Chanakya Rich Man Qualities| చాణక్యుడు.. ఈ పేరు రాజకీయాలలో ఓ మహోన్నత శిఖరం. అయితే ఆచార్య చాణక్యుడు రాజనీతితో పాటు ఓ మనిషి ఉత్తమ జీవితం ఎలా జీవించాలో తన నీతి వాక్యాల ద్వారా ప్రపంచానికి బోధించాడు. ఆయన బోధనలు, సూత్రాలు పాటిస్తే జీవితంలో ప్రతిఒక్కరూ లక్ష్యం సాధిస్తారు. అయితే ఆ నీతులలో ప్రస్తుతం జీవితంలో సుఖంగా, ధనవంతుడిగా ఉండాలంటే ఓ మనిషిలో ఎలాంటి లక్షణాలు ఉండాలో చాణక్య నీతుల ద్వారా తెలుసుకుందాం
సంతృప్తిగా జీవించే వ్యక్తి
భగవంతుడు ప్రసాదించిన సంపదతోనే సంతృప్తి చెందే వ్యక్తి జీవితంలో ఎల్లప్పుడూ సుఖంగా ఉంటాడు. అంతేకాక తాను ధనవంతుడనే భావన అతనిలో ఎప్పుడూ ఉంటుంది. ఫలితంగా అతనిపై ఎటువంటి ఆర్థిక కష్టాలు, దుఃఖాలు ప్రభావం చూపలేవు. అతని జీవితంలో సుఖాలే నెలకొంటాయి. ఉన్నదానితోనే తృప్తిపడి జీవించడం, ప్రస్తుతాన్ని ఆనందంగా అంగీకరించడం వంటి గుణాలు చాలా తక్కువ మందిలోనే కనిపిస్తాయి. ఎవరు తమకు ఉన్నదానితో సంతృప్తి చెందక అధిక సంపద కోసం ఆశపడుతూనే ఉంటారో.. వారు జీవితంలో ఎన్నటికీ ప్రశాంతతను పొందలేరు. అటువంటి వ్యక్తులకు ఎంత సంపద ఉన్నా లేనట్లే. ఎవరైతే తమకు ఉన్నదానితోనే సంతోషంగా జీవించడానికి సిద్ధపడతారో, సంతృప్తి చెందుతారో అతడు జీవితాంతం ఐశ్వర్యవంతుడితో సమానమని చాణక్యుడు చెప్పాడు. ఆనందానికి నిర్వచనంగా అలాంటి వ్యక్తుల జీవితాలు కనిపిస్తాయి.
భర్తను గౌరివించే భార్య కలవాడు
చాణక్యుని మాటల ప్రకారం ఒక వ్యక్తికి విధేయమైన భార్య లభిస్తే.. అతను నిజంగా అదృష్టవంతుడు, ఐశ్వర్యవంతుడు. అటువంటి పురుషునికి భూలోకంలోనే సకల సుఖాలు లభిస్తాయి. జీవితంలో ఇలాంటి వ్యక్తికి కష్టాలు వచ్చినా తోడుగా నిలబడే భార్య లభిస్తే అతని దారిద్ర్యం ఎక్కువ కాలం ఉండదు. కష్టపడాలే గానీ భార్యతోడుగా ఉండే వ్యక్తికి తప్పకుండా సిరి లభిస్తుంది. అందుకే అలాంటి భర్తను అదృష్టవంతుడని పేర్కొనాలి. భార్యాభర్తల మధ్య స్నేహభావపూరితమైన బంధం ఇంట్లో ఆనందాన్ని, శాంతిని పెంపొందిస్తుంది. ఇది లక్ష్మీదేవి ఆగమనానికి సూచకం కూడా. కాబట్టి అలాంటి భార్యను పొందిన భర్త కచ్చితంగా ఐశ్వర్యవంతుడు అవుతాడు. భార్య మాత్రమే భర్తకు విధేయంగా ఉండడం కాదు. ఆ భర్త కూడా భార్యను ప్రేమించాలి, ఆమెను గౌరవించాలి. ఆమెకు తన జీవితంలో ప్రాధాన్యం ఇవ్ాలి. ఈ విధంగా భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ ఉంటే.. ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.
Also Read: ఫోన్ పే, గూగుల్ పే నుంచి ఉచితంగా మొబైల్ రీచార్జ్.. ఈ ట్రిక్స్ పాటిస్తే సరి
కుమారుడిని తన నియంత్రణలో పెట్టుకునే తండ్రి
తన వారసుడిని ఒక మంచి మనిషిగా రూపుదిద్దడంలో ఓ తండ్రి పాత్ర చాలా ముఖ్యం. అయితే ఆ పుత్రుడిని తాను జీవించినంతకాలం తన ఆధీనంలో పెట్టుకునే వ్యక్తి కచ్చితంగా స్వర్గ సుఖాలను ఈ భూమిపైనే పొందుతాడు. విధేయంగా కొడుకుని కలిగి ఉండడం అదృష్టవంతుల లక్షణం. అయితే ఈ కాలంలో తండ్రీ కొడుకుల మధ్య సత్సంబంధాలు కనుమరుగవుతున్నాయి. తండ్రి వృద్ధుడైతే కొడుకులు అతడిని నిర్లక్ష్యం చేస్తున్నార. పైగా కొడుకులు చెప్పిందే తండ్రి వినాలని అంటున్నారు. అలా కాకుండా ఓ ఆదర్శవంతుడైన కుమారుడు, తల్లిదండ్రులకు సేవ చేసే కుమారుడు కలిగి ఉండే వారు ఎల్లప్పుడూ సంతోషం, సుఖం, విజయాలు, ధనం అన్నీ పొందుతారు. అయితే దీనికోసం ఆ తండ్రి కూడా ఆదర్శవంతుడిగా ఉండాలి. అతను జీవితంలో ఎలాంటి చెడు అలవాట్లు, వ్యసనాల బారిన పడకుండా ఉండాలి. అలాంటి తండ్రిని ఆదర్శంగా తీసుకునే కొడుకులు కూడా అతని అడుగుజాడల్లో జీవితం గడుపుతారు.
చాణక్యుడు చెప్పిన ఈ మూడు లక్షణాలు ఉంటే ఆ మనిషికి దు:ఖాలు దరిచేరవు. చేరినా వాటిని అతను పరిష్కరించగలడు. అందుకే జీవితాంతం అతను ఐశర్యవంతుడిగా ఉంటాడు.