Recover after poor sleep| శరీరం, మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండటానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. సరిపడా సమయం నిద్రపోతే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మానసిక స్థితి కూడా మెరుగుపడతాయి. అయితే పని ఒత్తిడి, రాత్రివేళ ఎక్కువసేపు మొబైల్ ఉపయోగించడం లేదా ఇతర కారణాల వల్ల కొన్నిసార్లు నిద్ర సరిగా పట్టకపోవచ్చు.
అలాంటి సమయంలో మరుసటి రోజు అలసట, బద్ధకం, తలనొప్పి, బ్రెయిన్ ఫాగ్, పనిలో ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. అయితే కొన్ని సులభమైన అలవాట్లు పాటిస్తే శరీరం త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.
రాత్రి నిద్ర సరిగా లేకపోతే ఉదయం కొంతసేపు బయట ఎండలో ఉండండి. సహజ సూర్యకాంతి శరీరాన్ని చురుకుగా మారుస్తుంది. అలాగే శరీరంలోని బయోలాజికల్ క్లాక్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. వీలైతే కొద్దిసేపు వాకింగ్ కూడా చేయండి. తాజా గాలి, తేలికపాటి వ్యాయామం అలసటను తగ్గిస్తాయి.
పగటి సమయంలో అవకాశం ఉంటే 20 నుంచి 30 నిమిషాల పాటు కాసేపు నిద్రపోవాలి. దీన్నే పవర్ న్యాప్ అంటారు. ఇలా చేయడం వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. బ్రెయిన్ ఫాగ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువసేపు నిద్రపోవద్దు. ఇలా చేస్తే రాత్రి మళ్లీ సరిగా నిద్ర పట్టదు.
నిద్ర సరిగా లేకపోయినా పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం కంటే తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. యోగా, స్ట్రెచింగ్ లేదా వేగంగా నడక వంటి వ్యాయామాలు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి. అయితే శరీరం బాగా అలసిపోయినట్లు అనిపిస్తే కఠినమైన వ్యాయామాలు చేయకండి.
నిద్ర సరిగా లేకపోతే చాలామంది తరచుగా టీ లేదా కాఫీ తాగుతారు. కానీ అధికంగా కెఫిన్ తీసుకోవడం వల్ల రాత్రి మళ్లీ నిద్ర సమస్యలు రావచ్చు. అందుకే రోజంతా తగినంత నీరు తాగాలి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్, తృణధాన్యాలు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది.
Also Read: డబ్బు ఖర్చు చేయకుండా ఆదివారం స్పెషల్ డేట్.. మీ పార్ట్‌నర్‌తో ఫ్రీగా డేటింగ్ చేసే 6 ఐడియాలు
తదుపరి రోజు రాత్రి సమయానికి పడుకునే ప్రయత్నం చేయండి. నిద్రకు కనీసం గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వాడకాన్ని తగ్గించండి. గదిని ప్రశాంతంగా, చీకటిగా, సౌకర్యంగా ఉంచండి. పుస్తకం చదవడం లేదా మృదువైన సంగీతం వినడం వంటి అలవాట్లు మంచి నిద్రకు సహాయపడతాయి.
ఒక్కోసారి నిద్ర సరిగా పట్టకపోవడం సాధారణమే. కానీ తరచూ ఇదే సమస్య వస్తుంటే నిర్లక్ష్యం చేయకండి. రోజంతా ఎక్కువగా నిద్ర మత్తు ఉండటం, పెద్దగా గురక పెట్టడం లేదా నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వైద్యుడిని సంప్రదించడం అవసరం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించే అలవాట్లు పాటించడం వల్ల మంచి నిద్ర వస్తుంది. మంచి నిద్రతో శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఏకాగ్రత, పనితీరు, ఉత్సాహం కూడా పెరుగుతాయి.