Tatkal Train Ticket Booking: తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ విషయంలో ప్రయాణీకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ వాటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. నిజమైన ప్రయాణీకులకు లాభం కలిగేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణీకులకు ఇ-ఆధార్ ప్రామాణీకరణను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది.
రైల్వేశాఖ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే?
రైల్వేశాఖ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం నిజమైన ప్రయాణీకులకు తత్కాల్ టికెట్ బుకింగ్స్ లో ప్రాధాన్యత ఇవ్వనుంది. తత్కాల్ టికెట్ బుకింగ్ విండో ఓపెన్ అయిన తొలి 10 నిమిషాలలో అసలైన వినియోగదారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. అంతేకాదు, అక్రమ సాఫ్ట్ వేర్, చాట్ బాట్ లు ఉపయోగించకుండా చర్యలు చేపడుతోంది. ఈ విధానం ద్వారా అసలైన రైలు ప్రయాణీకులు కన్ఫార్మ్ రైలు టికెట్లను పొందండంలో సాయపడనుంది.
ఆధార్ ప్రమాణీకరణ ఎప్పటి నుంచి అంటే?
తత్కాల్ రైలు టికెట్లను బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణీకులు ఇకపై ఇ-ఆధార్ ప్రామాణీకరణను తప్పనిసరి చేసిన రైల్వేశాఖ.. ఈ విధానాన్ని ఈ నెల చివరి నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి వైష్ణవ్ ప్రకటించారు. “తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి భారతీయ రైల్వే త్వరలో ఇ-ఆధార్ ప్రామాణీకరణను ఉపయోగించడం ప్రారంభిస్తాయి. ఇది నిజమైన వినియోగదారులకు అవసరమైనప్పుడు ధృవీకరించబడిన టికెట్లను పొందడానికి సహాయపడుతుంది” అన్నారు. ఇ-ఆధార్ ప్రామాణీకరణ కోసం ఆన్ లైన్ తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ రూల్స్ మార్పు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మార్పు ఈ నెల చివరి నుంచి ప్రారంభమవుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఆ టైమ్ లో బుకింగ్ ఏజెంట్లకు నో ఎంట్రీ!
ఆధార్ కార్డుతో తమ అకౌంట్ ను లింక్ చేసే IRCTC వినియోగదారులకు తత్కాల్ టికెట్ బుకింగ్స్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాదు, తత్కాల్ విండో ఓపెన్ అయిన తర్వాత తొలి 10 నిమిషాల్లో బుకింగ్ ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు అనుమతివ్వరు. ఈ విధానం ద్వారా అసలైన వినియోగదారులకు మాత్రమే కన్ఫర్మ్ టికెట్లు దొరుకుతాయని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. నిజానికి తత్కాల్ కోటా కింద ఆన్ లైన్‌లో విక్రయించే టికెట్లలో సగానికి పైగా విండో తెరిచిన తొలి 10 నిమిషాల్లోనే బుక్ అయిపోతున్నాయి. వాటిలో ఎక్కువగా బుకింగ్ ఏజెంట్లు టికెట్లను పొందుతున్నారు. తాజా నిర్ణయంతో నిజమైన లబ్దిదారులకే టికెట్లు లభించనున్నాయి.
తత్కాల్ టికెట్ బుకింగ్ టైమింగ్స్
తత్కాల్ టికెట్ బుకింగ్ అనేది రైలు షెడ్యూల్ కు ఒకరోజు ముందు అందుబాటులోకి వస్తాయి. ఫస్ట్ AC, ఎగ్జిక్యూటివ్ క్లాస్ మినహా అన్ని తరగతులలో తత్కాల్ బుకింగ్‌లు అనుమతించబడతాయి. తత్కాల్ బుకింగ్‌లో ఎటువంటి రాయితీ అనుమతించబడదు. ప్రయాణానికి ఒక రోజు ముందు ఉదయం 10 గంటల నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభం అవుతుంది.
Read Also: టికెట్ కన్ఫర్మ్ కాకపోతే మూడు రెట్లు డబ్బు వాపస్, వెంటనే ట్రై చేయండి!