NEET 2026 Counselling: నీట్ పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో ఎంబిబిఎస్, ఇతర వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియలో కీలక దశ ప్రారంభమైంది. ఇప్పుడు విద్యార్థులు కౌన్సెలింగ్‌కు సిద్ధం కావాలి. చాలా మంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 85 శాతం స్టేట్ కోటా సీట్లను లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే, నీట్ అర్హత సాధించిన ప్రతి విద్యార్థి ఈ కోటాలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన డొమిసైల్, నివాస అర్హత నిబంధనలు అమలు చేస్తుంది. అందువల్ల కౌన్సెలింగ్‌కు ముందు అర్హతలను తప్పనిసరిగా పరిశీలించాలి.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లను రెండు విభాగాలుగా విభజిస్తారు. మొదటి విభాగం 15 శాతం ఆల్ ఇండియా కోటా. ఈ సీట్లకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ దేశవ్యాప్తంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. రెండో విభాగం 85 శాతం స్టేట్ కోటా. ఈ సీట్లను ఆయా రాష్ట్రాల కౌన్సెలింగ్ అధికారులు భర్తీ చేస్తారు. ఈ కోటాలో ప్రవేశం పొందాలంటే ఆ రాష్ట్రం నిర్ణయించిన అర్హతలను తప్పనిసరిగా పాటించాలి.
డొమిసైల్ నిబంధనలు విద్యార్థి స్టేట్ కోటాకు అర్హుడా కాదా అనేది నిర్ణయిస్తాయి. కొన్ని రాష్ట్రాలు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాన్ని (పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికెట్) తప్పనిసరిగా కోరుతాయి. మరికొన్ని రాష్ట్రాలు విద్యార్థి చదివిన పాఠశాల ఆధారంగా అర్హతను నిర్ణయిస్తాయి. ఇంకొన్ని రాష్ట్రాలు తల్లిదండ్రుల ఉద్యోగ వివరాలను కూడా పరిగణలోకి తీసుకుంటాయి. అందుకే అధికారిక కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవడం అవసరం.
హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, సిక్కిం వంటి రాష్ట్రాల్లో డొమిసైల్ సర్టిఫికెట్‌కు ముందుగా ప్రాధాన్యం ఇస్తారు. ఈ రాష్ట్రాల్లో స్టేట్ కోటా కింద అడ్మిషన్ పొందాలంటే చెల్లుబాటు అయ్యే డొమిసైల్ సర్టిఫికెట్ సమర్పించాలి. కౌన్సెలింగ్‌కు ముందే ఈ పత్రాలను సిద్ధం చేసుకోవడం మంచిది.
కొన్ని రాష్ట్రాలు విద్యార్థి చదివిన పాఠశాలలను కూడా పరిగణలోకి తీసుకుంటాయి. ఉదాహరణకు తెలంగాణలో అయితే శాశ్వత పౌరులు లేదా వరుసగా రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల పాటు చదువు సాగించి ఉండాలి. ఆంధ్ర ప్రదేశ్‌లో అయితే పదేళ్ల పాటు రాష్ట్రంలో నివసించిన వారు లేదా వరుసగా నాలుగు 7 సంవత్సరాలు, క్రమంలో లేకుంటే 7 సంవత్సరాలు చదువుకొని ఉండాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు వారి తల్లిదండ్రులు అయి ఉండాలి. అస్సాంలో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలోనే చదివి ఉండాలి. ఢిల్లీలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో 11వ, 12వ తరగతులు పూర్తి చేసిన విద్యార్థులు అర్హత పొందుతారు.
మహారాష్ట్రలో డొమిసైల్ లేదా కనీసం పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించిన వారికి అర్హత ఉంటుంది. గోవాలో కూడా దీర్ఘకాలిక నివాసంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలలో 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఈ సందర్భాల్లో నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరం అవుతాయి.
కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులు లేదా రక్షణ దళాల సిబ్బంది పిల్లలకు ప్రత్యేక అర్హతలు కల్పిస్తాయి. అలాంటి విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి.
Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు
డొమిసైల్ సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, నేటివిటీ సర్టిఫికెట్, విద్యా సర్టిఫికెట్లు, నీట్ స్కోర్‌కార్డ్, గుర్తింపు కార్డులు వంటి పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. పూర్తి పత్రాలు ఉంటే కౌన్సెలింగ్ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది.
నీట్ అర్హత సాధించడం మాత్రమే స్టేట్ కోటా సీటు పొందడానికి సరిపోదు. ప్రతి రాష్ట్రం వేర్వేరు అర్హత నిబంధనలు అమలు చేస్తుంది. కౌన్సెలింగ్‌కు ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించి, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవడం ద్వారా అడ్మిషన్ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు.