Phone screen time: ఇప్పటి కాలంలో ఫోన్, టాబ్లెట్, టీవీ, ల్యాప్‌టాప్ ఇవన్నీ మన జీవితంలో భాగమైపోయాయి. పెద్దలు మాత్రమే కాదు, చిన్న పిల్లలూ కూడా వీటికి బాగా అలవాటు పడుతున్నారు. యూట్యూబ్ వీడియోలు, కార్టూన్లు, గేమ్స్, స్టడీ యాప్స్.. ఇవన్నీ పిల్లలకు సరదాగా, కొన్ని సందర్భాల్లో ఉపయోగకరంగానే ఉంటాయి. కానీ, ఎంత సేపు చూడాలి? అనే విషయం మాత్రం చాలా ముఖ్యం. ఎక్కువ స్క్రీన్ టైమ్ వల్ల కళ్ల ఆరోగ్యం, నిద్ర, చదువు, మానసిక అభివృద్ధి అన్నీ ప్రభావితం కావచ్చు. వయస్సు వారీగా పిల్లలు ఎంత సేపు ఫోన్ లేదా ఏదైనా డిజిటల్ స్క్రీన్ చూడాలనే క్లారిటీ ఇచ్చారు కంటి వైద్య నిపుణులు. అందుకే ఆ వివరాల్లోకి వెళితే..
0 – 2 సంవత్సరాలు
ఈ వయసులో ఉన్న పిల్లలకు స్క్రీన్ టైమ్ తప్పనిసరి అయితే తప్ప ఇవ్వకపోవడం మంచిది. డాక్టర్ల సూచన ప్రకారం, 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఫోన్, టీవీ చూడడం మానేయాలి. ఎందుకంటే ఈ వయసులో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. కళ్ల కదలికలు, దృష్టి సామర్థ్యం, భాషా నైపుణ్యం.. ఇవన్నీ స్క్రీన్ కంటే నిజమైన ప్రపంచాన్ని చూసే అనుభవాల ద్వారా బాగా వస్తాయి.
2 – 5 సంవత్సరాలు
ఈ వయసులో ఉన్న పిల్లలకు రోజుకు 1 గంట కన్నా ఎక్కువ స్క్రీన్ టైమ్ ఇవ్వకూడదు. అది కూడా హై క్వాలిటీ కంటెంట్ అంటే చదువుకు, క్రియేటివ్ ఆలోచనలకు సహాయపడే వీడియోలు మాత్రమే ఉండాలి. అలాగే, పిల్లలతో కలిసి కూర్చొని చూడడం మంచిది. ఇలా చేస్తే వారు చూస్తున్నది అర్థం చేసుకోవడంలో సులభం అవుతుంది.
6 – 12 సంవత్సరాలు
ఈ వయసులో పిల్లలు ఇప్పటికే స్కూల్ పనులు, ప్రాజెక్టులు, హోంవర్క్ కోసం డిజిటల్ పరికరాలు ఉపయోగించాల్సి రావచ్చు. అందుకే రోజుకు 1.5 – 2 గంటలు స్క్రీన్ టైమ్ పరిమితం చేయడం మంచిది. ఇందులో చదువు, గేమ్స్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి ఉండాలి. ఎక్కువ సమయం ఫోన్‌లో గేమ్స్ లేదా సోషల్ మీడియా వాడటం వల్ల వ్యసనం వచ్చే ప్రమాదం ఉంది.
13 – 18 సంవత్సరాలు
టీనేజ్‌లో ఉన్న పిల్లలకు స్క్రీన్ టైమ్ రోజుకు 2 – 3 గంటల లోపు పరిమితం చేయాలి. ఈ వయసులో ఎక్కువగా సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, చాటింగ్ ఇవన్నీ ఎక్కువ సమయం తీసుకుంటాయి. అందుకే చదువుకు హాని కలగకుండా సమయాన్ని బాగా ప్లాన్ చేయాలి. అలాగే నిద్రకు కనీసం 1 గంట ముందు ఫోన్ ఉపయోగించడం మానేయాలి, ఎందుకంటే స్క్రీన్ లైట్ నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది.
Also Read: Smartphone market: సూపర్ షాట్ కొట్టిన స్మార్ట్ ఫోన్ ఏది? ఈ జాబితాలో మీ ఫోన్ ర్యాంక్ ఎంత?
ఎక్కువ స్క్రీన్ టైమ్ వల్ల కలిగే సమస్యలు
కళ్ల సమస్యలు – పొడిబారడం, బ్లర్ విజన్, హెడేక్
నిద్రలేమి – స్క్రీన్ లైట్ వల్ల మెలటోనిన్ తగ్గిపోవడం
ఏకాగ్రత లోపం – చదువులో దృష్టి తగ్గిపోవడం
శారీరక చలనం తగ్గిపోవడం – వ్యాయామం, అవుట్‌డోర్ ఆటల తగ్గుదల
మానసిక ప్రభావం – ఒంటరితనం, ఆందోళన, డిప్రెషన్
స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు చిట్కాలు
ఫోన్ వినియోగ సమయం ఫిక్స్ చేయండి.. ఉదయం, సాయంత్రం మాత్రమే ఇవ్వడం
ఫ్యామిలీ యాక్టివిటీస్ పెంచండి.. ఆటలు, కథలు, వాకింగ్ ఇలా
రియల్ లైఫ్ లెర్నింగ్.. పుస్తకాలు, పెయింటింగ్, క్రాఫ్ట్స్ చేయించడం
పేరెంట్స్ కూడా మోడల్ అవ్వాలి.. పెద్దవాళ్లు ఎక్కువ ఫోన్ వాడితే, పిల్లలు కూడా అలాగే చేస్తారు
ఫోన్ లేదా టీవీ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ ఎంత సేపు చూడాలో నియంత్రణ ఉండాలి. వయస్సుకు తగ్గ స్క్రీన్ టైమ్ ఇస్తే, పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా ఉండడమే కాకుండా టెక్నాలజీని సరిగ్గా వాడటం కూడా నేర్చుకుంటారు.