Skincare Routine: చర్మ సంరక్షణ అనేది కేవలం అందం కోసం మాత్రమే కాదు.. ఇది మన చర్మ ఆరోగ్యం కోసం కూడా చాలా ముఖ్యం. బిగినర్స్‌కి స్కిన్‌కేర్ రొటీన్ అనేది కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు. కానీ సరైన ఆర్డర్‌లో ఫేస్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అంతే కాకుండా ముఖం కూడా అందంగా మెరిసిపోతుంది. మరి బిగినర్స్ కోసం సింపుల్ స్కిన్‌కేర్ రొటీన్ , దాని ప్రయోజనాలను గురించిన పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. క్లెన్సింగ్ (శుభ్రపరచడం):
(ఉదయం, సాయంత్రం)
మీ స్కిన్‌కేర్ రొటీన్‌లో మొదటి, ముఖ్యమైన అడుగు క్లెన్సింగ్. రాత్రిపూట మీ చర్మంపై పేరుకుపోయిన నూనెలు, మలినాలను తొలగించడానికి ఉదయం క్లెన్స్ చేయాలి. అలాగే.. పగటిపూట పేరుకుపోయిన దుమ్ము, మేకప్, నూనెలను తొలగించడానికి సాయంత్రం క్లెన్స్ చేయడం తప్పనిసరి. మీ చర్మ రకానికి (జిడ్డు చర్మం, పొడి చర్మం, కాంబినేషన్ స్కిన్) సరిపోయే మైల్డ్ క్లెన్సర్ (సబ్బు లేనిది) ఉపయోగించండి. మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో తడిపి.. కొద్దిగా క్లెన్సర్‌ను తీసుకుని వృత్తాకారంగా మసాజ్ చేసి, శుభ్రమైన నీటితో వాష్ చేయండి.
2. టోనింగ్ (Tone చేయడం):
ఉదయం, సాయంత్రం (క్లెన్సింగ్ తర్వాత).
క్లెన్సింగ్ తర్వాత టోనర్ ఉపయోగించడం వల్ల మీ చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఇది పోర్స్‌లోని మిగిలిన మలినాలను తొలగించి.. తర్వాత వాడే ప్రొడక్ట్స్ చర్మంలోకి బాగా ఇంకడానికి సహాయపడుతుంది. ఆల్కహాల్ లేని.. తేలికపాటి టోనర్‌ను ఎంచుకోండి. కాటన్ ప్యాడ్‌పై కొన్ని చుక్కల టోనర్‌ను వేసి.. ముఖంపై మెల్లగా అప్లై చేయండి. లేదా స్ప్రే బాటిల్ ద్వారా నేరుగా ముఖంపై స్ప్రే చేసి ఆరనివ్వండి.
3. సీరమ్ (Serum):
ఉదయం, సాయంత్రం (టోనింగ్ తర్వాత).
సీరమ్ అనేది నిర్దిష్ట చర్మ సమస్యలను (మచ్చలు, ముడతలు, పొడిబారడం వంటివి) లక్ష్యంగా చేసుకుని తయారు చేయబడుతుంది. బిగినర్స్ విటమిన్ సి సీరమ్ (ప్రకాశవంతమైన చర్మం కోసం), హైలురోనిక్ యాసిడ్ సీరమ్ (తేమ కోసం) వంటి వాటితో ప్రారంభించవచ్చు. కొన్ని చుక్కల సీరమ్‌ను అరచేతిలో వేసుకుని.. ముఖంపై, మెడపై మెల్లగా అప్లై చేసి.. చర్మంలోకి ఇంకే వరకు ఆగండి.
4. మాయిశ్చరైజింగ్ (తేమను అందించడం):
ఉదయం, సాయంత్రం (సీరమ్ తర్వాత):
మాయిశ్చరైజింగ్ అనేది ప్రతి స్కిన్‌కేర్ రొటీన్‌లో ఒక కీలకమైన అడుగు. ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచి.. పొడిబారకుండా కాపాడుతుంది. మీ చర్మ రకానికి సరిపోయే మాయిశ్చరైజర్‌ను ఎంచుకోండి. జిడ్డు చర్మం ఉన్నవారు జెల్-బేస్డ్ లేదా ఆయిల్-ఫ్రీ మాయిశ్చరైజర్లను ఎంచుకోవచ్చు. పొడి చర్మం ఉన్నవారు క్రీమ్-బేస్డ్ మాయిశ్చరైజర్లను ఉపయోగించవచ్చు. తగినంత మాయిశ్చరైజర్‌ను తీసుకుని.. మీ ముఖం, మెడపై సమానంగా అప్లై చేయండి.
Also Read: బెస్ట్ ఆయిల్, ఇది వాడితే.. జన్మలో జుట్టు రాలదు
5. సన్‌స్క్రీన్ (Sunscreen):
ఉదయం (బయటకు వెళ్లే ముందు).
సన్‌స్క్రీన్ అనేది కేవలం వేసవికాలంలో మాత్రమే కాదు.. ఏడాది పొడవునా ప్రతిరోజు ఉపయోగించాల్సిన అత్యంత ముఖ్యమైన క్రీమ్. ఇది మీ చర్మాన్ని సూర్యరశ్మిలోని హానికరమైన UV కిరణాల నుండి కాపాడుతుంది. తద్వారా చర్మ క్యాన్సర్, వృద్ధాప్య లక్షణాలు, సన్‌బర్న్ వంటి సమస్యలను నివారిస్తుంది. కనీసం SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ను ఎంచుకుని, బయటకు వెళ్ళడానికి 15-20 నిమిషాల ముందు ముఖం, మెడ ,సూర్యరశ్మికి గురయ్యే అన్ని ప్రాంతాలపై అప్లై చేయండి.
మరిన్ని చిట్కాలు:
కొత్త ప్రొడక్ట్స్ ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి.
మీ చర్మంపై క్రీములను రుద్దకూడదు. మెల్లగా అప్లై చేయండి.
చర్మం గురించి ఏదైనా తీవ్రమైన సమస్యలు ఉంటే డెర్మటాజిస్టును సంప్రదించండి.