Aloo tikki: బంగాళదుంపలతో చేసే వంటకాలకు పిల్లలు, పెద్దలు కూడా ఫ్యాన్స్. ఇక్కడ మేము ఆలూ టిక్కీ రెసిపీ ఇచ్చాము. దీన్ని చేయడం చాలా సులువు. క్రిస్పీగా ఉండే ఈ ఆలూ టిక్కీని సాయంత్రం పూట పిల్లలకు ఇస్తే వారు ఇష్టంగా తింటారు. దీన్ని చేయడానికి మీకు ఎక్కువ సమయం కూడా పట్టదు. కాబట్టి ఈ ఆలూ టిక్కి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
ఆలూ టిక్కీ రెసిపీకి కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు – నాలుగు
బియ్యప్పిండి – అరకప్పు
పుదీనా తరుగు – రెండు స్పూన్లు
చిల్లీ ఫ్లేక్స్ – రెండు స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు – రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
చాట్ మసాలా – ఒక స్పూను
గరం మసాలా – అర స్పూను
నిమ్మరసం – ఒక స్పూను
నూనె – తగినంత
ఆలూ టిక్కీ రెసిపీ
1. ఆలూ టిక్కి రెసిపీ చేసేందుకు ముందుగా బంగాళదుంపలను మెత్తగా ఉడికించుకోవాలి.
2. పైన పొట్టు తీసి ఒక గిన్నెలో వేసి చేత్తోనే మెత్తగా మెదుపుకోవాలి.
3. అందులోనే బియ్యప్పిండిని కూడా వేసి బాగా కలపాలి.
4. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి.
5. పుదీనా తరుగు, చిల్లి ఫ్లెక్స్, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, చాట్ మసాలా, గరం మసాలా, నిమ్మరసం వేసి ఆ మొత్తం మిశ్రమాన్ని గట్టిగా కలుపుకోవాలి.
6. ఆ మిశ్రమాన్ని పది లడ్డూల్లా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
8. ఈ బంగాళదుంప లడ్డూలను చేత్తోనే టిక్కీ లాగా వత్తుకొని ఆ నూనెలో రెండు వైపులా వేయించుకోవాలి.
9. వాటి రంగు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
10. నూనె ఎక్కువగా పీల్చేశాయి అనుకుంటే టిష్యూ పేపర్ పై పెట్టి అదనపు నూనెను తీసేయవచ్చు.
11. అంతే టేస్టీ ఆలూ టిక్కి రెడీ అయినట్టే.
12. దీన్ని పుదీనా చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే మీకు ఇంకా తినాలనిపిస్తుంది.
ఆలూ టిక్కీ రెసిపీ చాలా సులువు. ఎవరైనా ఇట్టే దీన్ని చేసేయవచ్చు. ముఖ్యంగా బంగాళదుంపలతో చేసే రెసిపీలు పిల్లలకు, పెద్దలకు కూడా బాగా నచ్చుతాయి. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో ఆలూ టిక్కీ చేసి చూడండి. మీకు సులువుగా అనిపించడంతోపాటు పిల్లలకు టేస్టీగా అనిపిస్తుంది. బంగాళదుంపలతో చేసే వంటకాలు ఇష్టపడేవారు ఎక్కువగా పిల్లలే. బంగాళదుంపలు ఈనాటివి కాదు. గతవేల ఏళ్లుగా మన ఆహారంలో భాగంగా ఉన్నాయి. పెరూలో వీటిని తొలిసారిగా పండించారని చెప్పుకుంటారు. అక్కడి నుంచి అన్ని దేశాలకు ఇవి ప్రయాణం అయ్యాయని అంటారు.
Also Read: టేస్టీగా కాలీఫ్లవర్ పరాటా ఇలా చేసేయండి, చికెన్ కర్రీతో తింటే రుచి అదిరిపోతుంది
బంగాళదుంపల గురించి ఒక ఆసక్తికరమైన వార్త కూడా ఉంది. అంతరిక్షంలో పండించిన మొట్టమొదటి ఆహారం బంగాళదుంపలే. మనదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ బంగాళదుంపలను పండిస్తున్నారు. ఉల్లిపాయల తర్వాత బంగాళదుంపలనే అధికంగా వాడుతున్నారు. కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక శాతం మంది తింటున్న ఆహారంలో బంగాళదుంపలు ఒకటి. ఇవే లేకపోతే ఎంతో మంది ప్రజలు పస్తులతో పడుకునే వారని చెబుతారు. అయితే మధుమేహం ఉన్నవారు మాత్రం బంగాళదుంపలను చాలా తక్కువగా తినాలి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా బంగాళదుంపలను తక్కువగా తినాలి. బరువు పెరిగే అవకాశం ఉంది.