ఆరోగ్యకరమైన చిరుతిండిగా పూల్ మఖానా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. చాలా సింపుల్ గా నెయ్యిలో వేయించుకుని తినేస్తే చాలు ఎంతో శక్తిని ఇస్తుంది. దీంతో చేసే ఆహారాలు కూడా త్వరగా తయారైపోతాయి. అందుకే ప్రపంచంలో తక్కువ సమయంలోనే ఎంతో పేరు తెచ్చుకుంది. పూల్ మఖానా సూపర్ ఫుడ్స్ లో ప్రథమ స్థానాన్ని సంపాదించుకుంది.
తేలికగా, క్రంచీగా వండే ఈ పూల మఖానా తినమని ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు, డైటీషియన్లు ఆరోగ్య స్పృహ ఉన్నవారు అందరూ చెబుతూనే ఉంటారు. అయితే పోషకాహార నిపుణులు నాణానికి ఒకవైపు మాత్రమే కాదని… రెండోవైపు కూడా చూడాలని చెబుతున్నారు. ఒక ఆహారం మేలు ఎంత చేస్తుందో.. దాన్ని అధికంగా తినడం వల్ల కీడు కూడా చేస్తుందని వివరిస్తున్నారు.
మఖానాతో ఎంతో ఆరోగ్యం
పూల్ మఖానా ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నది నిజమే. దీనిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దానిలో సంతృప్తి కొవ్వులు తక్కువగా ఉంటాయి. కాబట్టి పూల్ మఖానా తింటే మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే వాటిని అధికంగా తింటే మాత్రం కొన్ని సైడ్ ఎఫెక్టులు తప్పవు. ఏదైనా కూడా మితంగా తింటేనే ఆరోగ్యం.. అమితంగా తింటే అనారోగ్యమే.
పొట్టలో ఇబ్బంది ఉంటే
మీరు పూల్ మఖానా తిన్న తర్వాత పొట్టలో ఇబ్బందిగా అనిపిస్తే దాన్ని మీరు తక్కువగా తినాలని అర్థం చేసుకోవాలి. ఈ పూల్ మఖానాలో ఫైబర్ అధికంగా ఉండదు. దీన్ని అధికంగా తింటే మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారికి మఖానా మంచి ఆహారం కాదు. ఇది మలబద్ధకం సమస్యను పెంచేస్తుంది. ఇవి తేలికగా గాలితో నిండినట్టు కనిపిస్తాయి. కానీ ఫైబర్ కంటెంట్ మాత్రం ఉండదు. అందుకే పేగు కదలికలకు మద్దతు ఇవ్వదు. కాబట్టి కడుపు ఉబ్బరం, కడుపునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు పూల్ మఖానకు దూరంగా ఉంటేనే మంచిది.
కార్బోహైడ్రేట్లు ఎక్కువ
మఖానాలో కొవ్వు కంటెంట్ తక్కువ. అలాగే సంతృప్తికరమైన ఆహారం తిన్నామన్న అనుభూతిని ఇస్తుంది. అందుకే బరువు తగ్గాలి అనుకునేవారు దాన్ని తినడానికి ఇష్టపడతారు. కానీ పూలమఖానాలో క్యాలరీల సంఖ్య అధికంగానే ఉంటుంది. అతిగా తింటే అధిక కేలరీలు శరీరంలో చేరిపోవచ్చు. మఖానాలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి మఖానా అధికంగా తింటే కార్బోహైడ్రేట్లు శరీరంలో చేరి మీకు తెలియకుండానే బరువు పెరిగిపోతారు.
మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా దూరంగా ఉండాలి. ముఖ్యంగా క్రోనిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నవారికి మఖానా ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే దీనిలో అధిక స్థాయిలో పొటాషియం ఉంటుంది. రక్తంలో పొటాషియం అధికంగా చేరితే గుండె లయ తప్పుతుంది. కాబట్టి ఈ సూపర్ ఫుడ్ మీరు అధికంగా తినేటప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.