Waterfalls in Hyderabad: జలపాతం.. ప్రకృతి అందాల్లో జలపాతాలు ఒకటి. మిగతా సమయంలో ఎలా ఉన్నా వర్షాకాలంలో మాత్రం జలపాతాల అందాలు అద్భుతం. వాటి సోయగాలను కళ్లారా చూడాల్సిందే. తెలంగాణ ప్రాంతాన్ని జలపాతాలకు చిరునామాగా చెప్పవచ్చు. ఎత్తైన కొండలు, దట్టమైన అడవుల మీదుగా వీటి ప్రయాణం.. మనల్ని ఆకర్షిస్తాయి. మీరు ప్రకృతిని ఆస్వాదిస్తూ.. జలపాతాలను చూడాలనుకుంటే వీటిని తప్పక చూడండి.
కుంటాల జలపాతం:
కుంటాల జలపాతం పేరు శకుంతల అనే యువరాణి పేరు మీద వచ్చింది. దుష్యంతుడి భార్య అయిన శకుంతల, ఈ జలపాతం, పరిసరాల అందాలకు ముగ్ధురాలూ, తరచుగా ఇక్కడ స్నానం చేస్తుండేదని స్థానికుల నమ్మకం. ఈ జలపాతం హైదరాబాద్ కు 260 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం. ఇది కడెం నది నుండి ఉద్భవించి, 147 అడుగుల ఎత్తు నుండి జాలువారుతుంది. జలపాతం చుట్టూ దట్టమైన అడవులు, రాతి కొండలు ఉన్నాయి, ఇవన్నీ కలిసి ఈ ప్రదేశానికి మరింత అందాన్నిస్తాయి. ఇక్కడికి దగ్గరలోనే శివాలయం కూడా ఉంది, ఇక్కడ మహాశివరాత్రి పండుగనాడు ప్రత్యేక పూజలు జరుగుతాయి.
ఎత్తిపోతల జలపాతం:
ఇది హైదరాబాద్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 70 అడుగుల ఎత్తు నుండి క్రిందకు జాలువారే ఒక అందమైన జలపాతం. ఇక్కడ చంద్రవంక నది, నాగార్జునసాగర్ నుండి వచ్చే నక్కలవాగు, సూర్యభాగ నది అనే మూడు నదులు కలిసి ఈ జలపాతాన్ని ఏర్పరుస్తాయి. ఇక్కడి ప్రకృతి అందాలు, జలపాతాల అందం పర్యాటకులను ఆకర్షిస్తుంది.
బోగత జలపాతం:
బొగత జలపాతం హైదరాబాద్‌కు 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని నయగార జలపాతం అని కూడా అంటారు. ఇది 30 అడుగుల ఎత్తు నుంచి నీరు జలపాతంలా కిందకు పడుతుంది. వర్షాకాలంలో ఈ జలపాతం మరింత అందంగా కనిపిస్తుంది. బొగత జలపాతం ఒక అందమైన, పవిత్రమైన ప్రదేశం. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణగా మారింది.
ముత్యాల ధార జలపాతం:
ముత్యాలధార జలపాతం అనేది తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న ఒక అందమైన జలపాతం. ఇది ప్రకృతి ప్రేమికులకు మరియు సాహసికులకు ఇష్టమైన ప్రదేశం. ఈ జలపాతం యొక్క ప్రధాన ఆకర్షణ దాని చుట్టూ ఉన్న దట్టమైన అడవి మరియు జలపాతం నుండి జాలువారే నీటి ప్రవాహం. స్థానికుల నమ్మకం ప్రకారం, ఈ జలపాతం యొక్క నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని, ఇక్కడ స్నానం చేస్తే అనేక రోగాలు నయమవుతాయని చెబుతారు. ఇది హైదరాబాద్‌కు 290 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మల్లెల తీర్థం:
మల్లెల తీర్థం హైదరాబాద్‌కు 180 కిలోమీటర్ల దూరంలో నల్ల అడవిలో ఉన్న ఒక అందమైన జలపాతం. ఇది సుందరమైన అందానికి, ఉప్పొంగుతున్న నీటి కింద ఉన్న శివలింగానికి ప్రసిద్ధి చెందింది. ఈ జలపాతం దట్టమైన అడవి గుండా ప్రవహించే ఒక ప్రవాహం ద్వారా ఏర్పడి చివరికి కృష్ణా నదిలో కలుస్తుంది. చాలా మంది ఋషులు ఇక్కడ తపస్సు చేశారని, శివుడు తన భక్తులలో కొంత మందికి కనిపించాడని నమ్ముతారు. వేసవిలో పులులు నీరు త్రాగడానికి ఈ జలపాతాలను సందర్శిస్తాయని కూడా చెబుతారు.
Also Read: వర్షాకాలంలో తెల్లగా మెరిసిపోవాలా? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..
పొచ్చెర జలపాతం:
పొచ్చెర జలపాతం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. అలాగే హైదరాబాద్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక అందమైన పర్యాటక ప్రదేశం, ఇక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఇది చిన్న చిన్న కొండవాగు రాళ్ల నుంచి జాలువారే జలపాతం, చుట్టూ దట్టమైన అడవులు, కొండలతో ఉంటుంది.