Rajma Benefits: రాజ్మాను కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన పప్పు ధాన్యాలలో ఇవి కూడా ఒకటి. ఇవి కేవలం రుచికరమైనవే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న శక్తివంతమైన ఆహారం. రాజ్మాలో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పప్పు ధాన్యం మన శరీరానికి ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పోషక విలువలు పుష్కలం:
రాజ్మాలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, ప్రోటీన్లతో పాటు, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి అనేక కీలక విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని అందించి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
గుండె ఆరోగ్యానికి రక్ష:
రాజ్మాలో ఉండే పీచుపదార్థాలు (ఫైబర్) రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా.. కరిగే పీచుపదార్థాలు (శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే.. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.
మధుమేహ నియంత్రణ:
రాజ్మాలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే.. వీటిని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. ఇందులో ఉండే పీచుపదార్థాలు చక్కెర శోషణను నెమ్మదిచేస్తాయి. అంతే కాకుండా ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
బరువు తగ్గడానికి సహాయం:
రాజ్మాలో అధిక ప్రోటీన్, పీచుపదార్థాలు ఉంటాయి. ఈ రెండు పోషకాలు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. తద్వారా అతిగా తినడాన్ని నివారిస్తాయి. ఇది బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటానికి సహాయ పడుతుంది.
జీర్ణక్రియను మెరుగుదల:
రాజ్మాలో ఉండే పీచుపదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మలబద్ధకాన్ని నివారించి.. పేగు కదలికలను క్రమబద్ధీకరించడంలో ఇవి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో తోడ్పడుతుంది.
శక్తినిస్తుంది:
రాజ్మాలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శరీరానికి స్థిరమైన, దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. ఇది రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన శక్తినివ్వడమే కాకుండా.. అలసటను తగ్గిస్తుంది. తక్షణ శక్తి కోసం రాజ్మా తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
Also Read: దగ్గు వెంటనే తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !
రక్తహీనత నివారణ:
రాజ్మాలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం. ఇది శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తాయి. ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను నివారించడంలో రాజ్మా సహాయపడుతుంది. ఐరన్ లోపంతో ఇబ్బంది పడే వారు తరచుగా రాజ్మా తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
ఎముకల ఆరోగ్యం:
రాజ్మాలో మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో అంతే కాకుండా ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.