Paracetamol:తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, కాస్త శరీరం నొప్పిగా అనిపించినా చాలా మందికి వెంటనే గుర్తు చేసుకునేది ఒకే ఒక్క మందు పారాసెటమాల్ టాబ్లెట్. ఎందుకంటే ఇది తక్కువ ధరలో దొరుకుతుంది, దగ్గరలోని ఏ మెడికల్ షాపుకెళ్లినా సులభంగా లభిస్తుంది. కానీ ఈ టాబ్లెట్‌ని మనం ఎంత వరకు వాడాలి, ఎలా వాడాలి అనే విషయంపై చాలా మంది పూర్తిగా అవగాహన లేదు. ఎందుకంటే తక్కువ ఖర్చులో ఉపసమనం కలుగుతుంది అని దానినే ఎక్కువగా వాడేస్తుంటారు. కానీ, ఇలా వాడటం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.
పారాసెటమాల్ అసలు ఉపయోగం శరీరంలో వచ్చే జ్వరం, నొప్పులను తగ్గించడం. అందుకే దీనిని ఎక్కువగా ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్, టూత్ పెయిన్ లాంటి సమస్యల కోసం డాక్టర్లు కూడా సూచిస్తారు. కానీ సమస్య ఏంటంటే, ఎవరు చెబితే వారు తాము ఇష్టానుసారం వాడేయడం. ఫార్మసీ దగ్గరికి వెళ్లి నాకు తలనొప్పి ఉంది, ఒక పారాసెటమాల్ ఇవ్వండి అని అడిగి తెచ్చేసుకుంటుంటారు. ఒకటి కాదు, రెండు కాదు మందుల షీటునే తీసుకుని ఉపయోగపడుతుందని ఇంటికి తెచ్చేసుకుంటుంటారు. ఇలా ఒకటే కాదు, రోజులో రెండు మూడు సార్లు కూడా వాడే వారు కూడా ఉన్నారు. ఇలా వాడటం సరైన పద్దతి కాదంటున్నా వైద్యులు
డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
డాక్టర్లు చెప్పే ప్రకారం పారాసెటమాల్ టాబ్లెట్‌ని 24 గంటల్లో 3 నుండి 4 సార్లు మాత్రమే వాడాలి. ఒక్కసారి వేసుకుంటే మళ్లీ 6 గంటల గ్యాప్ తప్పనిసరిగా ఉండాలి. దానికంటే ఎక్కువ మోతాదులో వాడితే లివర్‌కి తీవ్రమైన నష్టం కలిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ మందు శరీరంలోకి వెళ్లి నేరుగా లివర్‌పై పనిచేస్తుంది. ఎక్కువ డోసులో వాడితే లివర్ డ్యామేజ్ అవ్వడమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
Also Read: Wheatgrass juice: గోధుమ గడ్డిలో ఇంత పవర్ ఉందా? దీని జ్యూస్ తాగితే ఇన్ని లాభాలా!
డాక్టర్ల సలహా లేకుండా వాడొద్దు
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పారాసెటమాల్ టాబ్లెట్‌ని ఎప్పుడూ డాక్టర్ సలహా లేకుండా ఎక్కువ రోజులు వాడకూడదు. ఒక వారం పాటు వరుసగా జ్వరం వస్తే, టాబ్లెట్ వేసుకుంటూ ఉంటే అది జ్వరం తగ్గించొచ్చు కానీ అసలు కారణాన్ని కప్పేస్తుంది. జ్వరం వెనక మలేరియా, డెంగ్యూ, వైరల్ ఇన్ఫెక్షన్ లాంటి తీవ్రమైన వ్యాధులు దాగి ఉండవచ్చు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించి మందులు తీసుకోవడం మంచిది.
లివర్ ఫెయిల్యూర్ కేసులు
లండన్‌లో జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం, పారాసెటమాల్‌ని ఎక్కువ మోతాదులో వాడుతున్న వారిలో లివర్ ఫెయిల్యూర్ కేసులు ఎక్కువగా కనిపించాయని తేలింది. అందుకే వైద్యులు చెబుతున్న సలహా ఏమిటంటే అవసరమైతే మాత్రమే వాడాలి, అది కూడా డాక్టర్ సూచించిన మోతాదులోనే.
బ్రాండ్ మారిందని డోసు పెంచకూడదు
అలాగే గర్భిణీలు, చిన్నపిల్లలు, మధుమేహం, లివర్ లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా ఈ మందు ఎప్పుడూ వాడకూడదు. మార్కెట్‌లో ఇప్పుడు పలు బ్రాండ్స్‌లో పారాసెటమాల్ లభిస్తోంది. పేరు మారినా, అసలు మందు మాత్రం ఒక్కటే. కాబట్టి బ్రాండ్ మారిందని డోసు పెంచకుండా సరైన మోతాదులో వాడితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పారాసెటమాల్ వాడుతున్నప్పుడు మద్యపానం (ఆల్కహాల్) పూర్తిగా నివారించాలి. ఎందుకంటే ఆల్కహాల్ కూడా నేరుగా లివర్‌ను ప్రభావితం చేస్తుంది. ఈ రెండు కలిసిపోతే లివర్‌పై భారం మరింత ఎక్కువై, ప్రాణాలకు ప్రమాదం కలిగించే పరిస్థితి వస్తుంది. లేనిపక్షంలో చిన్న సమస్యకు వాడిన మందే పెద్ద సమస్యకు కారణం కావచ్చు.