Situationship: ఎలాంటి పేరు లేని బంధం, పెళ్లి లేదా లవర్స్ లాగా అనౌన్స్ చేసుకోని రిలేషన్‌షిప్.. దీన్నే మనం ఇప్పుడు ‘సిచ్యుయేషన్‌షిప్’ అంటున్నాం. నిజానికి ఒక బ్రేకప్ జరిగితే చాలా బాధగా ఉంటుంది. కానీ, అసలు ఆ రిలేషన్‌షిప్‌కి ఒక పేరు లేనప్పుడు, విడిపోయిన తర్వాత వచ్చే బాధ అంతా ఇంతా కాదు. ఇద్దరి మధ్య ఎలాంటి కమిట్‌మెంట్ లేకపోయినా.. మనసు మాత్రం వాళ్ల గురించి ఆలోచిస్తుంటుంది. అలాంటప్పుడు బయటికి చెప్పలేక, లోలోపల కుమిలిపోతుంటారు. ఈ నేపథ్యంలో అలాంటి సిచ్యుయేషన్‌షిప్ నుంచి బయటికి రావడం ఎందుకు అంత కష్టమో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఒక రిలేషన్‌షిప్ ముగిసిపోతే మనకొక స్పష్టత ఉంటుంది. ఇద్దరం మాట్లాడుకుని విడిపోతాం లేదా గొడవైనా జరుగుతుంది. కానీ ఇలాంటి ఆల్మోస్ట్ రిలేషన్స్‌లో అలాంటి క్లారిటీ ఉండదు. సడన్‌గా మెసేజ్‌లు తగ్గిపోవడం, మాట్లాడటం మానేయడం లేదా క్రమంగా దూరం పెరిగిపోవడం జరుగుతుంది. ఒక స్పష్టమైన ముగింపు లేకపోవడంతో, మన మైండ్ ఎప్పుడూ అదే ఆలోచనలో ఉండిపోయి, అసలు ఏం జరిగిందో అర్థం చేసుకోలేక సతమతమవుతుంది.
Also Read: డిమార్ట్‌లో విడిగా అమ్మే సరుకులకు ఎక్స్‌పైరీ డేట్స్ ఉండవా? FSSAI నిబంధనలు ఏం చెబుతున్నాయ్?
రిలేషన్‌షిప్‌కి ఒక లేబుల్ ఉంటేనే మనసులు కలుస్తాయని రూలేం లేదు. రోజూ గంటల తరబడి చాటింగ్ చేసుకోవడం, జోకులు వేసుకోవడం, భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం వల్ల తెలియకుండానే ఒక గట్టి ఎమోషనల్ బాండ్ ఏర్పడుతుంది. బయటికి మేము ఫ్రెండ్స్ అని చెప్పుకున్నా, లోపల మాత్రం ఫీలింగ్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి. అందుకే బంధానికి పేరు లేకపోయినా, తెగిపోయినప్పుడు వచ్చే పెయిన్ మాత్రం నిజమైన బ్రేకప్‌కంటే ప్రమాదకరంగా ఉంటుంది.
ఇలాంటి బంధాల్లో మనం ఎదుటివారితో ఎక్కువ కాలం గడపకపోవడం వల్ల వారిలోని చెడు అలవాట్లు లేదా తప్పులు మనకు పెద్దగా తెలియవు. దాంతో వారి గురించి మన మనసులోనే ఒక అద్భుతమైన ఇమేజ్ సృష్టించుకుంటాం. వీళ్లతో మన ఫ్యూచర్ ఇలా ఉంటుందని ఊహించుకుంటాం. చివరికి ఆ బంధం కరిగిపోయినప్పుడు, మనం కోల్పోతున్నది ఆ వ్యక్తిని కాదు.. మనం ఊహించుకున్న ఆ అందమైన భవిష్యత్తునే అని తర్వాత అర్థమవుతుంది.
నిజమైన బ్రేకప్ అయితే పది మందికి చెప్పి ఏడ్చి, ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోవచ్చు. కానీ ‘మా ఇద్దరి మధ్య ఏమీ లేదు, కేవలం మాట్లాడుకునేవాళ్లం అంతే’ అని సిచ్యుయేషన్‌షిప్ గురించి బయటికి చెబితే జనాలు ఏమనుకుంటారోనని భయమేస్తుంది. ‘అసలు మీరేం ప్రేమించుకోలేదు కదా, నీకెందుకు అంత బాధ?’ అని ఎదుటివాళ్లు అడిగే ప్రశ్నలు మనల్ని మరింత కృంగదీస్తాయి. దీంతో ఎవరికీ చెప్పుకోలేక, ఆ బాధనంతా గుండెలోనే దాచుకుని కుమిలిపోవాల్సి వస్తుంది.
Also Read: మగాళ్లు జేబులో దువ్వెన ఎందుకు పెట్టుకుంటారు? సైకాలజీ ప్రకారం వారి క్యారెక్టర్ ఎలాంటిదంటే..