Guava Leaves For Hair Growth: జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు పొడవాటి జుట్టు కోసం రకరకాల షాంపూలతో పాటు , ఆయిల్స్ కూడా వాడుతుంటారు. కానీ ప్రస్తుత అనారోగ్య కారణాలతో పాటు ఇతర సమస్యల వల్ల జుట్టు రాలడం ఎక్కువవుతుంది. ఇలాంటి సమయంలో హోం రెమెడీస్ ట్రై చేయడం చాలా ముఖ్యం. ఇదిలా ఉంటే జుట్టు పెరగడానికి, అంతే కాకుండా రాలిపోకుండా ఉండటానికి జామ ఆకులను కూడా ఉపయోగించవచ్చు.
జామ ఆకులతో జుట్టును క్రమం తప్పకుండా వాష్ చేస్తే.. జుట్టు అందంగా, పొడవుగా ఉండటమే కాకుండా, చుండ్రు వంటి సమస్యల నుండి జుట్టును దూరంగా ఉంచుతుంది. జామ ఆకుల నీటిని జుట్టుకు ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టుకు జామ ఆకుల ప్రయోజనాలు:
జామ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తాయి. అంతే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడతాయి. ఈ ఆకులలో ఉండే సహజ సమ్మేళనాలు తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా జుట్టు పొడవుగా, మందంగా పెరగడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
జుట్టు రాలడం తక్కువ:
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం, కానీ జామ ఆకులు జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో, జుట్టు చిట్లిపోవడాన్ని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ ఆకులలోని యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జుట్టు పొడిబారడం, చుండ్రు లేదా ఇన్ఫెక్షన్ కారణంగా జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
చుండ్రు మాయం:
చుండ్రు, తలపై దురద మిమ్మల్ని ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా గడపనివ్వవు. ఇలాంటి సమయంలో జామ ఆకులలో ఉండే యాంటీ-మైక్రోబయల్ , యాంటీ ఫంగల్ లక్షణాలను మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి చుండ్రు కలిగించే బ్యాక్టీరియా , ఫంగస్‌ను తొలగించడంలో సహాయపడతాయి. మీరు క్రమం తప్పకుండా జామ ఆకుల నీటితో మీ జుట్టును వాష్ చేస్తే.. మీ తలపై చర్మం కూడా శుభ్రంగా ఉంటుంది.
బలమైన జుట్టు :
బలహీనమైన, చీలిపోయిన జుట్టు చివర్లు చూడటానికి అందంగా కనిపించవు.అందుకే ఇలాంటి సమయంలో జామ ఆకులతో క్రమం తప్పకుండా జుట్టు వాష్ చేయడం ద్వారా దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. ఎందుకంటే జామ ఆకులలో విటమిన్ బి , సి పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును కుదుళ్ల నుండి కొన వరకు బలపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు చివరలను చీల్చడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది . కాలుష్యం మరియు స్టైలింగ్ సాధనాల వల్ల కలిగే నష్టాన్ని తట్టుకునేలా చేస్తుంది.
సహజ మెరుపు, మృదుత్వం:
మీరు సిల్కీ, మెరిసే జుట్టును కోరుకుంటే.. జామ ఆకులు సహజ నివారణగా పనిచేస్తాయి. ఈ ఆకులలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను మృదువుగా చేయడంలో సహాయపడతాయి. ఫలితంగా ఖరీదైన జుట్టు ఉత్పత్తుల అవసరం లేకుండా మృదువైన జుట్టు లభిస్తుంది.
తలపై చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది :
తలపై అధిక నూనె ఉత్పత్తి జుట్టు జిడ్డుగా మారడానికి కారణమవుతుంది. అయితే తలపై చర్మం పొడిబారడం వల్ల దురద, జుట్టు రాలడం జరుగుతుంది. జామ ఆకులు సెబమ్ (సహజ నూనె) ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఇవి తలపై చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి.
Also Read: ముఖం తెల్లగా మెరిసిపోవాలా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే!
జామ ఆకులతో మీ జుట్టును ఎలా కడగాలి ?
2 కప్పుల నీటిలో గుప్పెడు తాజా జామ ఆకులను కలిపి దాదాపు 10-15 నిమిషాలు మరిగించాలి.
తర్వాత నీటిని చల్లబరిచి ఫిల్టర్ చేయండి.
షాంపూ చేసుకున్న తర్వాత.. జామ ఆకుల నీటిని మీ తలకు, జుట్టుకు అప్లై చేయండి.
కొన్ని నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి.
తరువాత సాధారణ నీటితో వాష్ చేయండి.
మెరుగైన ఫలితాల కోసం వారానికి 2-3 సార్లు దీనిని ఉపయోగించండి.