Poor Kidney Function: కిడ్నీలు శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. అవి రక్తాన్ని శుభ్రం చేయడం, వ్యర్థ పదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడంతో పాటు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. అయితే.. కిడ్నీల పనితీరు నెమ్మదిగా క్షీణిస్తున్నప్పుడు, ప్రారంభ దశలో ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే కిడ్నీ వ్యాధులను “సైలెంట్ కిల్లర్” అని అంటారు. కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు కనిపించే కొన్ని నిశ్శబ్ద లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అలసట, నీరసం:
కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు.. శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. దీని వల్ల రక్తంలో విషపదార్థాల స్థాయి పెరిగి, నిరంతరం అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. అలాగే, కిడ్నీలు ఎరిత్రోపోయిటిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేయలేవు. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం. తక్కువ ఎర్ర రక్త కణాలు ఉండటం వల్ల రక్తహీనత ఏర్పడి.. శక్తి స్థాయిలు తగ్గిపోతాయి.
2. నిద్రలేమి:
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు తరచుగా నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటారు. శరీరంలో కొన్ని రకాల వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం వల్ల నిద్ర సరిగా పట్టదు. అదనంగా.. కాలు, కాలి మడమల వాపు, తరచుగా మూత్ర విసర్జన కూడా నిద్రకు భంగం కలిగిస్తాయి.
3. పొడి చర్మం, దురద:
ఆరోగ్యకరమైన కిడ్నీలు శరీరంలో పోషక సమతుల్యతను కాపాడుతాయి. కిడ్నీలు పనిచేయడం మానేసినప్పుడు.. రక్తంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి.. చర్మం పొడిగా మారడం, దురద రావడం వంటి సమస్యలు వస్తాయి. ఇది రక్తంలో ఫాస్ఫరస్ స్థాయిలు పెరగడం వల్ల కూడా సంభవించవచ్చు.
4. తరచుగా మూత్ర విసర్జన:
కిడ్నీల ఫిల్టరింగ్ సామర్థ్యం తగ్గినప్పుడు.. మూత్ర విసర్జన ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా రాత్రిపూట ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే.. మూత్రంలో రక్తం లేదా నురుగు కనిపించడం కూడా కిడ్నీ సమస్యలకు ఒక సూచన. మూత్రంలో నురుగు ప్రోటీన్ లీకేజ్ వల్ల వస్తుంది, ఇది కిడ్నీ దెబ్బతిన్నట్లు సంకేతం.
5. కంటి చుట్టూ వాపు, కాళ్లు, చేతులు వాపు:
కిడ్నీలు శరీరంలో అదనపు ద్రవాలను తొలగించడంలో విఫలమైనప్పుడు.. ఆ ద్రవాలు శరీరంలోని కణజాలాలలో పేరుకుపోతాయి. దీనివల్ల కళ్ల చుట్టూ, కాళ్లు, చేతులు, కాలి మడమలు వాపుకు గురవుతాయి. ఈ లక్షణాన్ని ఎడెమా అని పిలుస్తారు. ఇది కిడ్నీ వ్యాధి తీవ్రతను సూచిస్తుంది.
Also Read: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?
6. ఆకలి లేకపోవడం, వాంతులు:
కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో ఆకలి లేకపోవడం, తరచుగా వికారం లేదా వాంతులు అవుతుంటాయి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు ఈ లక్షణాలకు కారణమవుతాయి. ఈ లక్షణాలు ఇతర వ్యాధులలో కూడా కనిపించినప్పటికీ.. కిడ్నీ సమస్యలకు ఇది ఒక ముఖ్యమైన సంకేతం.
ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. సరైన సమయంలో చికిత్స పొందడం ద్వారా కిడ్నీ వ్యాధిని నియంత్రించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం వంటివి కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.