Holi Colour: అందరూ ఏడాది పొడవునా ఎదురుచూసే పండగ హోలీ పండుగ. ఈ రోజు పిల్లలు , పెద్దలు రంగులతో సరదాగా ఆడుకుంటారు. హోలీ సమయంలో రంగులతో ఆడుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది. కానీ చర్మం,జుట్టు గురించిన ఆందోళనలు కూడా అలాగే ఉంటాయి. చాలా మందిలో స్నానం చేసిన తర్వాత రంగు పోతుందా లేదా అనే టెన్షన్ ఉంటుంది.
హోలీ ఆడటం ఎంత సరదాగా ఉంటుందో, ముఖం, చేతులు, కాళ్ళ నుండి రంగులను తొలగించడం కూడా అంతే ఇబ్బందిగా ఉంటుంది. మీరు శాశ్వత రంగులతో హోలీ ఆడినట్లయితే ఈ సమస్య మరింత పెరుగుతుంది. కొన్నిసార్లు శాశ్వత రంగులు పూర్తిగా పోవడానికి ఒక వారం వరకు పడుతుంది. ఇలాంటి సమయంలో మీకు కొన్ని రకాల టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మరి వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హోలీ రంగులు చర్మంపై ఎక్కువసేపు ఉంటే.. అది చర్మంపై దురద, అలెర్జీలకు కారణమవుతుంది. ఇలాంటి సమయంలో హోం రెమెడీస్ రంగును తొలగించడంతో పాటు.. చర్మ సమస్యలను తొలగించి చర్మాన్ని మెరిసేలా , మృదువుగా చేస్తాయి.
బియ్యం పిండి స్క్రబ్ : ముఖంపై ఉన్న రంగు వల్ల వచ్చిన మచ్చలను తొలగించడంలో బియ్యం పిండి స్క్రబ్ ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇది సహజ స్క్రబ్ లాగా పనిచేస్తుంది. దీన్ని అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ కూడా తొలగిపోతుంది. రైస్ స్క్రబ్ తయారు చేయడానికి.. ముందుగా కాస్త బియ్యం పౌడర్‌లో కాస్త తేనె కలిపి ఫేస్ ప్యాక్ సిద్ధం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ ను శరీరం మొత్తానికి అప్లై చేయండి. ఈ పేస్ట్ తో శాశ్వత రంగు కూడా పోతుంది. అంతే కాకుండా ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
తేనె- పాలపొడి: తేనె చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పాలపొడి, తేనెతో తయారుచేసిన పేస్ట్ చాలా శరీరంపై పడ్డ రంగును తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది. దీన్ని తయారు చేయడానికి మీరు పచ్చి పాలను కూడా ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో పాలు, పాల పొడిని తీసుకుని దానిలో తేనె వేసి, ఆపై పేస్ట్ లాగా తయారు చేయండి. తర్వాత దీనిని చర్మంపై పూసి సున్నితంగా రుద్దండి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే రంగు సులభంగా పోతుంది.
శనగపిండి, పసుపు పేస్ట్ : శనగపిండి, పసుపుతో తయారు చేసిన పేస్ట్ ఒక సాంప్రదాయ పేస్ట్. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. ఇదిలా ఉంటే హోలీ వల్ల వచ్చిన రంగు శాశ్వతంగా ఉంటే, ముందుగా సబ్బుతో శుభ్రం చేసి ఆపై శనగపిండి, పసుపు కలిపి తయారు చేసిన పేస్ట్ రాసి, ఆపై స్క్రబ్ చేసి కడగాలి. ఇది రంగును తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చర్మానికి మునపటి రంగును తీసుకువస్తుంది.
Also Read: అమ్మమ్మల కాలం నాటి ఈ చిట్కాలు పాటిస్తే.. అమ్మాయిలే అసూయపడే అందం
పచ్చి బొప్పాయి : హోలీ రంగును తొలగించడానికి పచ్చి బొప్పాయి, పాలతో తయారు చేసిన పేస్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని కోసం పచ్చి బొప్పాయిని రుబ్బుకుని దానికి కొంచెం పచ్చి పాలు కలపండి. ఈ మిశ్రమానికి ముల్తానీ మిట్టి , బాదం నూనె కూడా కలపండి. ఇప్పుడు ఇలా తయారుచేసిన ఈ పేస్ట్‌ను ముఖం, చేతులు, కాళ్లపై అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత దీనిని వాష్ చేయండి. ఇలా చేయడం ద్వారా శాశ్వత రంగు పూర్తిగా తొలగిపోతుంది.