవ్వవచ్చు. అయితే ఇది ఎలా పనిచేస్తుందో ఈ కథనంలో చూద్దాం.
యూపీఐ సర్కిల్ అనేది ఒక డిజిటల్ పేమెంట్ సదుపాయం. దీని ద్వారా మీ సొంత యూపీఐ ఖాతా నుంచి మరో వ్యక్తికి లావాదేవీలు చేసే అధికారం కల్పించవచ్చు. ఉదాహరణకు.. తల్లిదండ్రులు తమ పిల్లలు స్కూల్ క్యాంటీన్లో లేదా బయట చిన్నపాటి ఖర్చులు చేసుకోవడానికి ఈ సదుపాయాన్ని ఉపయోగించవచ్చు. అలాగే సొంతంగా బ్యాంక్ ఖాతా లేదా యూపీఐ సేవలు లేని వృద్ధులైన కుటుంబ సభ్యులకు ఇది ఎంతో మేవు ఉంటుంది.
ఎవరి బ్యాంక్ ఖాతా అయితే యూపీఐకి లింక్ అయి ఉంటుందో, వేరే వ్యక్తికి చెల్లింపులు చేసే అధికారం ఇస్తారో వారిని ప్రైమరీ యూజర్ అంటారు. ప్రైమరీ యూజర్ అనుమతితో చెల్లింపులు చేయడానికి అర్హత పొందిన వ్యక్తిని సెకండరీ యూజర్ గా పరిగణిస్తారు. ఈ సెకండరీ యూజర్‌కు ప్రత్యేకంగా వేరే బ్యాంక్ ఖాతా ఉండాల్సిన అవసరం లేదు. పేమెంట్ యాప్ నిబంధనల ప్రకారం.. ఈ యూజర్‌ను యూపీఐ సర్కిల్లో యాడ్ చేసి కొన్ని సాధారణ స్టెప్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
యూపీఐ సర్కిల్లో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. అవతలి వ్యక్తి ఎంత ఖర్చు చేయవచ్చనే దానిపై ప్రైమరీ యూజర్‌కు పూర్తి నియంత్రణ ఉంటుంది. పేమెంట్ యాప్‌ను బట్టి, ప్రైమరీ యూజర్‌కు కొన్ని ప్రత్యేక సెట్టింగ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రతి లావాదేవీకి ప్రైమరీ యూజర్ ఆమోదం (Approval) తెలపాల్సిన అవసరం ఉండేలా కూడా సెట్ చేసుకోవచ్చు. లేదా నిర్ణీత గరిష్ట పరిమితి (Predefined Limit) లోపు వారు స్వయంగా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించవచ్చు.
యూపీఐ సర్కిల్ విధానాన్ని ఎలాంటి మోసాలకు ఆస్కారం లేకుండా రూపకల్పన చేసినట్లు ఎన్ పీసీఐ తెలిపింది. సెకండరీ యూజర్‌తో యూపీఐ పిన్ (UPI PIN) లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాల్సిన అవసరం లేకుండానే చెల్లింపులు జరిగేలా దీన్ని తీసుకొచ్చారు. ప్రైమరీ యూజర్ ఎప్పుడైనా సెకండరీ యూజర్ కు ఇచ్చిన అనుమతిని ఎప్పుడైనా రద్దు చేసే వెసులుబాటును కల్పించారు.
Also Read: రైలు ప్రయాణంలో నవరాత్రి జోష్.. లోకల్ ట్రైన్లో మహిళల ‘గర్భా’ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!
యూపీఐ సర్కిల్ ఫీచర్ ను ఉపయోగించుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు పేర్కొంటున్నారు. పూర్తిగా నమ్మకం ఉన్న వ్యక్తులకు మాత్రమే చెల్లింపులకు అనుమతి ఇవ్వాలని సూచిస్తున్నారు. అవసరాన్ని బట్టి తగినంత ఖర్చు పరిమితిని (Spending Limit) మాత్రమే సెట్ చేయాలని హితవు పలుకుతున్నారు. ఎప్పటికప్పుడు లావాదేవీలను సమీక్షించుకుంటూ ఉండటం ద్వారా ఆర్థిక మోసాల జరగకుండా జాగ్రత్త పడవచ్చని సూచిస్తున్నారు.
Also Read: గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!