Cheating Partner:బంధం నిలబడాలంటే నమ్మకం చాలా ముఖ్యం,అది గనుక లేకపోతే ఆ బంధం నిలబడటం చాలా చాలా కష్టం. ముఖ్యంగా భాగస్వామి మోసం చేశాడని లేదా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసిన క్షణం నుంచి జీవితమే తలకిందులైనట్లు అనిపిస్తుంది. అప్పటివరకు ఎంతో ప్రేమగా కనిపించిన వ్యక్తి ఒక్కసారిగా పరాయివాడిలా అనిపిస్తాడు. అలాంటి సమయంలోనే అనిపిస్తుంది “ఇలాంటి వ్యక్తిని క్షమించాలా… లేక జీవితంలో నుంచి పూర్తిగా దూరం చేసుకోవాలా? అని
ప్రతి బంధం ఒకేలా ఉండదు
ఈ ప్రశ్నకు అందరికీ ఒకే ఆన్సర్ ఉండదు. ఎందుకంటే ప్రతి బంధం ఒకేలా ఉండదు కాబట్టి. ప్రతి పరిస్థితి కూడా ఒకేలా ఉండదు. కొందరు ఆక్షణంలో ఏర్పడ్డ బలహీనతలో తప్పు చేస్తారు. ఆ తర్వాత తాము చేసిన తప్పు ఎంత పెద్దదో అర్థం చేసుకుని నిజంగా మారిపోవడానికి ప్రయత్నిస్తారు. మరికొందరు మాత్రం క్షమించారని తెలిసాక అదే తప్పును మళ్లీ మళ్లీ చేస్తుంటారు. అందుకే క్షమించాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే ముందు ఎదుటి వ్యక్తిలో నిజంగా మార్పు వచ్చిందా లేదా అనేది గమనించడం చాలా ముఖ్యం.
చాలామంది క్షమించడం అంటే జరిగినదంతా మర్చిపోవడమని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మనసుకు తగిలిన గాయం అంత ఈజీగా మానిపోదు. నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ నమ్మకాన్ని మాటలతో కాదు… ప్రవర్తనతో సంపాదించుకోవాలి.
also read :ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
పిల్లల కోసం అయినా కలిసి ఉండాలి
కొంతమంది “పిల్లల కోసం అయినా కలిసి ఉండాలి” అంటారు. ఇంకొందరు “సమాజం ఏమంటుందో” అని భయపడతారు. కానీ రోజూ అనుమానాలు, గొడవలు, అవమానాలతో నిండిన ఇంట్లో ఉండటం వల్ల పిల్లలపైనా ప్రభావం పడుతుంది. బయటికి కుటుంబం కలిసి ఉన్నట్టే కనిపించినా… ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఆ బంధంలో ఎవరికి సంతోషం ఉంటుంది చెప్పండి.
క్షమించే ముందు ఒకసారి మీ మనసునే అడగండి. జరిగిన విషయం గుర్తొచ్చిన ప్రతిసారీ అదే బాధ మళ్లీ వస్తుందా? ఎదుటి వ్యక్తిని మళ్లీ నమ్మగలననే నమ్మకం మీకు ఉందా? అతను లేదా ఆమె నిజంగా చేసిన తప్పును ఒప్పుకుని మారడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ ప్రశ్నలకు మీ మనసు చెప్పే సమాధానమే మీకు సరైన దారి చూపిస్తుంది.
ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి
ఇంకో విషయం కూడా మీరిక్కడ గుర్తుంచుకోవాలండోయ్ ..ప్రేమ పేరుతో సెల్ఫ్ రెస్పెక్ట్ ని అస్సల్ వదులుకోవద్దు.ఒక తప్పును క్షమించడం గొప్ప విషయమే. కానీ అదే తప్పు మళ్ళీ మళ్ళీ జరుగుతుంటే భరిస్తూ ఉండడాన్ని ప్రేమ అని మాత్రం అనలేం. అది మన జీవితాన్ని, మనశ్శాంతిని మనమే నాశనం చేసుకోవడమే అవుతుంది.
also read :కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!కొన్నిసార్లు సంబంధాన్ని కాపాడుకోవడానికి ఇద్దరూ కలిసి ప్రయత్నిస్తే మళ్లీ మంచి రోజులు రావచ్చు. కానీ ఆ ప్రయత్నం ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యం కాదు అని గుర్తు పెట్టుకోండి.ఇద్దరికీ ఆ బంధం విలువ తెలిసి ఉండాలి. నిజాయితీగా మాట్లాడుకోవాలి. దాచిపెట్టే విషయాలు ఉండకూడదు. అప్పుడు మాత్రమే పోయిన నమ్మకం మళ్ళీ ఏర్పడే అవకాశం ఉంటుంది.
నమ్మకం మాత్రం సంపాదించుకోవాల్సిందే
చివరికి ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. క్షమించాలా వద్దా అనే నిర్ణయం మీది. మీ జీవితాన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో అదే ముఖ్యం. కోపంలో తీసుకున్న నిర్ణయం కూడా మంచిది కాదు… బాధలో తీసుకున్న నిర్ణయం కూడా మంచిది కాదు. కొంత సమయం తీసుకుని ప్రశాంతంగా ఆలోచించండి. మీ మనసుకు శాంతి ఇచ్చే నిర్ణయమే సరైన నిర్ణయం. ఎందుకంటే ప్రేమ మళ్లీ పుట్టొచ్చు… కానీ నమ్మకం మాత్రం సంపాదించుకోవాల్సిందే.అర్థమయింది కదూ !