Hair Oil: మీ అమ్మమ్మలను హెయిర్ కేర్ టిప్స్ అడిగితే ఒకటి మాత్రం కచ్చితంగా చెబుతారు. జుట్టుకు తప్పకుండా నూనె రాసుకోమని సలహా ఇస్తారు. జుట్టుకు నూనె రాసుకోవడం అనేది సాంప్రదాయ భారతీయ జుట్టు సంరక్షణ దినచర్యలో అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటి. నూనెను అప్లై చేయడం వల్ల జుట్టు మూలాలకు పోషణ లభిస్తుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా చేయడంతో పాటు మెరిసేలా చేస్తుంది. అన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు నూనెను ఉపయోగించడం హానికరం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని రకాల సమస్యలు ఉన్న వారు జుట్టు నూనెలు అప్లై చేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ . మరి ఏఏ సమస్యలు ఉన్న వారు హెయిర్ ఆయిల్ ఎక్కువగా వాడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ జుట్టులో చుండ్రు ఉన్నట్లయితే:
చుండ్రు సమస్య ఉంటే ఎక్కువగా ఉంటే మీరు మీ జుట్టుకు నూనె ఎక్కువగా రాయకూడదు. ఇలా చేయడం వల్ల జుట్టులో చుండ్రు సమస్య మరింత పెరుగుతుంది. నిజానికి చుండ్రు ఉన్న కూడా తలకు నూనె రాసుకుంటే చుండ్రు జుట్టుకు, తలకు పొట్టులా అంటుకోవడం మొదలవుతుంది. దీని కారణంగా, జుట్టులో దురద, దద్దుర్లు , మంట సమస్య కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మొదట చుండ్రును యాంటీ-డాండ్రఫ్ షాంపూ, హోం రెమెడీస్ వాడి తగ్గించుకోండి. ఆ తర్వాత మాత్రమే నూనెను రాయండి.
మొటిమల విషయంలో కూడా నూనె రాసుకోవడం మానుకోండి:
నిపుణుల అభిప్రాయం ప్రకారం మీకు మొటిమల సమస్య ఉంటే అటువంటి పరిస్థితిలో కూడా మీరు నూనెను ఎక్కువగా అప్లై చేయకూడదు. ముఖ్యంగా మీ నుదిటి చుట్టూ లేదా జుట్టు చుట్టూ మొటిమలు లేదా కురుపులు ఉంటే, అప్పుడు నూనెను అస్సలు అప్లై చేయవద్దు. ఇలా చేయడం వల్ల ఈ మొటిమలలో నూనె పేరుకుపోయి పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇదే కాకుండా ఈ పరిస్థితిలో జుట్టును శుభ్రంగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.
ఆయిల్ స్కాల్ప్ ఉన్నవారు కూడా నూనెకు దూరంగా ఉండాలి:
మీ స్కాల్ప్ చాలా జిడ్డుగా ఉంటే మీరు నూనె అప్లై చేయడం మానుకోవాలి. నిజానికి ఆయిలీ స్కాల్ప్ ఉన్నవారిలో సహజంగానే తలపైన, జుట్టు మీద నూనె ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఎక్కువ నూనె రాసుకోవడం వల్ల దురద సమస్య పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టు రాలే ప్రమాదం కూడా పెరుగుతుంది. అయినా కూడా మీరు జుట్టుకు నూనె రాయాలనుకుంటే జుట్టు చివర్లకు రాయండి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు చాలా కొంచెం నూనెను జుట్టుకు అప్లై చేయండి.
Also Read: ఇలా చేస్తే.. ముఖంపై మంగు మచ్చలు పూర్తిగా మాయం
మీకు ఫోలిక్యులిటిస్ ఉంటే నూనెకు దూరంగా ఉండండి:
ఫోలిక్యులిటిస్ అనేది బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే సాధారణ జుట్టు స్కాల్ప్ సమస్య. ఈ స్థితిలో జుట్టు తలపై చిన్న మొటిమలు, వాపు, దురద, దద్దుర్లు వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో ఆయిల్ కు దూరంగా ఉండాలి. నిజానికి నూనెను అప్లై చేయడం వల్ల ఫోలిక్యులిటిస్ సమస్య మరింత తీవ్రమవుతుంది.