Monsoon Diabetes Care: ఎండలు తగ్గి వర్షాలు పడగానే వాతావరణం చల్లబడి మనసంతా హాయిగా అనిపిస్తుంది. కానీ, మధుమేహం ఉన్నవారికి మాత్రం ఈ వానకాలం కొద్దిగా ఇబ్బందికరంగానే మారుతుంది. బయట వర్షాల వల్ల రోజూ చేసే వాకింగ్ ఆగిపోవడం, ఆహార వేళలు మారడం, అలాగే తేమ వల్ల వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్ల కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టమవుతుంది. ఇలాంటి సమయంలో పాత పద్ధతిలో రోజుకో రెండుసార్లు షుగర్ చెక్ చేసుకోవడం కంటే నిరంతరం గమనించే ఆధునిక సాంకేతికత ఎంతో మేలు చేస్తుంది.
ఒకప్పుడు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలంటే పదే పదే వేలికి సూదితో గుచ్చుకోవాల్సి వచ్చేది. అది కేవలం ఆ క్షణంలో ఉన్న షుగర్ స్థాయిని మాత్రమే చూపుతుంది. కానీ ఇప్పుడు వైద్య విధానం మారింది. ఒకే రీడింగ్ మీద ఆధారపడకుండా, రోజంతా షుగర్ స్థాయిలు ఎలా మారుతున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. దీనివల్ల బాడీలో జరిగే మార్పులను ముందే గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుంది.
వానకాలంలో ఆహారం, శారీరక శ్రమలో వచ్చే మార్పులను పసిగట్టడానికి ‘కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్’ (సీజీఎమ్) పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది చర్మంపై చిన్న సెన్సార్ రూపంలో ఉంటుంది. మీ ఫోన్‌కు అనుసంధానమై ప్రతి నిమిషం షుగర్ స్థాయిని చూపిస్తుంది. షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోయినా లేదా పెరిగినా వెంటనే అలర్ట్ మెసేజ్ ద్వారా హెచ్చరిస్తుంది.
Also Read: అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?
శరీరం ఏ ఆహారానికి ఎలా స్పందిస్తుందో, ఒత్తిడి లేదా వాతావరణ మార్పుల వల్ల షుగర్ లెవెల్స్ ఎలా మారుతున్నాయో ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. ఈ పరికరం అందించే డేటా ద్వారా మీ శరీర తీరును స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ మన జీవనశైలి ఎలా ప్రభావం చూపుతోందో లైవ్‌గా చూడటం వల్ల మనకు మనమే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం.
ఈ పరికరాల ద్వారా వచ్చే డేటాను డిజిటల్ విధానంలో వైద్యులతో లేదా ఇంట్లోని కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. దీనివల్ల డాక్టర్లు మీ దగ్గరకు రాకుండానే ట్రెండ్స్ చూసి మందుల మోతాదును సులభంగా సర్దుబాటు చేస్తారు. అత్యవసర సమయంలో ఇంట్లో ఉన్న పెద్దలకు గ్లూకోజ్ తగ్గిపోతే దూరంగా ఉన్న పిల్లలకు కూడా అలర్ట్ వెళ్లే సదుపాయం ఉండటం ఎంతో ఊరటనిచ్చే అంశం.
వర్షాకాలం తెచ్చే తంటాలు, దినచర్యలో ఆటంకాలు ఎలా ఉన్నా షుగర్ మేనేజ్‌మెంట్‌ను సులభం చేసుకోవచ్చు. ఇలాంటి డిజిటల్ టూల్స్ వాడటం ద్వారా షుగర్ హఠాత్తుగా పెరగడం లేదా తగ్గడం వంటి సమస్యల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. వాతావరణం ఎలా మారినా సరైన అవగాహన, చిన్నపాటి జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చు.
Also Read: ఇంత భారీగా ధర తగ్గుతుందని ఎవరూ ఊహించి ఉండరు.. Galaxy Z Fold 4 ఇప్పుడు రూ.89 వేలకే!