Blue Drum Murder Case: దేశంలో సంచలనం సృష్టించిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్తను చంపి మృతదేహాన్ని బ్లూ డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో పూడ్చేసిన భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. రెండు వారాల క్రితం వీరిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం.. బుధవారం ఈ శిక్షను ఖరారు చేసింది. అయితే ఈ కేసులో నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్ అత్యంత కీలకమైన సాక్ష్యంగా నిలవడం గమనార్హం.
పోలీసులు, ప్రాసిక్యూషన్ వాదనల ప్రకారం.. 2025 మార్చి 3న ముస్కాన్ రస్తోగి తన భర్త సౌరభ్ రాజ్‌పుత్‌కు నిద్రమాత్రలు కలిపిన ఆహారాన్ని పెట్టి స్పృహ కోల్పోయేలా చేసింది. ఆ వెంటనే ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా వారి ఇంద్రానగర్ ఇంటికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి సౌరభ్ రాజ్‌పుత్‌ను కత్తితో పొడిచి చంపేశారు. అనంతరం బాత్రూమ్లో ఆయన శవాన్ని ముక్కలుగా నరికారు. దుర్వాసన బయటకు రాకుండా ఉండేందుకు ఆ శరీర భాగాలను ఒక పెద్ద నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో కుక్కారు. అందులో ఇసుక, నీరు, సిమెంట్‌తో కలిపిన తడి మిశ్రమాన్ని పోసి గట్టిగా సీల్ చేశారు.
హత్య జరిగిన తర్వాత రోజు ఉదయాన్నే ఈ కిరాతక జంట హిమాచల్ ప్రదేశ్‌కు పారిపోయింది. సౌరభ్ బతికే ఉన్నాడని వ్యాపార పనులపై బయటకు వెళ్లాడని అందరినీ నమ్మించడానికి ముస్కాన్.. సౌరభ్ ఫోన్ నుంచే ఆయన కుటుంబ సభ్యులకు వరుసగా మెసేజ్‌లు పంపింది. అయితే 2025 మార్చి 17న అనుమానం వచ్చిన సౌరభ్ బంధువులు.. స్థానిక అధికారులతో కలిసి వారి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో సౌరభ్, ముస్కాన్ దంపతుల ఆరేళ్ల కూతురు పక్కింటివారితో మాట్లాడుతూ.. ‘మా నాన్న ఆ డ్రమ్‌లోనే ఉన్నారు’ అని అమాయకంగా చెప్పింది. పోలీసులు ఇంట్లోకి వెళ్లి సీల్ చేసిన డ్రమ్‌ను ఓపెన్ చేయగా.. అందులో కుళ్లిన స్థితిలో సౌరభ్ శరీర భాగాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రెండు రోజుల తర్వాత నిందితుల్ని పట్టుకున్నారు.
Also Read: యూపీఐలో సరికొత్త ఫీచర్.. మీ ఖాతాతో కుటుంబ సభ్యులూ పేమెంట్స్ చేయెుచ్చు.. ఇదెలాగో తెలుసా?
ఈ కేసులో మొత్తం 126 సార్లు విచారణలు జరిగాయి. 22 మంది సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్ మిశ్రా తీర్పు వెలువరిస్తూ.. సమాజంలో భయానక వాతావరణాన్ని సృష్టించే ఇలాంటి నేరాలకు కఠిన శిక్షే మేలని పేర్కొన్నారు. నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ సంచలన తీర్పును వెలువరించారు.
Also Read: ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!