Happy Teachers Day 2025: ప్రతి మనిషి జీవితంలో తల్లిదండ్రులు ఎంతటి ప్రాధాన్యం కలిగి ఉంటారో, అంతే ప్రాధాన్యం గురువులకు ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి మనకు అక్షరాలు నేర్పే వరకు తల్లిదండ్రులు గురువుల్లాగే ఉంటారు. కానీ పాఠశాలలో అడుగు పెట్టిన తర్వాత మనకు విద్యాబోధ చేసే అసలైన గురువు మన జీవితానికి మార్గదర్శకుడు అవుతాడు. అందుకే గురువు స్థానం మన సంస్కృతిలో ఎంతో ఉన్నతమైనది. భారతీయ సంప్రదాయంలో “గురు బ్రహ్మా, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః” అని చెప్పినట్లు, గురువు అంటే సృష్టికర్త, పరిరక్షకుడు, మార్గదర్శకుడు అని భావిస్తారు. నిజానికి ఒక గురువు లేకుండా ఎవరూ సరైన దిశలో ముందుకు సాగలేరు. విద్యని మాత్రమే కాదు, విలువలను, జీవన విధానాన్ని కూడా గురువు నేర్పిస్తాడు.
టీచర్స్‌డే ఎప్పుడు జరుపుకుంటామో తెలుసుకుందాం
భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న టీచర్స్‌డేను జరుపుకుంటారు. ఈ రోజునే మన దేశపు రెండవ రాష్ట్రపతి, గొప్ప గురువు అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం. 1902 సెప్టెంబర్ 5న జన్మించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తన జీవితం మొత్తాన్ని విద్యారంగానికే అంకితం చేశారు. తత్వశాస్త్రం (Philosophy)లో ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు తెచ్చుకున్న ఆయన, గొప్ప ఉపాధ్యాయుడిగా, ఆచార్యుడిగా అనేక తరాలకు ప్రేరణగా నిలిచారు.
ఉపాధ్యాయుడిగా పనిచేసిన రోజులలో తన విద్యార్థుల నుండి పొందిన గౌరవం, ఆప్యాయత ఆయనకు మరపురానిది. 1962లో భారతదేశ రెండవ రాష్ట్రపతిగా పదవి చేపట్టిన తర్వాత, ఆయన విద్యార్థులు ఆయన పుట్టినరోజును వేడుకగా జరుపుకోవాలనుకున్నారు. అప్పుడు రాధాకృష్ణన్, నా పుట్టినరోజును ప్రత్యేకంగా జరపడం కన్నా, దానిని ఉపాధ్యాయుల దినోత్సవంగా పాటిస్తే నాకు నిజమైన గౌరవం దక్కుతుందని చెప్పారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5ను టీచర్స్ డేగా జరుపుకోవడం ప్రారంభమైంది.
Also Read: Huawei Mate XTs: 10.2 అంగుళాల భారీ స్క్రీన్.. అద్భుత కెమెరాలతో ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ లాంచ్
మన జీవితంలో పాఠం చెప్పిన ప్రతి ఒక్కరూ గురువులే
ఈ రోజు ప్రతి పాఠశాలలో, కళాశాలలో, విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుల దినోత్సవం ప్రత్యేకంగా జరుపుకుంటారు. విద్యార్థులు తమ గురువులను సత్కరించి, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వేడుకలన్నీ గురువు పట్ల మన కృతజ్ఞతను తెలియజేసే ప్రయత్నం. గురువు అంటే కేవలం పాఠశాల ఉపాధ్యాయుడు మాత్రమే కాదు. మన జీవితంలో పాఠం చెప్పిన ప్రతి ఒక్కరూ గురువులే. చదువు నేర్పిన వారితో పాటు, విలువలు నేర్పిన తల్లిదండ్రులు, క్రమశిక్షణ నేర్పిన పెద్దలు, అనుభవం నేర్పిన స్నేహితులు కూడా మనకు గురువులే. అందుకే ఈ రోజు వారందరిని గుర్తు చేసుకునే రోజు.
మహనీయులు విద్యార్థులకు మార్గదర్శకులు
ఇప్పటికీ మనం అనేక మంది గొప్ప గురువులను స్మరించుకుంటాం. ప్రాచీన కాలంలో చాణక్యుడు, ఆధునిక కాలంలో ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహనీయులు విద్యార్థులకు మార్గదర్శకులయ్యారు. వారు చెప్పిన ప్రతి మాట విద్యార్థుల జీవితానికి కొత్త దిశ చూపించింది. ఒక గురువు చెప్పిన మాట ఒక విద్యార్థి భవిష్యత్తును మలుపుతిప్పగలదు.
టీచర్స్‌డే అంటే కేవలం పూల బొకేలు, బహుమతులు ఇవ్వడం మాత్రమే కాదు. నిజమైన గౌరవం అంటే గురువు చెప్పిన బాటలో నడవడం, ఆయన బోధించిన పాఠాలను మన జీవితంలో ఆచరించడం. మనం ఎక్కడ ఉన్నా, ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా, గురువును ఎప్పుడూ మరచిపోకూడదు. టీచర్స్‌డే అనేది ఒక రోజు మాత్రమే కాదు, అది మనకు ప్రతి రోజు గుర్తు చేస్తుంది. మన వెనుక నిలబడి, మనను ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరు గురువుతో సమానం.. అందుకే ప్రతి ఒక్కరికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు .