Acidity: అసిడిటీ లేదా గుండెల్లో మంట అనేది చాలామంది ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. ఇది కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి రావడం వల్ల వస్తుంది. దీని వల్ల ఛాతీలో మంట, పుల్లని తేన్పులు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీని నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి కొన్ని సులభమైన హోం రెమెడీస్ పాటించాలి. ఈ చిట్కాలు అసిడిటీని తగ్గించడానికి సహాయపడతాయి. కానీ ఇవి కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే అందిస్తాయి. ఎలాంటి చిట్కాలు అసిడిటీని తగ్గించడానికి ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బేకింగ్ సోడా :
బేకింగ్ సోడా (సోడియం బైకార్బొనేట్) ఒక సహజమైన ఆంటాసిడ్. ఇది కడుపులోని ఆమ్లాన్ని తక్షణమే తగ్గిస్తుంది. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అసిడిటీని తక్కువ సమయంలో తగ్గడానికి దీనిని ఉపయోగించవచ్చు. కానీ తరచుగా వాడటం మంచిది కాదు. ఎందుకంటే ఇది శరీరంలోని సోడియం స్థాయిలను పెంచుతుంది.
2. చల్లని పాలు :
చల్లని పాలు, అసిడిటీని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. పాలలోని కాల్షియం, కడుపులోని ఆమ్లాన్ని తటస్థం చేయడంలో సహాయపడుతుంది. అసిడిటీ సమస్యను ఎదుర్కునే వారు ఒక గ్లాసు చల్లని పాలను నెమ్మదిగా తాగాలి. పాలు తక్కువ కొవ్వుతో ఉంటే మంచిది, ఎందుకంటే అధిక కొవ్వు ఉన్న పాలు అసిడిటీని పెంచవచ్చు.
3. మజ్జిగ:
మజ్జిగ అసిడిటీకి ఒక అద్భుతమైన నివారణ. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్, కడుపులో అసిడిటీని తగ్గిస్తుంది. ఒక గ్లాసు మజ్జిగలో కొద్దిగా నల్ల మిరియాల పొడి లేదా జీలకర్ర పొడి కలిపి తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది.
4.అరటి పండు :
పండిన అరటిపండులో సహజమైన ఆంటాసిడ్ లక్షణాలు ఉంటాయి. ఇది కడుపులోని పొరను రక్షించి, మంటను తగ్గిస్తుంది. అసిడిటీ లక్షణాలు కనిపించినప్పుడు ఒక పండిన అరటిపండు తినడం మంచిది. ఇది మీకు తక్షణ ప్రయోజనాలను అందిస్తుంది.
5. సోంపు : సోంపు గింజలు జీర్ణక్రియను మెరుగుపరచి, కడుపులో మంటను తగ్గిస్తాయి. భోజనం చేసిన తర్వాత కొన్ని సోంపు గింజలను నమలడం లేదా ఒక గ్లాసు వేడి నీటిలో ఒక టీస్పూన్ సోంపు వేసి తాగడం ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చు.
6. తులసి ఆకులు : తులసి ఆకులు యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులోని మంటను కూడా తగ్గిస్తాయి. అసిడిటీగా అనిపించినప్పుడు 4-5 తులసి ఆకులను నమలడం అలవాటు చేసుకోవాలి. లేదా వేడి నీటిలో తులసి ఆకులు వేసి తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.