Fake water bottles: దాహం తీర్చుకోవడానికి రోడ్డు పక్కన కనిపించే చిన్న షాపులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాపుల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ గుడ్డిగా కొంటుంటాం. కానీ..బాటిల్ పైన ఉన్న ప్లాస్టిక్ సీల్ ఒక్కటే.. చూసి అది మంచి కంపెనీదే అని నమ్మితే మీరు రోగాలు కొని తెచ్చుకున్నట్లే. ప్రస్తుతం మార్కెట్లో రీఫిల్ చేసిన నకిలీ, కల్తీ వాటర్ బాటిల్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేబుల్ చూసి, సీల్ చెక్ చేసి బాటిల్ ఓపెన్ చేసేస్తున్నాం కానీ ఆ నీరు నిజంగా సురక్షితమైనదేనా? లేదా అని గుర్తించడం చాలా ముఖ్యం. మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే.. కొనే ముందు కేవలం పది సెకన్ల పాటు కొన్ని చిన్న విషయాలను పరిశీలిస్తే.. అసలైన వాటర్ బాటిల్ ఏదో ఇట్టే కనిపెట్టొచ్చు.
అసలైన బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్.. చాలా గట్టిగా, క్వాలిటీతో ఉంటాయి. కానీ నకిలీ లేదా లోకల్ బాటిల్స్ ప్లాస్టిక్ చాలా పలుచగా, చేత్తో నొక్కితే సులభంగా బెండైపోయేలా ఉంటాయి. బాటిల్ లేబుల్ ప్రింటింగ్ కూడా చాలా నాసిరకంగా, అక్షరాలు చెరిగిపోయేలా ఉంటుంది.
చాలా మంది సీల్ పర్ఫెక్ట్ గా ఉందని సరి పెట్టుకుంటారు. కానీ..మోసగాళ్లు పాత బాటిళ్లను సేకరించి, వాటికి కొత్త సీల్స్ తగిలించి అమ్ముతున్నారు. క్యాప్ తిప్పినప్పుడు వచ్చే రింగ్ విరిగిపోయే తీరును గమనించండి. ఒరిజినల్ బాటిల్ అయితే క్యాప్ తిప్పగానే లోపల ప్లాస్టిక్ రింగ్ విడిపోతుంది.
ప్రతి ఒరిజినల్ వాటర్ బాటిల్ పై తయారీ తేదీ , గడువు తేదీ, లాట్ నెంబర్ స్పష్టంగా ఉంటాయి. బాటిల్ అడుగు భాగంలో లేదా లేబుల్ పై ఉండే.. ఈ వివరాలను లేజర్‌తో ప్రింట్ చేసి ఉంటారు. నకిలీ వాటిపై ఇవి ఉండవు లేదా చాలా బ్లర్‌గా ఉంటాయి.
Also Read: కటింగ్ బోర్డును కేవలం నీటితో కడుగుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి!
బాటిల్‌ను కాస్త వెలుతురులో.. పెట్టి తిప్పి చూడండి. నీటిలో ఏవైనా చిన్న చిన్న మట్టి కణాలు, తెల్లటి అవక్షేపాలు తేలుతున్నాయా లేదా గమనించండి. ఎలాంటి మలినాలు లేకుండా నీరు స్పష్టంగా ఉండాలి.
ఎప్పుడైనా సరే రోడ్డు పక్కన తెలియని లోకల్ బ్రాండ్ వాటర్ బాటిల్స్ కొనే బదులు, నమ్మకమైన కంపెనీల బాటిళ్లను ఎంచుకోవడం, కొనేముందు పది సెకన్లు చెకింగ్ చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.