శీతాకాలం వచ్చిందంటే ఆరోగ్యంలో ఎన్నో మార్పులు వస్తాయి. శరీరం కోసం కొన్ని ప్రత్యేక ఆహారాలను తీసుకోవాలి. అలాంటి వాటిలో పోషకాలతో లడ్డూలు కూడా కొన్ని ఉన్నాయి. తీపి తినాలని మీ కోరికను తీరుస్తూనే, ఇది శరీరానికి వెచ్చదనాన్ని శక్తిని కూడా అందిస్తుంది. శీతాకాలంలో ఈ ప్రత్యేక లడ్డూలను మీ ఇంట్లో రెడీగా చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ లడ్డూలు ఏంటో తెలుసుకోండి.
డ్రై ఫ్రూట్ లడ్డూ
జీడిపప్పులు, ఖర్జూరాలు, బాదంపప్పులు, వాల్నట్స్, పిస్తాలు వంటివి వేసి చేసే లడ్డూ ఇది. ఇందులో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు నిండుగా ఉంటాయి. ఇవి అధిక శక్తి విలువలను కలిగి ఉంటాయి. ఖర్జూరాలను మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, పిస్తాలను వేయించి వాటిని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఖర్జూరంలో ఈ మొత్తం పప్పులను వేసి ఒక స్పూను నెయ్యి కూడా వేసి చేతితోనే బాగా కలుపుకోవాలి. ఖర్జూరానికి ఉండే అతుక్కునే స్వభావంతోనే ఈ నట్స్ అన్నీ ఒకదానికొకటి గట్టిగా అతుక్కుని లడ్డూల్లాగా అవుతాయి. మీరు చేత్తోనే వీటిని లడ్డూల్లా చుట్టి పక్కన పెట్టుకోవాలి. దీనిలో ప్రత్యేకంగా పంచదార, బెల్లం వంటివి వేయాల్సిన అవసరం లేదు. ఖర్జూరాల్లో ఉండే తీపి సరిపోతుంది.
సజ్జల లడ్డు
సజ్జలు ఒకప్పుడు అధికంగా తినేవారు. ఇప్పుడు వీటిని తినే వారి సంఖ్య తగ్గిపోయింది. సజ్జల లడ్డూలు మనకి వెచ్చదనాన్ని అందిస్తాయి. పోషకాలను కూడా ఇస్తాయి. చలికాలంలో రోజుకొక సజ్జల లడ్డు తినడం చాలా ముఖ్యం. నెయ్యిలో సజ్జల పిండిని సువాసన వచ్చేవరకు చిన్న మంట మీద వేయించుకోవాలి. తర్వాత అందులో తురిమిన బెల్లం, సోంపు గింజలు, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. సోంపు గింజలను పొడి చేసి వేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ మొత్తాన్ని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే టేస్టీ సజ్జల లడ్డు రెడీ అయినట్టే.
గోండు లడ్డు
మనదేశంలో చాలా చోట్ల గోండు లడ్డూలను ఇష్టంగా తింటారు. దీన్ని గోండు కటీరా అని పిలిచే ఒక జిగురు లాంటి పదార్థం. దీన్ని గోధుమ బంక అని కూడా అంటారు. ఇదొక ఆయుర్వేద ఔషధం. శీతాకాలపు స్వీట్లుగా గోండు లడ్డూను ఎక్కువమంది తింటూ ఉంటారు. నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో గోధుమపిండిని వేయించి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి. అందులోని పంచదార పొడి, తురిమిన డ్రైనట్స్, యాలకుల పొడి, నెయ్యి అన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు శరీరానికి శక్తిని అందిస్తాయి.
నువ్వుల లడ్డు
నువ్వుల్లో కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి శీతాకాలంలో కచ్చితంగా తినాల్సిన స్వీట్లలో నువ్వులు లడ్డు ఒకటి. నువ్వులను కళాయిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో బెల్లము, నీళ్లు వేసి పాకంలో వచ్చే వరకు మరిగించుకోవాలి. అందులోనే నువ్వులను వేసి బాగా కలుపుకోవాలి. చల్లారాక లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే టేస్టీ నువ్వుల లడ్డు రెడీ అయినట్టే.
Also Read: సొరకాయ హల్వా ఇలా చేశారంటే దాని రుచి జీవితంలో మర్చిపోరు, రెసిపీ చాలా సులువు
బేసన్ లడ్డు
శనగపిండితో చేసే లడ్డు ఇది. ఇది మంచి క్లాసిక్ డిజర్ట్. పూర్వకాలం నుంచి దీన్ని అధికంగా తింటూనే ఉన్నారు. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేసి అందులో శెనగపిండిని వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అందులోనే పంచదార పొడి, యాలకుల పొడి వేసి కూడా బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం చల్లారాక లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇవి పిల్లలకు కూడా ఎంతో నచ్చుతాయి.