వైద్యశాస్త్రం సృష్టికి ప్రతి సృష్టిని చేసే విధంగా కొత్త అద్భుతాలను ఆవిష్కరిస్తుంది. మనిషి జీవితాన్ని సైన్స్ ఎంత సులభతరం చేస్తుందో ఇప్పటికే మనం ప్రత్యక్షంగా చూసాము. ఇప్పుడు బిడ్డ పుట్టుకను, ఆ బిడ్డ రంగును, రూపును, జుట్టును కూడా తల్లిదండ్రులు ముందుగానే నిర్ణయించుకునే కొత్త అద్భుతం త్వరలో రాబోతోంది. అమెరికన్ జెనోమిక్స్ కంపెనీ అయినా న్యూక్లియస్ జెనోమిక్స్.. ఈ కొత్త సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేసింది. పిల్లల జన్యువులను ఆప్టిమైజ్ చేయగల సాఫ్ట్ వేర్ ఇది.
ప్రస్తుతం పిల్లల చర్మపు రంగును, కంటి రంగును, జుట్టును తల్లిదండ్రులు ఎంచుకోలేరు. తల్లిదండ్రుల జన్యువులను అందుకున్న పిండం… ఆ జన్యువుల ఆధారంగా బిడ్డ ఎదుగుతుంది. కానీ ఇకపై మాత్రం టెక్నాలజీ బిడ్డ రూపురేఖలను నిర్ణయించే రోజులు రాబోతున్నాయి.
సహజంగా పిల్లలు కలగక ఐవీఎఫ్ పద్ధతిలో బిడ్డలను కంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. భవిష్యత్తులో ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లల్ని కనాలనుకునే వారికి ఈ శుభవార్తను మోసుకొచ్చింది. న్యూక్లియస్ జినోమిక్స్ కంపెనీ ఐవిఎఫ్ టెక్నాలజీలో బిడ్డను కనాలనుకునేవారు తమ బిడ్డ చర్మపు రంగును, కంటి రంగును, జుట్టును కూడా ఎంపిక చేసుకోగలరు. మీ బిడ్డకు రింగుల జుట్టు కావాలంటే ఆ రింగుల జుట్టు వచ్చేలా చేసుకోవచ్చు. తల్లిదండ్రులు ఇద్దరు నలుపుగా ఉన్నా మీ బిడ్డ తెల్లగా ఉండాలని కోరుకుంటే దాన్ని కూడా పొందవచ్చు. అలాగే కంటిలోని కనుగుడ్డు రంగును కూడా ఎంపిక చేసుకోవచ్చు.
ప్రస్తుతం కూడా ఐవీఎఫ్ లో పద్ధతిలో పిల్లలను కంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఈ ఐవీఎఫ్ పద్ధతిలో ప్రయోగశాలలోనే అండాన్ని, స్పెర్మ్ ను ఫలదీకరణం చేసి ఆ పిండాన్ని స్త్రీ గర్భంలో అమరుస్తారు. అయితే న్యూక్లియస్ జెనోమిక్స్ ఒక అడుగు ముందుకు వేసింది. న్యూక్లియస్ ఆంబ్రియో అనే జన్యు ఆప్టిమైజేషన్ సాఫ్ట్ వేర్‌ను అభివృద్ధి చేసింది. ఇది పిండం ఏర్పడిన తర్వాత ఆ డిఎన్ఏ ను విశ్లేషిస్తుంది.
అలా విశ్లేషించడం ద్వారా 900 కంటే ఎక్కువ వ్యాధుల సంభావ్యతను తనిఖీ చేస్తుంది. అంటే పుట్టబోయే బిడ్డకు భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందో ముందే తెలుసుకోవడం. వీటిలో మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా ఉన్నాయి. ఇవి ఆ బిడ్డకు వస్తాయో, లేదో పిండంగా ఉన్నప్పుడే ఈ సాఫ్ట్ వేర్ అంచనా వేసి చెబుతుంది.
అలాగే ఆ బిడ్డకి పుట్టబోయే బిడ్డకు ఐక్యూ ఎంత ఉండవచ్చు. ఊబకాయం ఉంటుందా? డిప్రెషన్ బారిన పడే అవకాశాలు ఉంటాయా? అని మానసిక స్థితిని కూడా అంచనా వేస్తుంది. అలాగే ఆ బిడ్డ పెద్దయ్యాక ఎంత ఎత్తు ఎదిగే అవకాశం ఉందో సమాచారాన్ని ముందుగానే ఇస్తుంది. ఇక తల్లిదండ్రులు తమ బిడ్డకు ఎలాంటి జుట్టు రంగు కావాలి, లేదా కంటి రంగు, చర్మపు రంగు కావాలో కూడా ఎంచుకోగల అవకాశాన్ని ఇస్తుంది.
ఎలా తల్లిదండ్రులు ఎంపిక చేసుకోవచ్చు?
ఐవీఎఫ్ ద్వారా పిల్లలను ప్లాన్ చేసుకున్న వారు ముందుగానే 20 పిండాల డిఎన్ఏ డేటాను అప్లోడ్ చేయవచ్చు. తల్లిదండ్రుల నుంచి అండాలు, స్పెర్మ్ వంటివి కలిసి ల్యాబ్ లోనే పిండాలు ఏర్పడేలా చేస్తారు. ఈ సాఫ్ట్ వేర్ వాటిని విశ్లేషించి వివరణాత్మకంగా నివేదిక ఇస్తుంది. తమకు నచ్చినట్టు ఏ పిండం అభివృద్ధి చెందుతుందో తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు. అంటే ఏ పిండాన్ని గర్భంలో ప్రవేశపడితే పుట్టబోయే బిడ్డ తమకు నచ్చిన రంగులో లేదా రూపులో పుడతాడో అంచనా వేసి ఈ సాఫ్ట్ వేర్ చెప్పేస్తుంది. 20 రకాల పిండాల్లో ఏ బిడ్డ చర్మపురంగు తెల్లగా ఉంటుందో లేదా నల్లగా ఉంటుందో ముందే తెలుసుకొని ఆ పిండాన్ని తమ గర్భంలో ప్రవేశపెట్టమని కోరవచ్చు. అంటే తల్లిదండ్రులు తమకు ఏ పిండం ఉత్తమమైనదో ముందే నిర్ణయించుకుని ఆ పిండాన్ని తమ గర్భంలో ప్రవేశపెట్టి జన్మను ఇస్తారన్నమాట.
నైతికత వాదన
ఈ సాఫ్ట్ వేర్ అభివృద్ధి చెందాక ఇది నైతికమైనదేనా అనే అంశం కూడా చర్చలోకి వస్తోంది. మనుషులే తమ పుట్టబోయే పిల్లలను డిజైన్ చేసుకుంటారా? అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దీనికి ఆ కంపెనీ వ్యవస్థాపకుడైన కియాన్ సడేజి మాట్లాడుతూ ప్రజలు ముందుగానే తమ ఆరోగ్యాన్ని తెలుసుకున్నట్టే.. తమ పుట్టబోయే బిడ్డల ఆరోగ్యకరమైన జీవితం గురించి తెలుసుకోవడం తప్పు లేదని చెబుతున్నాడు. ఏది ఏమైనా ఈ కొత్త సాఫ్ట్ వేర్ అనేది సాంకేతిక వైద్యశాస్త్రంలో పెద్ద ముందడుగు అని మాత్రం చెప్పుకోవాలి.