Soda Side Effects: వేసవి కాలం వచ్చిందంటే చాలు. చాలా మంది విపరీతంగా సోడాలను తాగుతారు. కాస్త వేడిగా అనిపించినా సోడా.. ఏదైనా డ్రింక్ తాగాలి అంటే సోడా.. ఎండలో ఎటైనా వెళ్లి వస్తే సోడా.. ఇలా ఎప్పుడు చూసినా సోడా తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. దీని వల్ల కాసేపు కూల్‌గా అనిపించినా తర్వాత ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో ఈ రకమైన అలవాటు దీర్ఘకాలిక దుష్ప్రభావాలకు దారితీయవచ్చట. సోడా తయారు చేయడానికి వాడే అధిక చక్కెర, కెఫిన్, కృత్రిమ పదార్ధాల వల్ల బాడీ డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
డీహైడ్రేషన్
సోడా అనేది హైడ్రేటింగ్ డ్రింక్ కాదట. కొన్నింటిలో కెఫిన్ కూడా ఉంటుంది. వేడి వాతావరణంలో, మీ శరీరానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. అలాంటి సమయంలో నీళ్లు తాగకుండా సోడా తాగితే శరీరం ఇంకా డీహైడ్రేట్ అయ్య ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
షుగర్, కెఫిన్ కలిపి తయారు చేసే సోడా తాగితే శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ దీని వల్ల వచ్చే ఎనర్జీ క్రాష్ అవుతూ ఉంటుందట. దీంతో వేడిలో మరింత అలసిపోయే ప్రమాదం ఉంది.
కడుపు ఉబ్బరం
సోడా అధికండా తాగడం వల్ల చాలా మందిలో కడుపు ఉబ్బరం సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సోడాలో ఉండే కార్బొనేషన్ గ్యాస్ వల్ల ఎసిడిటీ, కడుపులో మంట, ఉబ్బరం వంటి జీర్ణసమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఎక్కువగా చెమటలు పట్టినప్పుడు, వేడి వాతావరణంలో ఉన్నప్పుడు సోడాను తీసుకోవడం వల్ల ఆ సమస్యలు వచ్చే అవకాశం ఉందట.
ALSO READ: మడమలు పగిలిపోయాయా..?
అంతేకాకుండా క్రమం తప్పకుండా సోడా తాగడం వల్ల అనేక దీర్ఘకాలిక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సోడాలో కేలరీలు, యాడెడ్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి కారణం అవుతాయి. ముఖ్యంగా పొత్తికడుపు చుట్టూ చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉందట.
సోడాలో ఉండే షుగర్స్, యాసిడిక్ గుణాల వల్ల దంతాలపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందట. ఇందులోని యాసిడ్ లక్షణాలు ఎనామిల్‌ను దెబ్బతీస్తాయట. దీని వల్ల క్యావిటీస్, సెన్సిటివిటీ వంటివి కూడా వస్తాయట.
అధికంగా సోడా తాగడం వల్ల డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇన్సులిన్ ఉత్పత్తిపై కూడా దీని వల్ల చెడు ప్రభావం పడుతుందట. ఫలితంగా టైప్-2 డయాబెటిస్ ప్రమాదం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని సోడాలలో ఫాస్పోరిక్ యాసిడ్ కలుపుతారు. దీని వల్ల కాల్షియం అబ్సార్ప్షన్‌కు ఆటంకం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్ ఉందట.
అదే పనిగా ఎక్కువ షుగర్ కంటెంట్ తీసుకోవడం వల్ల గుండె సమస్యల వచ్చే అవకాశం ఉందట. అందుకే అధికంగా సోడా తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. సోడాకు బదులుగా నిమ్మకాయ లేదా పుదీనా వాటర్, కొబ్బరి నీరు, ఐస్‌డ్ హెర్బల్ టీలు తాగడం మంచిదని సూచిస్తున్నారు.