Diabetes: డయాబెటిస్ ఇప్పుడు ఎక్కువ మందిని ప్రభావితం చేస్తున్న సమస్య. డయాబెటిస్ బారిన పడినవారు కచ్చితంగా కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి నట్స్. నట్స్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో ఏవి తినాలో తెలుసుకోండి. ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
మధుమేహాన్ని నిర్వహించడం లేదా అదుపులో ఉంచడమంటే అర్థం… రక్త ప్రవాహంలో చక్కెర ఎక్కువగా విడుదల కాకుండా చూసుకోవడం. ఆకస్మిక షుగర్ పెరగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. మనం తినే ఆహారమే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగాలా తగ్గాలా అనేది నిర్ణయిస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలను తినమని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని రకాల విత్తనాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటాయి. ఇవి తినడం వల్ల డయాబెటిక్ రోగులకు ఎంతో మేలు జరుగుతుంది.
చియా విత్తనాలు
చియా సీడ్స్ బరువును తగ్గిస్తాయి. అలాగే మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. వీటిలో ఒమేగా త్రీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫైబర్ ప్రోటీన్లతో నిండి ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ డైట్ కు ఇవి అద్భుతమైన ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. చియా సీడ్స్ లో కార్బోహైడ్రేట్లు నిండుగా ఉంటాయి. ఇవి జీర్ణ క్రియను నెమ్మదిగా జరిగేలా చేస్తాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా విడుదల కావు. అలాగే వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. చియా సీడ్స్ ను పెరుగులో వేసి కలుపుకొని తింటే ఎంతో మంచిది. లేదా నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లను తాగిన ఆరోగ్యకరమే.
అవిసె గింజలు
అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మధుమేహాన్ని నిర్వహించడానికి శక్తివంతమైన నట్స్ ఇవి. ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, లిగ్నల్స్ వంటివన్నీ ఇందులో ఉంటాయి. ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరిచే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అవిసె గింజల్లో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. రక్త ప్రవాహంలో చక్కెర శోషణను తగ్గించేలా చేయడంలో ఇది ముందు ఉంటుంది. మధుమేహం అదుపులో ఉంచాలనుకునే వారు అవిసె గింజలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
గుమ్మడి గింజలు
గుమ్మడి గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీనిలో అధిక మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది మెరుగుపరుస్తుంది. గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెకు రక్షణ కల్పిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ముందుంటాయి. కాబట్టి గుమ్మడికాయ గింజలను ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తింటే ఎంతో మంచిది.
నువ్వులు
నువ్వులు మార్కెట్లో అధికంగానే లభిస్తాయి. రోజూ గుప్పెడు నువ్వులు తినండి చాలు. మీకున్న ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు నువ్వులు చేసే మేలు ఇంతా అంతా కాదు. ఫైబర్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. నువ్వులు రక్తంలో గ్లూకోజ్ ను అదుపులో ఉంచేందుకు ముందుంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందించి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. నువ్వులు ఆహారంలో భాగం చేసుకోవాలంటే దాన్ని పచ్చడిగా లేదా నువ్వుల లడ్డూల్లా, కూరల్లో కలుపుకున్నా మంచిదే.
Also Read: జీడిపప్పులు ఇష్టమని ఎక్కువగా లాగిస్తున్నారా? జాగ్రత్త, ఈ సమస్యలన్నీ వచ్చి పడతాయి
సన్ ఫ్లవర్ సీడ్స్
మార్కెట్లో సన్ ఫ్లవర్ సీడ్స్ తక్కువ ధరకే లభిస్తాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిలో అధిక ఫైబర్, విటమిన్ ఈ, మెగ్నీషియం ఉంటాయి. ఇవి గ్లూకోజ్ ను నెమ్మదిగా, స్థిరంగా విడుదల చేయడానికి సహాయపడతాయి. ఈ విత్తనాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మధుమేహం సమస్యను గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ కొన్ని పొద్దు తిరుగుడు విత్తనాలు తినేందుకు ప్రయత్నించండి.