Palpitations Heart Beat| చాలామంది ఒత్తిడి, అలసట, నిద్రలేమి ఉన్న సమయంలో గుండె దడా దడా కొట్టుకుంటోందని.. ఆందోళన చెందుతుంటారు. తమకు ఏదో ప్రమాదం పొంచి ఉందని.. గుండె సంబంధిత సమస్య లేమైనా ఉన్నాయా? అని భయపడుతుంటారు. అయితే ఈ గుండె దడ ప్రమాదకరమా? కాదా? అనేది తెలుసుకుందాం.
గుండెదడ అంటే ఏమిటి?
వైద్య భాషలో గుండెదడను ‘పాల్పిటేషన్’ అంటారు. ఇది చాలామంది జీవితంలో ఎప్పుడో ఒకసారి అనుభవించే సాధారణ విషయం. గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది, కానీ సాధారణంగా మనకు అది తెలియదు. కానీ కొన్నిసార్లు గుండె వేగంగా లేదా అసాధారణంగా కొట్టుకుంటున్నట్లు మనకు అనిపిస్తుంది. దీన్ని ఆంగ్లంలో ‘ఫ్లట్టరింగ్’ లేదా ‘రేసింగ్’ అని అంటారు.
గుండెదడకు కారణాలు ఏమిటి?
ఒత్తిడి, ఆందోళన, ఎక్కువ కాఫీ తాగడం, పొగతాగడం, మద్యం సేవించడం, నిద్రలేమి, జ్వరం, గర్భం లాంటివి గుండెదడకు కారణమవుతాయి. చాలా సందర్భాల్లో ఇది సాధారణమైనదే, హాని చేయదు. కానీ కొన్నిసార్లు ఇది తీవ్రమైన గుండె సమస్యల సంకేతం కావచ్చు.
ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి?
కారణం లేకుండా గుండెదడ అకస్మాత్తుగా వస్తే
తలతిరగడం, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, స్పృహ కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే
గుండె లయ తప్పడం (అరిథ్మియా) ఉంటే
ఇలాంటి సందర్భాల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గుండె సాధారణంగా ఒక నిర్దిష్ట లయలో కొట్టుకుంటుంది. ఈ లయను ‘సయనో ఏట్రియల్ నోడ్’ అనే భాగం నియంత్రిస్తుంది. ఒకవేళ ఈ విద్యుత్ సంకేతాలు అసాధారణంగా వస్తే, గుండె లయ తప్పుతుంది. దీన్ని ‘అరిథ్మియా’ అంటారు. ఇలాంటి సమస్యలను ‘రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్’ అనే చికిత్సతో సరిచేయవచ్చు.
అలాంటి వారికి ప్రమాదం..
స్థూలకాయం, అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారు గుండెదడను సీరియస్‌గా తీసుకోవాలి. అలాగే, కుటుంబంలో గుండెపోటు వల్ల మరణాలు జరిగిన చరిత్ర ఉంటే, జాగ్రత్త అవసరం. ‘వెంట్రిక్యులార్ ట్యాకికార్డియా’ లేదా ‘ఆర్టీరియల్ ఫిబ్రిలేషన్’ లాంటి సమస్యలు ఉన్నవారిలో గుండెదడ కార్డియాక్ అరెస్ట్ లేదా స్ట్రోక్‌కు దారితీయవచ్చు.
Also Read: 60 ఏళ్ల వయసులో చనిపోతాడనకుంటే.. 102 ఏళ్లకు ఫిట్‌నెస్ రికార్డులు
చికిత్స ఎలా ఉంటుంది?
గుండె లయ సమస్యలను కనిపెట్టడానికి ఇసిజీ (ECG), హోల్టర్ మానిటరింగ్, ఎలక్ట్రోఫిజియాలజికల్ స్టడీస్ లాంటి పరీక్షలు చేస్తారు. తీవ్రమైన కేసుల్లో ‘ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డీఫిబ్రిలేటర్’ (ICD) అనే పరికరాన్ని శరీరంలో అమర్చి, గుండె లయను సరిచేస్తారు.
మొత్తంగా చెప్పాంటే.. గుండెదడ సాధారణంగా హానికరం కాదు, కానీ అది ఒక హెచ్చరిక సంకేతంగా ఉండవచ్చు. సరైన సమయంలో వైద్య సలహా తీసుకోవడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. ఆధునిక వైద్య సాంకేతికతతో ఈ సమస్యలను సులభంగా నియంత్రించవచ్చు. కాబట్టి, గుండెదడను అర్థం చేసుకొని, ముందుజాగ్రత్త అవసరం.