సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లోని అతి పెద్ద పండుగల్లో ఒకటి. జనవరి వచ్చిందంటే నగరాలన్నీ మూడు రోజులు పాటు ఖాళీ అయిపోతాయి. ప్రజలంతా గ్రామాలకు తరలి వెళ్తారు. గ్రామాలు, బంధుమిత్రులతో రంగవల్లికలతో గాలిపటాలతో కళకళలాడుతూ ఉంటాయి. అందరికీ సంక్రాంతి పండుగ అంటే ఎంతో ఇష్టం కానీ సంక్రాంతి నాడు ఏ దేవుడిని పూజించాలో మాత్రం తక్కువ మందికే తెలుసు.
సంక్రాంతి రైతుల పండుగ. రైతుల చేతికి పంట వచ్చిన సందర్భంగా ఆర్భాటంగా చేసే వేడుక. కాలచక్రానికి అధిపతి అయిన సూర్యుడు సంక్రాంతి నాడు పూజలు అందుకుంటాడు. కాలచక్రం సూర్యుడే ఆధీనంలోనే ఉంటుంది. దక్షిణాయనంలో ఉన్న సూర్యుడు సంక్రాంతి రోజే ఉత్తరాయణంలోకి వెళతాడు. ఇది పుణ్యకాలం. ఇదే సమయానికి పంట కూడా చేతికి వచ్చేస్తుంది. అందుకే సంక్రాంతినాడు సూర్యరాధన ఎంతో ముఖ్యం. సూర్యుణ్ణి ఆరాధించడమే కాదు వర్షాలు కురిపించిన ఇంద్రుడిని, పంటను ఇచ్చిన నేల తల్లిని కూడా పూజించాలి. అందుకే నేలపై అందమైన రంగవల్లికలు వేసి గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమల జల్లి పూజలా చేస్తారు.
సంక్రాంతి పండుగ మొదటి రోజు భోగి.ఆ రోజే కొత్త బియ్యంతో బెల్లం, ఆవు పాలు కలిపి పొంగలి వండుతారు. ఆ పొంగలినే సూర్య భగవానుడికి నివేదిస్తారు. భోగి రోజు సాయంత్రమే సూర్యాస్తమయానికి ముందు ఇంట్లోని చిన్నపిల్లలకు భోగి పండ్లను పోసి ఆశీర్వదిస్తారు. భోగి పండ్లు అంటే చలికాలంలోనే దొరికే రేగు పండ్లు. సంస్కృతంలో దీన్ని బదరీ ఫలము అని పిలుస్తారు. రేగుపండు ఎంతో ప్రత్యేకమైనది. పిల్లలపై ఈ రేగు పండ్లను పోయడం ద్వారా సూర్యుడి శక్తి వారిలోకి చేరుతుందని నమ్ముతారు. రేగుపండుకు సూర్యుడు కాంతిని తనలో నింపుకునే శక్తి ఉందని చెప్పుకుంటారు.
భోగి పండుగ మర్నాడు అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి ఈరోజే. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే మకర సంక్రాంతిగా మారింది. అంటే ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభమైనట్టే. ఈ ఒక్కరోజు మీరు చేసే దానధర్మాలు ఏడాదంతా ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు మీరు గుమ్మడికాయ దానం చేస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారట. అలాగే నువ్వులను తినడం వల్ల ఏడాదంతా ఆరోగ్యము, ఆయుష్షు కూడా కలుగుతుంది. తెల్ల నువ్వులతో చేసిన స్వీట్లను కచ్చితంగా మకర సంక్రాంతి రోజు తినేందుకు ప్రయత్నించండి.