చాలామంది జంటలు ఆధునిక కాలంలో పిల్లల్ని లేటుగా కనేందుకు ఇష్టపడుతున్నారు. నిజానికి పిల్లల్ని కన్నవారితో పోలిస్తే పిల్లలు లేనివారి మెదడు త్వరగా వృద్ధాప్యం బారిన పడుతుందని ఒక అధ్యయనం చెప్పింది. పిల్లల్ని దేవుడు ఇచ్చిన వరంగా చెప్పుకుంటారు. వారు అల్లరి చేసినా కూడా అందంగానే ఉంటుంది.
నిద్ర లేమి ఉన్నా
కొత్త అధ్యయనంలో ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న వ్యక్తులు శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉంటారని తెలిసింది. వారి మెదడు కూడా త్వరగా వృద్ధాప్యం బారిన పడదని అధ్యయనం కనిపెట్టింది. పిల్లల వల్ల తల్లిదండ్రులకు రాత్రిపూట నిద్రలేమి సమస్య వస్తుంది. ఉదయాన్నే కాస్త ఒత్తిడికి గురవుతారు. కానీ ఇవే వారికి వరంలా మారుతాయని కొత్త అధ్యయనం చెబుతోంది.
బ్రిటన్ లోని పరిశోధకులు 19,000 మంది మహిళలు, 17వేల మంది పురుషుల మెదడును స్కాన్ చేసి విశ్లేషించారు. పిల్లలు ఉన్నవారికి, పిల్లలు లేని వారికి మధ్య మెదడు తేడాలను గమనించారు. తక్కువ మంది పిల్లలు ఉన్నవారు లేదా పిల్లలు లేని వారితో పోలిస్తే ఎక్కువ మంది పిల్లలను కన్నవారిలో మెదడు చాలా చురుగ్గా కనిపించింది. అలాగే శరీరంలోని వివిధ భాగాల మధ్య సమన్వయం కూడా చక్కగా ఉంది.
తల్లిదండ్రులు ఇద్దరిలోనూ
వయసు పెరుగుతున్న కొద్దీ మెదడులోని కొన్ని ప్రాంతాల్లో కనెక్టివిటీ కోల్పోతూ ఉంటారు. కానీ పిల్లలు వల్ల ఆ కనెక్టివిటీ మరింతగా పెరుగుతుందని అధ్యయనకర్తలు చెబుతున్నారు. పరిశోధనలో తెలిసిన మరో విషయం ఏమిటంటే పిల్లల విషయంలో పురుషులు, స్త్రీలకు ఒకేలాంటి ఫలితాలు వచ్చాయి. గర్భం ధరించే స్త్రీలో వచ్చిన మార్పులే, గర్భం ధరించకుండా పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటున్న తండ్రిలో కూడా కనిపించాయి.
పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం వల్లే కలిగే ప్రభావాలు తల్లీ, తండ్రి ఇద్దరిలోనూ కూడా సమానంగానే ఉన్నాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం వల్ల సామాజిక కార్యక్రమాల్లో వారితో పాల్గొనడం వల్ల తల్లిదండ్రులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఈ పరిశోధన పేర్కొంది.
Also Read: తులసి ఆకులు తింటే.. బోలెడు ప్రయోజనాలు !
పిల్లల్ని కనండి
కాబట్టి పిల్లలు లేనివారు సంతోషంగా ఉన్నామని అనుకోవద్దు. మీకు తెలియకుండానే మీ మెదడు త్వరగా వృద్ధాప్యం బారిన పడుతుంది. కాబట్టి కనీసం ఇద్దరు పిల్లలను కనేందుకు ప్రయత్నించండి. మీ ఆరోగ్యం కూడా చురుగ్గా మారుతుంది.