Control Hair Fall Tips: జుట్టు విపరీతంగా రాలిపోవడం అనేది ఈ మధ్య చాలామంది అమ్మాయిలు ఎదుర్కొంటోన్న సమస్య. ప్రతి రోజూ కొంత జుట్టు రాలడం మామూలే అయినప్పటికీ.. కొందరికి తలలో చేయి పెడితేనే వెంట్రుకలు ఊడి వస్తాయి. కొందరికి దువ్వెనతో దువ్వుతుంటే.. కుచ్చులు కుచ్చులుగా రాలుతుంటుంది. ఈ విధంగా జుట్టు రాలుతుంటే.. చాలా బాధగా ఉంటుంది. చెడు ఆహార అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి వంటి కారణాలు వల్ల హెయిర్ ఫాల్ జరుగుతుంది. కొన్ని టిప్స్ ఫాలో అయితే.. హెయిర్ ఫాల్‌ను వెంటనే కంట్రోల్ చేయవచ్చని నిపుణులు అంటున్నారు. మీకూ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే.. ఈ చిట్కాలు కచ్చితంగా ఫాలో అవ్వండి.
సమతుల్య, పోషకాహారం తీసుకోండి..
జుట్టు రాలే సమస్యను వెంటనే పరిష్కరించడానికి సమతుల్య, పోషకాహార తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్‌తో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే.. జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు. పోషకాహార లోపం హెయిర్ ఫాల్‌కు దారితీస్తుంది. ముఖ్యంగా.. ఐరన్, జింక్, విటమిన్ ఎ, డి లోపం కారణంగా జుట్టు రాలుతుంది. మీ డైట్‌లో రకరకాల పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాలు చేర్చండి. పాలకూర, గుడ్లు, నట్స్, విత్తనాలు, చేపలు మీ ఆహారంలో తీసుకుంటే.. జుట్టు రాలడం తగ్గుతుంది.
హెడ్ మసాజ్..
హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేయడానికి హెడ్ మసాజ్ సహాయపడుతుంది. మంచి ఎసెన్షియల్ ఆయిల్స్‌తో రిలాక్సింగ్ స్కాల్ప్ మసాజ్ హెయిర్ ఫోలికల్స్‌కి రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది, వాటికి పోషణనిస్తుంది, హెయిర్ గ్రోత్‌ను ప్రోత్సహిస్తుంది. లావెండర్, రోజ్మేరీ, పిప్పరమెంట్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్‌ను కొబ్బరి, బాదం, ఆలివ్ ఆయిల్‌లో మిక్స్ చేసి.. మృదవుగా మసాజ్ చేయండి. మీరు తలస్నానం చేసే గంట ముందు ఇలా చేయండి. తరచు ఇలా చేస్తే.. జుట్టు రాలడం తగ్గుతుంది.
కఠినమైన రసాయనాలకు దూరంగా ఉండండి..
షాంపూలు, కండిషనర్లు, స్టైలింగ్ ఉత్పత్తుల వంటి రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. మీ జుట్టుకు హాని చేయని.. సల్ఫేట్ ఫ్రీ హెయిర్ ఉత్పత్తులను ఎంచుకోండి. స్ట్రెయిట్‌నర్‌లు, కర్లింగ్ ఐరన్‌ల వంటి హీట్ స్టైలింగ్ సాధనాలను తక్కువగా వాడండి. వీటి నుంచి వచ్చే వేడి.. జుట్టును బలహీనపరుస్తుంది.
కలబంద మాస్క్..
కలబంద గుజ్జులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేస్తుంది. తాజా కలబంద గుజ్జును తలకు పట్టించి.. 45 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి. కలబంద స్కాల్ప్ pH ను సమతుల్యం చేస్తుంది, వాపును తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్‌ను ప్రోత్సహిస్తుంది.
Also Read: హైదరాబాద్ సమీపంలోని అందాల జలపాతాలు.. అస్సలు మిస్ అవ్వద్దు..!
రొటీన్ ఫాలో అవ్వండి..
జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేయడానికి.. సరైన హెయిర్ కేర్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. వారానికి కనీసం రెండు సార్లు తలస్నానం చేయండి. మీ జుట్టును హైడ్రేట్‌గా ఉంచడానికి కడిషనింగ్ చేయండి. జుట్టు చిక్కులు తీయడానికి.. సున్నితంగా దువ్వండి. తడి జుట్టుతో నిద్రపోవడం మంచిది కాదు. ఇలాంటి సమయంలో కురులు బలహీనంగా ఉంటాయని మరచిపోకండి. జుట్టును సహజ పద్ధతుల్లో ఆరబెట్టుకుని రెండు మూడు గంటల తరువాత నిద్రపోతే మంచిది. జుట్టుకు సరైన పోషణను, అవసరమైన తేమను అందించడంలో హెయిర్ మాస్క్‌లు బాగా ఉపయోగపడతాయి.