High Salary No Job Satisfaction| జీవితంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక ప్రణాళిక ముఖ్యం. సంపాదించడం ఎంత ముఖ్యమో ఆదాయాన్ని ఆదా చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇటీవల ప్రభుత్వ రంగ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నఒక యువకుడు మంచి జీతం ఉన్నా అతి తక్కువ ఖర్చులతో అద్భుత జీవినశైలితో కొనసాగవచ్చని చేసిన ఒక సోషల్ మీడయా పోస్ట్ బాగా వైరల్ అవుతోంది.
ఆ ఉద్యోగి తన జీతం, ఖర్చులు, పొదుపు గురించి సోషల్ మీడియాలో వివరించాడు. ఆ పోస్ట్ ప్రకారం.. నెలకు సుమారు రూ.1.3 లక్షల జీతం వస్తుంది. అయితే, అతని నెలవారీ ఖర్చులు సాధారణంగా రూ.15000 లోపే ఉంటాయి. కంపెనీ అందించే పలు సౌకర్యాలు అతని ఖర్చులు భారీగా తగ్గిస్తున్నాయి. అయితే ఆర్థిక భద్రత ఉన్నప్పటికీ, తన ఉద్యోగంలో ఎదుగుదల కనిపించడం లేదని అతను చెప్పాడు.
ఆ ఉద్యోగి ప్రకారం.. అతని వార్షిక మొత్తం వేతన ప్యాకేజీ సుమారు రూ.23 లక్షలు. కంపెనీ అతనికి ఉచిత వసతి సౌకర్యాన్ని అందిస్తోంది. అదనంగా ఇంధనం, విద్యుత్ వంటి ఖర్చులపై భారీ రాయితీలు లభిస్తున్నాయి. పని చేసే ప్రదేశంలో తక్కువ ధరకు భోజనం కూడా అందుబాటులో ఉంటుంది. అతనికి ప్రతి నెలా సుమారు రూ.28 వేల పనితీరు ఆధారిత ప్రోత్సాహకం లభిస్తుంది. అలాగే కంపెనీ అతని జాతీయ పింఛను పథకం ఖాతాలో నెలకు రూ.14 వేలు జమ చేస్తుంది. ఈ సౌకర్యాల కారణంగా అతని పొదుపు గణనీయంగా పెరుగుతోంది. అతని నెలవారీ ఖర్చులను ప్రోత్సాహక మొత్తంతోనే చాలాసార్లు నిర్వహించగలుగుతున్నానని చెప్పాడు.
ప్రస్తుతం అతని ఉద్యోగం మూడో స్థాయి పట్టణం లేదా గ్రామీణ ప్రాంతంలో ఉంది. అతని ప్రకారం.. సమీపంలోని పెద్ద నగరం సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రాంతంలో వినోదం, షాపింగ్, రెస్టారెంట్లు వంటి సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో వారాంతాల్లో ఎక్కువ సమయం ఒంటరిగా లేదా ఖాళీగా గడుస్తుందని అతను చెబుతున్నాడు.
అయితే ఇదే పరిస్థితి అతని ఖర్చులను కూడా నియంత్రిస్తోంది. పెద్ద నగరాల్లో ఉండే ఉద్యోగులతో పోలిస్తే అద్దె, ప్రయాణ ఖర్చు, వినోదంపై అతని ఖర్చులు తక్కువగా ఉంటాయి.
ఏకధాటిగా ఉండే జీవితానికి విరామం ఇవ్వడానికి అతను నెలలో పలుమార్లు ఢిల్లీకి వెళ్తాడు. అక్కడికి వెళ్లినప్పుడు తనకు ఇష్టమైన వస్తువులపై డబ్బు ఖర్చు చేస్తాడు. గ్యాడ్జెట్లు, ఆటలు, ఖరీదైన షూస్, దుస్తుల కోసం అతని ఖర్చులు చేస్తున్నాడు. అతను రెస్టారెంట్లు, వినోదం, ఇతర వ్యక్తిగత అభిరుచులపై కూడా ఖర్చు చేస్తాడు.
Also Read: కేవలం రూ.1,000 పెట్టుబడితో రూ.3.18 లక్షలు రాబడి.. పిల్లల భవిష్యత్తు కోసం PPF సేవింగ్స్
ఆర్థిక భద్రత ఉన్నప్పటికీ, తన ఉద్యోగంలో వ్యక్తిగత ఎదుగుదల లేదని అతను కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలిపాడు. గతంలో పనిచేసిన మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగాన్ని వదిలినందుకు కొంత పశ్చాత్తాపం ఉందని చెప్పాడు. తన స్నేహితులు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నాడు. అయితే తాను మాత్రం ఒకే స్థాయిలో నిలిచిపోయినట్లు భావిస్తున్నానని చెప్పాడు.
ఇప్పటివరకు చేసిన పొదుపుతో భవిష్యత్తు కోసం పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. దేశంలోని టాప్ 20 బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చేయాలని అతను ప్రణాళిక వేస్తున్నాడు. దీనికోసం విద్యా రుణం తీసుకోకుండా తన పొదుపునే ఉపయోగించాలని భావిస్తున్నాడు.
భవిష్యత్తులో మెరుగైన కెరీర్ అవకాశాలు, అలాగే టియర్-1 నగరంలో జీవించాలని కూడా అతని లక్ష్యంగా తెలుస్తోంది.
ఈ ఉద్యోగి కథ యువత ఎదుర్కొనే ముఖ్యమైన కెరీర్ సందిగ్ధతను చూపిస్తోంది. మంచి జీతం, తక్కువ ఖర్చులు ఆర్థికంగా బలంగా నిలబడేందుకు సహాయపడతాయి. అయితే ఉద్యోగంలో ఎదుగుదల, కొత్త విషయాలు నేర్చుకోవడం, వ్యక్తిగత సంతృప్తి కూడా ముఖ్యమే. ప్రస్తుత ఉద్యోగం తనకు ఆర్థిక స్వేచ్ఛ ఇచ్చిందని అతను భావిస్తున్నాడు. ఇప్పుడు అదే పొదుపుతో తన కెరీర్‌కు కొత్త దిశ చూపించాలని ప్రయత్నిస్తున్నాడు.