Luxury Bags and Watches: ఒకప్పుడు హీరోయిన్స్ అనగానే డిజైనర్ డ్రెస్సులు, డైమండ్ జ్యువెలరీస్ వంటివే మనకు గుర్తొచ్చేవి.కానీ ఇప్పుడు వాటి స్థానాలను బ్యాగులు, వాచీలు ఆక్రమించేశాయి.అవును… ఈ ఫ్యాషన్ ప్రపంచంలో అసలైన క్రేజ్ ఇప్పుడు వాటికే ఉంది మరి.
ముఖ్యంగా హీరోయిన్స్ ఈవెంట్స్‌కి వెళ్లినా, ఎయిర్‌పోర్ట్‌లో కనిపించినా, ఏ పబ్లిక్ ఫంక్షన్‌లో తలుక్కుమన్నా అభిమానుల చూపు ముందుగా వెళ్లేది వారు వేసుకున్న బ్యాగ్, పెట్టుకున్న వాచీపైనే.ఒక రకంగా ఇవి యాక్సెసరీలు కాదు… స్టేటస్ సింబల్స్.
ఇక ఇప్పటి స్టార్లలో చాలామంది హెర్మెస్, లూయీ విట్టాన్, షానెల్, డియోర్, గుచ్చి, ప్రాడా, ఫెండి, సెలిన్ వంటి అత్యంత ఖరీదైన ఫ్యాషన్ బ్రాండ్లకు రెగ్యులర్ కస్టమర్లే.ఇలా ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లన్నీ వాళ్ల వార్డ్‌రోబ్‌లో కొలువు తీరాల్సిందే.ఇక వీటిల్లో కొన్ని బ్యాగులు రెండు లక్షల నుంచి మొదలైతే, మరికొన్ని ఏకంగా 50 లక్షలు, కోటి వరకు పలకడం గమనార్హం. ఎందుకంటే ఈ లిమిటెడ్ ఎడిషన్ బ్యాగులు ఆ తర్వాత మళ్లీ మార్కెట్‌లో కనిపించవు కదా.
ఇక ఈ బ్రాండ్లలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది హెర్మెస్ బిర్కిన్ బ్యాగ్ గురించి.మీ దగ్గర డబ్బులు ఉంటే ఈ బ్యాగ్‌ని వెంటనే కొనేయొచ్చు అనుకుంటున్నారేమో… అంత ఈజీ కాదండోయ్.ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎంతో మంది సెలబ్రిటీలు కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారే.అందుకే హెర్మెస్ బిర్కిన్ బ్యాగ్ గనుక వేసుకున్నారంటే అదో స్టేటస్ సింబల్, గుర్తింపుగా భావిస్తారు.ఇక చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ ఈ బ్యాగ్‌తోనే కనిపించడంతో దానికి క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.
దీపిక పదుకొణె
ఇక హీరోయిన్లలో దీపిక పదుకొణె విషయానికి వస్తే… ఆమె ఫ్యాషన్ ఐకాన్ అని స్పెషల్‌గా చెప్పక్కర్లేదు.ఇక ఈమె ప్రమోషన్స్, ఫ్యాషన్ ఈవెంట్స్, ఎయిర్‌పోర్ట్… ఇలా ఎక్కడ కనిపించినా లూయీ విట్టాన్, హెర్మెస్, షానెల్, డియోర్ వంటి ప్రముఖ బ్రాండ్ బ్యాగులతోనే దర్శనమిస్తుంది.ఇక లూయీ విట్టాన్‌కు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ కావడంతో ఆ బ్రాండ్‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్స్ కూడా ఆమె వద్ద ఉన్నాయని ఫ్యాషన్ వర్గాల్లో టాక్.ఇక ఆలియా భట్ కూడా ఫ్యాషన్ విషయంలో చాలా సెలెక్ట్‌గా ఉంటుంది.
ఏవి పడితే అవి కాకుండా డిజైనర్ కలెక్షన్స్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.ఇక ఈమె వాడే బ్యాగుల ధర నాలుగు లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా ఉంటుందని ఫ్యాషన్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.
జాన్వీ కపూర్
ఇక జాన్వీ కపూర్ విషయానికి వస్తే… ట్రెండ్ అలా సెట్ అయిందో లేదో ముందుగా ఫాలో అయిపోతుంది భామ.జిమ్‌కి వెళ్లినా, షాపింగ్‌కి వెళ్లినా ఖచ్చితంగా బ్రాండెడ్ బ్యాగ్ చేతిలో ఉండాల్సిందే.ముఖ్యంగా లూయీ విట్టాన్, డియోర్, ప్రాడా, గుచ్చి వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ బ్యాగ్స్ ఆమె కలెక్షన్స్‌లో ఎక్కువగా కనిపిస్తాయి.
సమంత
టాలీవుడ్ స్టార్ సమంత కూడా బాలీవుడ్ భామలకు దీటుగా యాక్సెసరీస్ కోసం లక్షల్లో ఖర్చు పెడుతుండడం గమనార్హం.ఆమె కలెక్షన్స్‌లో గుచ్చి, సెలిన్, డియోర్, లూయీ విట్టాన్ బ్యాగ్‌లతో పాటు ఎన్నో లగ్జరీ వాచీలు కూడా అనేక సందర్భాల్లో మనకు కనిపించాయి.
ఇక రష్మిక మందన్న, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ వంటి టాప్ స్టార్స్ కూడా ప్రముఖ బ్రాండ్ల బ్యాగులనే మోసేవారే.ఇక బ్యాగులతో పాటు చాలా సందర్భాల్లో హీరోయిన్ల చేతికి ఉండే వాచీలు కూడా మీడియాలో ప్రముఖంగా హైలైట్ అవుతుంటాయి.
వీటిల్లో రోలెక్స్, కార్టియర్, ఓమెగా, పటెక్ ఫిలిప్, ఆడెమార్స్ పిగే, రిచర్డ్ మిల్లే వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లు ఎక్కువగా వీళ్ల చేతికి చుట్టుకుని ఉంటాయి.వీటిలో కొన్ని మోడల్స్ ఎనిమిది లక్షల నుంచి మొదలైతే, లిమిటెడ్ ఎడిషన్ డైమండ్ సెట్టింగ్స్ ఉన్నవి ఏకంగా కోటి నుంచి ఐదు కోట్ల వరకు కూడా ఉండటం విశేషం.
ఒక కారణం ఉందండోయ్
అయితే చాలామందికి ఇంత కాస్ట్లీ బ్యాగులు, వాచీలు ఎందుకు అనే ప్రశ్న రైజ్ అవుతుంది.అయితే వీటికి ఒక కారణం ఉందండోయ్.మొదటి కారణం బ్రాండ్ ఇమేజ్.ఒక స్టార్ ఎలాంటి బ్రాండ్ వాడుతుంది అనేది అభిమానులు గమనిస్తారు. సెలబ్రిటీలు పబ్లిక్‌లో ఉన్నప్పుడు వారు ఎలాంటి యాక్సెసరీస్ వాడుతున్నారు అనే విషయంపై కూడా చాలామంది ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు.
మరో కారణం పెట్టుబడి.పటెక్ ఫిలిప్ లేదా రోలెక్స్ వంటి కొన్ని లిమిటెడ్ ఎడిషన్ వాచీలు రోజులు గడిచే కొద్దీ మరింత విలువ పెరిగిపోతుంది.కొన్ని లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్‌ను వేలం వేస్తే వాటి అసలు ధర కంటే ఎన్నో రెట్లు ఎక్కువకు అమ్ముడైన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ ముద్దుగుమ్మలను చూసి కళ్లు తేలేయాల్సిందే
ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే… చాలామంది హీరోయిన్లు వాచీలు కొనడమే కాదు, కొన్ని బ్రాండ్లు ప్రమోషనల్ క్యాంపెయిన్స్‌లో భాగంగా వాటిని బహుమతిగా కూడా ఇస్తుంటాయి.ఏది ఏమైనా… మనుషులకే లక్షల్లో ఖర్చు పెట్టాలంటే ఆలోచించే ఈ రోజుల్లో కేవలం బ్యాగులు, వాచీలకే లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఈ ముద్దుగుమ్మలను చూసి కళ్లు తేలేయాల్సిందే.