Hair Fall: నల్లటి ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాహార లోపం, ఒత్తిడి, నిద్ర లేకపోవడం, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు, జన్యుపరమైన కారణాల వల్ల ఈ సమస్య వస్తుంటుంది. అయితే జుట్టు రాలడాన్ని వెంటనే ఆపడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. వాటి గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పోషకాహారం ముఖ్యం:
జుట్టు రాలడానికి ముఖ్య కారణం పోషకాహార లోపం. సరైన పోషకాలు అందకపోతే జుట్టు బలహీనంగా మారి రాలిపోతుంది. అందువల్ల ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు (ముఖ్యంగా విటమిన్ బి, డి, ఇ), ఐరన్, జింక్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. పాలు, గుడ్లు, చేపలు, ఆకుకూరలు, సీడ్స్, పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా జుట్టుకు కావలసిన పోషకాలు అందుతాయి.
ఒత్తిడిని తగ్గించుకోవాలి:
ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి ఒక ప్రధాన కారణం. అధిక ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి జుట్టు రాలడం పెరుగుతుంది. యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. దీంతో పాటు మంచి నిద్ర కూడా చాలా అవసరం. రాత్రి కనీసం 7-8 గంటలు నిద్రపోవడం వల్ల ఒత్తిడి తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
సరైన జుట్టు సంరక్షణ:
జుట్టు సంరక్షణ కూడా చాలా ముఖ్యం. హెయిర్ జెల్స్, రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపూలు, కండీషనర్‌లను వాడకపోవడం మంచిది. జుట్టు రకానికి తగిన షాంపూ, కండీషనర్ ఉపయోగించాలి. అలాగే వారానికి కనీసం రెండు మూడు సార్లు జుట్టుకు సహజసిద్ధమైన నూనెలతో మసాజ్ చేసుకోవాలి. కొబ్బరి నూనె, బాదం నూనె, ఆముదం వంటివి జుట్టుకు పోషణనిస్తాయి. జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వడం మానుకోవాలి, ఎందుకంటే తడిగా ఉన్నప్పుడు జుట్టు సులువుగా రాలిపోతుంది.
Also Read: ముఖంపై మొటిమలా ? ఈ ఒక్క ఫేస్ ప్యాక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్
సహజసిద్ధమైన చిట్కాలు:
కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు పాటించడం వల్ల జుట్టు రాలడాన్ని వెంటనే తగ్గించుకోవచ్చు.
ఉసిరి రసం: ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరి రసాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
మెంతులు: రాత్రంతా నానబెట్టిన మెంతులను ఉదయం మెత్తగా చేసి తలకు రాసుకుని అరగంట తర్వాత కడిగేస్తే చుండ్రు తగ్గి జుట్టు రాలడం తగ్గుతుంది.
ఉల్లిపాయ రసం: ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ రసాన్ని తలకు రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
కలబంద జెల్: కలబంద జెల్ ను తలకు పట్టించి ఒక గంట తర్వాత శుభ్రం చేసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.